. సీఎంలిద్దరూ ముందు నీటి వాటాల సంగతి తేల్చుకోవాలి
. ట్రంప్ గులాంలా ప్రధాని మోదీ వ్యవహారం
. నారాయణ విమర్శ
విశాలాంధ్ర – హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు ఓవర్ యాక్షన్ వల్లే బనకచర్ల వివాదం తలెత్తిందని, రూ.82 వేల కోట్లతో ఆ ప్రాజెక్టును చేపట్టారని, అది పూర్తయ్యే నాటికి రూ.2 లక్షల కోట్ల వ్యయమవుతుందని, ఈ ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటు న్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశం సంక్షోభంలో పడిరదన్నారు. స్థానిక మఖ్దూం భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ శాసనసభా పక్ష నాయకులు కూనంనేని సాంబశివ రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళవేణి శంకర్, తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు, ఎం.బాల్ నర్సింగ్‌తో కలిసి నారాయణ మాట్లాడారు. కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా బనకచర్ల ప్రాజెక్టు ఉందని, బీజేపీ కనుసన్నల్లోనే కాంట్రాక్టర్లు ఉన్నారని తెలిపారు. కాంట్రాక్టర్ల పెట్టుబడితో ప్రాజెక్టు చేస్తే భవిష్యత్‌లో టోల్ గేట్ దగ్గర వాహనాలకు డబ్బులు వసూలు చేసినట్లు నీటికి డబ్బులు వసూలు చేస్తారని మండిపడ్డారు. బనకచర్లను పోలవరానికి లింకుపెట్టి… సముద్రంలోకి వెళ్లే నీటితోనే బనకచర్ల కడుతున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారని తెలిపారు. ముందు రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించి, నీటి వాటాలు తేల్చిన తర్వాత ప్రాజెక్టులు నిర్మించుకోవాలని స్పష్టం చేశారు. ఈ బాధ్యతను కేంద్ర జల సంఘానికి అప్పగించాలని నారాయణ అన్నారు. భారతదేశానికి తలవంపులు తెచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గులాంలా వ్యవహరిస్తు న్నాడని, ఇజ్రాయిల్‌కు మద్దతు ఇవ్వాలని, పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎగదోస్తున్నా అడ్డుకోవద్దని ట్రంప్ చేస్తున్న ఒత్తిళ్లకు మోదీ తలొగ్గారని మండిపడ్డారు. భారత్‌కు తలవంపులు తెచ్చేలా మోదీ పాలన సాగుతోందన్నారు. బ్యాంకులను లూటీ చేసిన వారు విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడుపుతు న్నారని విమర్శించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్… భారతీయ విద్యార్థులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. రష్యా, ఇరాన్ తక్కువ ధరకు ఆయిల్ విక్రయిస్తామంటే కొనుగోలు చేయనివ్వడం లేదని ధ్వజమెత్తారు. పుదుచ్చేరి ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కేంద్రం దానిని ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అక్కడ ముఖ్యమంత్రికి కనీసం క్లర్క్‌ను కూడా బదిలీ చేసే అధికారం లేదని తెలిపారు. తమిళనాడు, కేరళలో గవర్నర్లు కేబినెట్ నిర్ణయాలను అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. తమ తాబేదర్ల ప్రభుత్వం ఉండాలి తప్ప ఇతరులు ఉండొద్దనే విధంగా కేంద్ర ప్రభుత్వ తీరు ఉందన్నారు. విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, ధరల అదుపు కోసం ఉధృతంగా పోరాటాలు చేయాలన్నారు. వారు చెప్పిన వాళ్లే ఓట్లు వేసే విధంగా బీహార్‌లో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్… బీజేపీ పప్పెట్‌గా మారిందని విమర్శించారు. నక్సలైట్లు యుద్ధం ఆపినప్పటికీ వారిని చంపుతున్నారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నంబాల కేశవరావు యుద్ధం ఆపి, చర్చలకు సిద్ధమని ప్రకటించిన తరువాత కూడా చంపేశారని, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని అన్నారు. మణిపూర్‌లో సారవంతమైన కొండలు, గనులు ఉన్నాయని, వాటిని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు కేంద్రం కుట్రలు అమలు చేస్తోందని తెలిపారు. రామ్ బాబాకు విశాఖలో భూములు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడంపై మండిపడ్డారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన విధంగానే పాలన సాగుతోందని విమర్శించారు.


