- విపత్తు నియంత్రణ శాఖ డిజి ప్రతాప్
విశాలాంధ్ర – శ్రీకాకుళం: షాపింగ్ మాల్స్ లో బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకుంటే అగ్ని ప్రమాదాల సంభవించే సమయంలో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడవచ్చని రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ సూచించారు. గత జనవరి 25న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో జరిగిన అగ్నిప్రమాదం అనంతరం రెనోవేట్ చేసిన భవనాన్ని పరిశీలించడానికి విచ్చేసిన డిజి అదే షాపింగ్ మాల్ లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాత్రికేయుల సమావేశంలో డీజే మాట్లాడుతూ సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది 6 గంటల పాటు తీవ్ర ప్రయత్నం చేసి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారని తెలిపారు. అయితే షాపింగ్ మాల్స్ అన్ని కాంక్రీట్ బాక్సులుగా నిర్మించి నిర్వహిస్తున్నందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అగ్ని ప్రమాదాల సమయంలో తీవ్ర పొగ ధాటికి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందన్నారు. ఆరోజు జరిగిన అగ్నిప్రమాదంలో షాపింగ్ మాల్ సిబ్బంది తీవ్ర ఆవేద వెలిబుచ్చారని తెలిపారు. కాంక్రీట్ బాక్సులలా నిర్మించిన షాపింగ్ మాల్ వల్ల పది రోజుల క్రితం ఇరాన్ లో ఒక ప్రమాదం జరిగి 82 మంది మృతి చెందడం జరిగిందన్నారు. ఇటువంటి సమస్యలకు పరిష్కారంగా ఓపెన్ ప్లేస్ లో బ్రీతింగ్ బాల్కనీలో ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని తెలిపారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఏర్పాటుచేసిన బ్రీతింగ్ బాల్కనీ, మెట్ల మార్గాన్ని పరిశీలించారు. బ్రీతింగ్ బాల్కనీల వల్ల స్మోక్ మేనేజ్మెంట్ కు ఆస్కారం లభిస్తుందని తద్వారా ప్రణాపాయల నివారించవచ్చని వివరించారు. ముఖ్యంగా ప్రజలు అవగాహన పెంపొందించుకొని కాంక్రీట్ బాక్సుల్లా నిర్మించిన షాపింగ్ మాల్స్ ను బాయ్ కట్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇండియా షాపింగ్ మాల్ కు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ను అందజేశారు. ఈ పాత్రికేయ సమావేశంలో రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఎన్ నిరంజన్ రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ జై మోహన్ రావు, సహాయ ఫైర్ ఆఫీసర్ కే శ్రీనుబాబు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రీజినల్ మేనేజర్ పి నవీన్ తదితరులు పాల్గొన్నారు.


