అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. భారత్‌పై 20 శాతం నుంచి 25 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం భారత్- అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే.. డెడ్‌లైన్ కంటే ముందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలపై భారీగా దిగుమతి సుంకాల్ని విధించారు. ముందుగా కెనడా, మెక్సికోలపై సుంకాలు ప్రకటించిన ట్రంప్.. ఆ తర్వాత చైనా, భారత్, యూరోపియన్ యూనియన్, రష్యా, జపాన్ ఇలా అన్ని దేశాలపైనా సుంకాల్ని ప్రకటించారు. ఆ తర్వాత మెల్లగా ఆయా దేశాలపై ఒత్తిడి పెంచి.. సుంకాలకు సంబంధించి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. భారతదేశం కూడా ఈ లిస్టులో ఉంది. ఇటీవల రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ఏకంగా 100 శాతానికిపైగా సుంకాలు విధిస్తామని అమెరికాహెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ సంగతి పక్కనబెడితే ప్రస్తుతం భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు నడుస్తున్నాయి.
ఇక్కడే ఒకవైపు చర్చలు సాగుతుండగానే.. మరోవైపు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్‌పై సుమారు 20 శాతం నుంచి 25 శాతం వరకు దిగుమతి సుంకాల్ని విధించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై దిగుమతి సుంకాలకు సంబంధించి ఆగస్ట్ 1 డెడ్‌లైన్ విధించగా.. దీనికి ముందుగానే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదని వెల్లడించారు ట్రంప్. స్కాట్లాండ్ నుంచి వాషింగ్టన్కు తిరిగి వస్తున్న సందర్భంగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్.. అమెరికాకు మంచి మిత్రుడే అయినప్పటికీ.. ఆ దేశం మాత్రం ఎక్కువ సుంకాలు విధిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. చర్చల కోసం గడువు పొడిగించినప్పటికీ.. ట్రంప్ కొన్ని దేశాలతో మాత్రమే ఒప్పందాల్ని కుదుర్చుకున్నారు. అమెరికా ఎగుమతుల కోసం.. భారత మార్కెట్‌ను మరింతగా ఉపయోగించుకునేందుకు ఆ దేశం అంగీకారం కోసం మరికొంత సమయం కావాలని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమీసన్ గ్రీర్ సోమవారం అన్నారు.
అయితే ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. కానీ ఈ సుంకాల వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌పై సుంకాలు విధించే అంశంపై ట్రంప్ చేసిన ప్రకటన.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారగా.. ఈ ప్రకటన రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.


