Homeప్రధాని అవమానించారు

ప్రధాని అవమానించారు

- Advertisement -

ప్రతిపక్షాల ఆగ్రహం- రాజ్యసభ నుంచి వాకౌట్‌

న్యూదిల్లీ:ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు రావాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టారు. ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చలో ఆయన పాల్గొనాలని, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బుధవారం ప్రధాని గైర్హాజరు కావడంపై రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ప్రధానిని పిలవండి అంటూ డిమాండ్‌ చేశారు. ప్రధానిని సభకు రమ్మనండి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యులను బుజ్జగించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రయత్నించారు. ‘మీ ప్రశ్నలకు నేను సమాధానం చెబుతా’ అని ఆయన అన్నారు. కానీ ప్రతిపక్ష సభ్యులు ఆయన మాటలు బేఖాతరు చేస్తూ ‘పీఎం కో బులావో’ (ప్రధానిని పిలవండి)… ‘ప్రధాని రావాలి, సమాధానం ఇవ్వాలి’ అని నినాదాలు చేశారు. ‘ప్రధాని కార్యాలయంలో ఉన్నారని, నేను సమాధానం, స్పష్టత ఇవ్వగలిగినప్పుడు ఆయన రావడం ఎందుకు’ అంటూ విపక్ష సభ్యులతో అమిత్‌షా అన్నారు. ఆయన ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష సభ్యులంతా తమ స్థానాల్లో నుంచి లేచి… నినాదాలతో సభను హోరెత్తించారు.
గందరగోళం మధ్య ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖడ్గే మాట్లాడుతూ ‘ప్రధాని పార్లమెంటు ఆవరణలోనే ఉండి సభకు హాజరు కాకపోవడం అవమానం’ అని అన్నారు. దీనికి అమిత్‌షా స్పందిస్తూ ‘ప్రధానిని ఎందుకు పిలవాలి… నేను సమాధానం చెబుతున్నా కదా’ అన్నారు. దీనికి ఖడ్గే స్పందిస్తూ ‘సమాధానం ఇచ్చే సామర్థ్యం మీకు లేదని కాదు… కానీ ఈ ప్రశ్నలన్నీ ప్రధాని మోదీకి ఉద్దేశించినవి’ అని తెలిపారు. మోదీ ఇక్కడే ఉండి రాకుండా రాజ్యసభను అగౌరపరుస్తున్నారని ఖడ్గే చెప్పారు. అనంతరం అమిత్‌ షా ప్రసంగాన్ని బహిష్కరిస్తూ ప్రతిపక్ష సభ్యులంతా సభ నుంచి వాకౌట్‌ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు