. నీతి ఆయోగ్ తరహాలో ప్రణాళికా విభాగం నిర్వహణ
. ఈ ఏడాది తలసరి ఆదాయ లక్ష్యం రూ.3,47,871
. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై సమీక్షలో చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి… పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణాలు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. ఆగస్టు 15 నుంచి ఆన్లైన్లో 700 ప్రభుత్వ సేవలందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై ప్రణాళికా శాఖ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. తలసరి ఆదాయం పెంపుతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని సీఎం అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ. 3,47,871 సాధించాలని, దానికి అనుగుణంగా 2029 నాటికి రూ.5.42 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘ప్రభుత్వ శాఖలు ఆయా రంగాల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక లక్ష్యాలకు అనుగుణంగా విజన్‌తో పనిచేయాలి. ప్రపంచం పోకడలను గమనిస్తూ అవకాశాలు అందుకోవాలి. ప్రజలను, సమాజాన్ని, కుటుంబాలను, వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేయాలి. అత్యుత్తమ టెక్నాలజీని పాలనకు అనుసంధానించి… మెరుగైన సేవలు అందించాలి. ఆరోగ్యం నుంచి వ్యవసాయం వరకు టెక్నాలజీని భాగస్వామి చెయ్యాలి. ప్రజల కోసం విజన్ రూపొందించుకుని పర్యావరణం దెబ్బతినకుండా టెక్నాలజీని అనుసంధానం చేస్తూ పాలన సాగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అందుకే పీపుల్, విజన్, నేచర్, టెక్నాలజీ అంశాలకు పాలనలో ప్రాధాన్యం ఇస్తూ సమన్వయంతో పనిచేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. ఆ దిశగా అధికారులు, ఆయా శాఖలు పనిచేయాలి’ అని సీఎం సూచించారు.
మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యం
ఆర్థికాభివృద్ధితో పాటు రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. ‘అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి. ఉత్తమ సమాజం, ఉత్తమ జీవన ప్రమాణాలు తీసుకువచ్చేలా ప్రభుత్వ శాఖలు పని చేయాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు ఎలా నిర్దేశిస్తున్నారో పరిశీలించండి. ప్రతీ రంగంలోనూ ఏపీ ముఖ్య భూమిక పోషించాలి. గ్రామస్థాయి నుంచి కుటుంబం వారీగా పర్యవేక్షణ జరగాలి. లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం ఇచ్చే నిధులకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించండి. ప్రతీ కుటుంబం తాలూకు ఆర్థిక, ప్రజారోగ్య వివరాలు నమోదు కావాలి. ఫారెస్టు గ్రీన్ కవర్, ఎయిర్ క్వాలిటీ, తలసరి విద్యుత్ వినియోగం… ఇలా అన్ని అంశాలను ఆయా శాఖలు నమోదు చేయాలి. కేవలం ఆదాయం, సంపద సృష్టికి మాత్రమే పరిమితం కావొద్దు’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రతి విభాగానికీ ఓ సూచిక
వివిధ రంగాల్లో ఫలితాలు సాధించేందుకు ఏ ప్రమాణాల్ని నిర్దేశించుకున్నారనేది కూడా కీలకమని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం అవేర్ ద్వారా 42 అంశాలను కొలుస్తున్నామని, వివిధ ప్రభుత్వ శాఖలు కూడా ఇదే స్థాయిలో ప్రమాణాలు నిర్దేశించుకుని ఇండికేటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్, రవాణా, జలవనరులు, పరిశ్రమలు, స్వచ్ఛాంధ్ర… ఇలా అన్ని విభాగాలూ ఇండికేటర్లను నిర్దేశించుకోవటం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రమాణాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఉన్నాయో… ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సమీక్షలో మంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్ కె.విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


