రూ.25 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: విజయవాడలో ఏసీబీ అధికారుకులకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. సాయి కన్‌స్ట్రక్షన్స్ అధినేత కృష్ణంరాజు నుంచి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఈఎన్‌సీ అబ్బవరపు శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. కాంట్రాక్టర్ గిరిజన ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించారు. వీటికి సంబంధించి సుమారు 35 కోట్ల రూపాయల మేర బిల్లులు ప్రభుత్వం నుంచి రావల్సి ఉంది. ఇందుకుగాను కృష్ణంరాజు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే బిల్లుల చెల్లింపు కోసం గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ కాంట్రాక్టర్‌ను రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. ఈ నెలాఖరుకే శ్రీనివాస్ రిటైర్ కానున్నారు. అందినకాడికి దండుకోవాలన్న అత్యాశతో కాంట్రాక్టర్ కృష్ణంరాజు వద్ద పెద్దమొత్తంలో ఆశించారు. అంతమొత్తం ఇవ్వలేమని, వాటిలో అంత మిగలదని, బిల్లులు ఆలస్యం కావడం వల్ల ఇప్పటికే వడ్డీలు చెల్లిస్తూ నష్టపోయామని కృష్ణంరాజు తన ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఇవేమీ పట్టించుకోని ఈఎన్సీ శ్రీనివాస్ తాను అడిగినవి ఇస్తే తక్షణమే రూ.35 కోట్ల బిల్లుల చెల్లింపునకు సహకరిస్తానని భారీగా లంచం డిమాండ్ చేశారు. దీంతో గుత్తేదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల సూచన మేరకు రూ.50 లక్షలు ఇస్తానని కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఈఎన్సీని ఒప్పించారు. వీటిలో ముందుగా రూ.25 లక్షలు ఇస్తానని, బిల్లులు మంజూరు చేసిన తర్వాత మరో రూ.25 లక్షలు ఇస్తానని నమ్మించారు. ఇందుకు శ్రీనివాస్ అంగీకరించాడు. ఆ మేరకు గురువారం కాంట్రాక్టర్ రూ.25 లక్షలు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని ఈఎన్‌సీని పట్టుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్దమొత్తంలో అవినీతి డబ్బు పట్టుబడలేదని, ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు మీడియాకు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత మాత్రం ఇదే పెద్ద అవినీతి కేసు అని ఆయన వెల్లడిరచారు.


