Homeఒకే ఇంట్లో 80 ఓట్లు

ఒకే ఇంట్లో 80 ఓట్లు

- Advertisement -

. మహదేవపురలో లక్షకుపైగా నకిలీ ఓటర్లు
. జాబితాల్లో సరైన ఊరు, పేరు, ఫొటోలేని వారు వేల మంది
. ఒక వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు
. బీజేపీతో ఈసీ కుమ్మక్కుతోనే అక్రమాలు
. ఐదు వేర్వేరు తేదీల్లో జరిగిన ఓట్ల చోరీ
. రాహుల్‌ గాంధీ ‘అణు బాంబు’ సాక్ష్యం

న్యూదిల్లీ: బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కు అయిందని, ఐదు వేర్వేరు తేదీల్లో ఓట్లను దొంగలించిందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కర్నాటక మహదేవపురలో లక్షకుపైగా నకిలీ ఓటర్లు ఉన్నారని, ఒక్క ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నట్లు చూపించారన్నారు. గత లోక్‌సభ ఎన్నికలు, ఆపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై ఆరు నెలల అధ్యయనం వల్ల ఎన్నికల సంఘం మోసాలను వెలుగులోకి తెచ్చే ‘అణు బాంబు’ సాక్ష్యంతో ప్రజల ముందరకు వచ్చినట్లు రాహుల్‌ గాంధీ వెల్లడిరచారు. దిల్లీలో గురువారం నిర్వహించిన భారీ విలేకరుల సమావేశంలో ఆయన తమ వద్ద ఉన్న ఆధారాలను వివరించారు. బీహార్‌ ఎస్‌ఐఆర్‌పై అనుమానాన్ని వ్యక్తం చేశారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని, నకిలీ ఓటర్లు వేలల్లో లక్షల్లో చేరారనిఇందుకు పక్కా ఆధారాలు ఉన్నాయంటూ వివిధ నియోజకవర్గాల ఎన్నికల జాబితాలను మీడియా ముందుర ఉంచారు. తాము కోరిన వివరాలను ఈసీ వెల్లడిరచడం లేదని, గత 10`15 ఏళ్ల డేటా, సీసీటీవీ ఫుటేజి ఇవ్వలేదని, తద్వారా ఓట్ల చోరీలో భాగస్వామిగా చెప్పకనే చెబుతోందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ‘మనం ఎంతగానో ప్రేమించే ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ జోక్యం అవసరం’ అని అన్నారు. మహదేవపురలో ఒకే పేరు, ఒకే ఫోటో, ఒకే చిరునామా ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయని, సింగిల్‌ బెడ్రూమ్‌ ఇంటిలో 48 ఓట్లు ఉండగా, ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్టు చూపించారన్నారు. అడ్రస్‌ లేకుండానే ఓటర్‌ ఐడీ కార్డులు ఉన్నాయని… ఓటర్ల జాబితాలో పేర్లున్నాయి కానీ ఫోటోలు సరిగా లేవని తెలిపారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానం ఉందని చెప్పారు. బీహార్‌లో లక్షల ఓట్లను తొలగించారని, దీనికి ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. హర్యానా, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిరదని, బీజేపీ కోసం ఓట్లు దొంగిలించిందని, అందుకే ఎగ్జిట్‌ పోల్స్‌కు, ఫలితాలకు చాలా తేడా ఉందన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలు లభించినట్లు తెలిపారు. పోలింగ్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను మాయం చేశారని, సాయంత్రం 5 గంటల తర్వాత భారీగా పోలింగ్‌ నమోదైందని రాహుల్‌ ఆరోపించారు. మహారాష్ట్రలో 40 లక్షల రహస్య ఓటర్లు చేరారని, ఎలక్ట్రానిక్‌ డేటా, ఓటర్ల జాబితాను ఈసీ తమకు ఇవ్వలేదని వెల్లడిరచారు. ఐదు వేర్వేరు తేదీల్లో ఈసీ ఓట్లు దొంగిలించిందని ఆరోపించారు. కర్నాటకలోని మహదేవ్‌పూర్‌లో ఓట్ల చోరీ జరిగిందన్నారు. ఒకే ఓటరు పేరు నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లో చేర్పించారని, 11 వేల మంది వేర్వేరు కేంద్రాల్లో ఓటేశారని రాహుల్‌ వెల్లడిరచారు. ఒకే ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నట్టు చూపించారన్నారు. మహదేవపురలో 11,965 మంది నకిలీ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఒకే ఓటరు కర్నాటక, మహారాష్ట్ర, యూపీలో ఓటు వేశాడన్నారు. మహదేవ్‌పూర్‌లో లక్షా 250 ఓట్లు దొంగిలించారని, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గం, మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గం ఓటరు డేటాను విశ్లేషించినట్లు తెలిపారు. లోక్‌సభ స్థానంలో మొత్తంగా కాంగ్రెస్‌కు 6,26,208 ఓట్లు రాగా, బీజేపీకి 6,58,915 ఓట్లు వచ్చాయని, రెండు పార్టీల మధ్య 32,707 ఓట్ల తేడా ఉందని చెప్పారు. మొత్తం ఏడుకుగాను ఆరు స్థానాల్లో కాంగ్రెస్‌ గెలిచిందని, మహదేవపురలో మాత్రమే 1,14,000 ఓట్లతో ఓడిపోయిందన్నారు. 1,00,250 ఓట్ల దొంగతనం జరిగిందని, 40,009 మంది ఓటర్లవి నకిలీ లేదా చెల్లని చిరునామాలు ఉన్నాయని, 10,452 బల్డ్‌ ఓటర్లు, చెల్లని ఫొటోలతో 4,132 మంది, కొత్త ఓటర్ల ఫారం 6 దుర్వినియోగించిన 33,962 ఓటర్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని రాహుల్‌ వివరించారు.
తక్కువ మెజారిటీతో ప్రధానమంత్రి అయిన ప్రధాని అధికారం కోసం 25 స్థానాలు ‘దొంగలించారు’ అని వ్యాఖ్యానించారు. 33వేల కంటే తక్కువ ఓట్లతో 25 స్థానాల్లో బీజేపీ గెలిచిందన్నారు. కర్నాటకలోని 16 పార్లమెంట్‌ స్థానాల్లో గెలుస్తామని అంచనా వేస్తే, కాంగ్రెస్‌ 9 సీట్లలోనే గెలించింది. మహానాష్ట్రలో వయోజనుల కంటే ఓటర్లు అధికంగా నమోదయ్యారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని అక్కడి ఫలితాలతో అర్ధమైంది’ అని రాహుల్‌ అన్నారు. ‘ఎన్నికలను పరిశీలించినప్పుడు. ‘ఒక వ్యక్తి, ఒక ఓటు’ అన్నదే ప్రాథమిక ఆలోచన. అర్హులైన ఓటర్లే ఓటేస్తున్నారా? నకిలీ ఓటర్లు చేరారా? ఓటర్ల జాబితా సరైనదేనా? లోపాలు ఉన్నాయా? అనే చూస్తాం. కానీ బీజేపీ విషయంలో అంచనాలన్నీ తారుమారు అవుతాయి. అంతర్గత సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ మారిపోతాయి’ అని వ్యాఖ్యానించారు. 2023 చత్తీస్‌గఢ్‌ ఎన్నికలప్పటి నుంచి ఎన్నికల మోసాలపై కాంగ్రెస్‌కు అనుమనం ఉందని చెప్పారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ అనుమానం మరింత బలపడిరదని అన్నారు. ‘నేను రాజకీయ నాయకుడిని. నేను ప్రజలతో మాట్లాడుతున్నా. ఇదే నా ప్రతిజ్ఞగా పరిగణించాలి’ అని రాహుల్‌ వక్కాణించారు. రాహుల్‌ గాంధీ తప్పుగా మాట్లాడినట్లు ఎన్నికల సంఘం చెప్పలేదని ఆయన ఉద్ఘాటించారు. ఇదిలావుంటే, కర్నాటక ఓటర్ల జాబితాపై రాహుల్‌ ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్పందించింది. ‘ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చారని, అర్హులైన ఓటర్లను తొలగించారని రుజువు చేసేందుకు సంబంధిత ఓటర్ల వివరాలను డిక్లరేషన్‌ రూపంలో ఇవ్వడం, అవసరమైన చర్యలు తీసుకుంటాం’ అంటూ రాహుల్‌కు ఒక లేఖ పంపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు