Homeవిశ్లేషణఆల్‌ ఫ్రీ` అంతా అప్పే

ఆల్‌ ఫ్రీ` అంతా అప్పే

- Advertisement -

రా బావ ఏంటి సంకలెగరేసుకుంటూ ముసిముసి నవ్వులతో భూమి మీద తేలిపోతే నడుస్తూ వస్తున్నావ్‌. ఏంటి కథ అంత సంతోషమెందు కొచ్చిందయ్యా. భలేవాడివయ్యా సంతోషమెందుకని నిదానంగా నిస్సారంగా అడుగుతావేమిటయ్యా. రోజూ పేపరు చదువుతావు కద. రేపు ఆగస్టు పదిహేను స్పెషల్‌ ఏమిటో తెల్సు కద. అవును స్త్రీలకు ఉచిత బస్సు అంతేకద. భలే వాడివయ్యా ఇంతేగా అని నీరసంగా చెబుతావేంటయ్యా. నాకు మాత్రం ఆల్‌ ఫ్రీనే అయ్యా. భోజనం పెడుతున్నారు. మాకు ఇంట్లో ఉన్న వారందరికీ ఫ్రీ భోజనం. నివాసానికి ఫ్రీగా స్థలాలిచ్చారు. ఎంతో కొంత కట్టినా కట్టకపోయినా వాయిదాల పద్ధతిలో కట్టమని ఇల్లు కట్టిస్తున్నారు. కట్టకపోయినా ఖాళీ చేయించరని ప్రజలందరికి తెలుసు. కాబట్టి ఇల్లు ఫ్రీ. భోజనం ఫ్రీ. ఇక ఆ వూరు ఈ వూరు తిరగడానికి పెళ్లిళ్లకు ఇతరాలకు నా బదులు మా ఆవిడ ఫ్రీ బస్సులో వెళ్లి వస్తుంది. పిల్లల చదువులు ఫ్రీ. అందుకే అంటున్నా వంటచేసే పనిలేదు. ప్రభుత్వమే కడుపు నింపుతోంది. ఇకపోతే సారా తాగే అలవాటు మానితే ఇక ఆలోచించనవసరంలేదు. ఒకవేళ మానకపోతే వారానికి ఒకరోజు పనికి వెడితే సరిపోతుంది. ఇంక కావలసినవి బట్టలు. అప్పుడప్పుడు ఎన్నికల ముందు స్త్రీలకు చీరలు పంచిపెడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మగవారికి కూడ పంచవచ్చు. పిల్లలకు యూనిఫారం డ్రస్సులు పంచుతూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పు నవ్వుతూ గంతులేయక విచారంగా ఉండాల్సిన అవసరం ఏంటి. ఉద్యోగాలిస్తాం అంటున్నారు. ప్రభుత్వమే చదివించి ఉద్యోగాలిస్తే మనం పిల్లల గురించి ఆలోచించవలసిన అవసరం ఏముంది. అందుకే అంటున్నా బాబు వచ్చాక ఆల్‌ ఫ్రీ చేసి మనల్ని సంతోషపెడుతున్నాడుగ. నువు చెప్పేది నిజమేనయ్యా. కాని నువు అల్ప సంతోషిగా ఆ మాత్రానికే సంతోషపడుతున్నావు. కాని చెరువులో చేపలను ఎరవేసి వాటిని పట్టి చంపుకు తిన్నట్లు ఆల్‌ ఫ్రీ అని మనకు ఎరవేసి మనల్ని మత్తులో ముంచి మనవి కోట్ల ఆస్తులు కంపెనీలకు దారాదత్తం చేసి మన ఖజానా ఖాళీ చేస్తున్నారనేది నీకు తెలియడంలేదు. మనం మన సమస్యలు పరిష్కరించమని ఎన్నుకుంటే మన అనుమతి లేకుండానే మనవి కోట్ల ఆస్తులు ఇతరులకు ఫ్రీగా ఇస్తున్నారు. పరిశ్రమలు పెడితే ఉద్యోగాలు వస్తవని చెబుతున్నారు. ఎవరో పరిశ్రమలు పెడితే వారు నిర్ణయించిన జీతాలకే మన పిల్లలు పని చేయాలి. సమ్మె చేయడానికి వీలులేదు. ఒకవేళచేస్తే లాకవుటు అని బెదిరిస్తారు. చచ్చినట్టు ఇచ్చిన జీతాలకు తలవొంచి పని చేయాల్సిందే. అంటే మన భూములు వారికిచ్చి పని ఇచ్చినందుకు వారికి తలవొంచి పని చేయవలసిందే.
అది సరేనయ్యా జిల్లా వరకే స్త్రీలకు ఫ్రీ బస్సు అనుకుంటే రాష్ట్ర మొత్తం ఫ్రీ అంటున్నారు. అసలు బస్సు ఫ్రీ గురించి ఎవరడిగారు. ఇందులో ఒక మెలిక ఉందని నాకు అనుమానమయ్యా. ఇప్పటికే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ముఖ్యమంత్రిగారు చెబుతూ జిల్లాకు పరిమితం చేయకుండా రాష్ట్రమంతా ఫ్రీ అని మూడు నాల్గు నెలలు తిప్పి కోట్ల రూపాయలు నష్టమొచ్చిందని ప్రభుత్వం నడపలేదని ప్రైవేటు పరం చేస్తాడేమోనని ఆర్‌టీసీ కార్మికులు కొందరు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. ఎన్నికల ముందు ఒకర్ని మించి మరొకరు ప్రజలకు ఎరవేసి చివరకు ప్రజల ఆస్తులు అమ్మడం ఎంత ఘోరమో ఆలోచించాలి. ఎవరు అడగకపోయినా ఏమేమి ఫ్రీగా ఇవ్వాలని ఆలోచించి పార్టీల వారే ప్రకటించడం ఆ విధంగా ప్రజలను మభ్యపెట్టి నాయకులు సొంత ఖజానా నింపుకోవడం జరుగుతోంది. ఈ విషయంలో కమ్యూనిస్టులు తప్ప ఎవరూ రోడ్డెక్కడం లేదు. అంతా ఉచితం పేరుతో అప్పులుచేసి తలసరి ఆదాయం తగ్గి తలసరి అప్పు పెరుగుతోంది. ప్రభుత్వం చేసే అప్పు ప్రజలే కట్టాలనే సంగతి తెలియక గంతులేస్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించాడని ఖజానా ఖాళీచేసి వెళ్లాడని మన ముఖ్యమంత్రి రోజుకొకసారి చెబుతూ జగన్‌ కంటే ఎక్కువ అప్పులు తెచ్చాడని విశ్లేషకులు వివరించి చెబుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితిలో అప్పుచేసి పప్పుకూడుతో సరిపెట్టక ఈ ఉచిత బస్సు ఎందుకో అర్థంకాదు. గతంలో ఆవుల గోపాలకృష్ణమూర్తి గూడకట్టు సంఘం అని కొందరికి పేరుపెట్టారు.
స్కూలు చదువుతో ఆపేసి ఉద్యోగం లేక పొలం పనులు చేయకుండా లుంగీ గూడకట్టుతో ప్రతి పల్లెలో సెంటరులో పేకాడుకుంటారని ఆయన పనిలేని యువతను విమర్శించారు. అలాగే పనిలేని స్త్రీలు ఇంట్లోని డబ్బులు తీసుకుని రాష్ట్రమంతా తిరిగొస్తారేమోనని కొందరి భయం. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని జగన్‌ను విమర్శిస్తూ తాను సంపద సృష్టిస్తానని చెప్పి ఇంట పన్నులు, కరెంటు బిల్లులు పెంచుతూ మరోపక్క జగన్‌ ఎత్తివేసిన ఉచిత భోజనం పునరుద్ధరించి అప్పులు తేవడం సంపద సృష్టించడమని భావించాలి. ఏది ఏమైనా చంద్రబాబు మొదటి నుంచి ప్రభుత్వానికి భారం తగ్గించి ప్రైవేటుపరం చేసే ఆలోచన కలవాడని అలాగే జగన్‌ ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తే చంద్రబాబు అప్పులు చూపి ప్రైవేటు పరం చేస్తాడేమోనని కొందరు ఆర్టీసీ కార్మికులు భయపడుతున్నారు. ఉచిత బస్సు వల్ల వచ్చే నష్టం తెలియనివాడు కాదని తెలిసే జిల్లా వరకని అందరూ వూహిస్తే దాన్ని రాష్ట్రానికి పెంచడంతో ఇటువంటి అనుమానాలు కలుగుతున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. స్మార్టు మీటర్ల పేరుతో కరెంటు బిల్లులు పెరిగాయని ప్రత్యక్షంగా ఉచితాలు చూపి పరోక్షంగా పన్నులు పెంచి ప్రభుత్వం తెలివి ప్రదర్శిస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా పదవులు కాపాడుకొని గద్దెనెక్కి సంపాదించుకోవడానికి అమాయక ప్రజల్ని ఉచితాల పేరుతో అప్పుల ఊబిలోకి నెట్టడం సముచితం కాదు.
సెల్‌:9885569394

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు