. కొత్తగా మరో ఆరు ఏర్పాటు
. రాజధాని కేంద్రంగా అమరావతి
. పలాస, మార్కాపురం, గూడూరు, మదనపల్లె, ఆదోని
. పాత జిల్లాల సరిహద్దులు, కొన్ని పేర్లూ మార్పు
. నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగనుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తామని చెప్పి, గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించింది. రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలుండగా, జిల్లాలు మాత్రం 26 అయ్యాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరగడం వల్ల కొన్ని ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ప్రజలకు సౌకర్యం మెరుగుపడకపోగా ఇబ్బందులు వస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. కొత్త జిల్లాలకు పేర్లు పెట్టడంలో కూడా ప్రజాభిప్రాయానికి భిన్నంగా సాగాయన్న ఆరోపణలు వచ్చాయి. కొన్ని జిల్లాల పేర్లు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, మండలాల విలీనంతోపాటు భౌగోళిక అంశాల ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని కూటమి ప్రభుత్వం అనేక సందర్భాల్లో విమర్శించింది. అధికారంలోకి వస్తే లోపాలను సరిచేస్తామని ఎన్నికలప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే ప్రజా అవసరాలకనుగుణంగా పాత జిల్లాల సరిహద్దులు మార్చి, అవసరమైన ప్రాంతాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, జిల్లాల పేర్లతో సహా సరిహద్దుల మార్పునకు కసరత్తు చేపట్టింది. ఈ నెల 6న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియలో లోపాలను సరిచేసి, మెరుగైన సూచనలతో నివేదికను నెలలోగా ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు ఇతర శాఖల మంత్రులు పి.నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్ధన్‌రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఉప సంఘం బుధవారం తొలిసారి భేటీ కానుంది. ఈ సమావేశం సచివాలయంలో జరుగనుంది. ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మేధావుల నుంచి జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశాలపై వినతులనూ స్వీకరించనున్నారు. వాటిని, గతంలో వచ్చిన అభ్యర్థనలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన వినతులు, అభ్యంతరాలను పరిశీలించిన మీదట మరో 6 కొత్త జిల్లాలు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. రాజధాని కేంద్రంగా అమరావతి జిల్లాతో పాటు, పలాస, మార్కాపురం, గూడూరు, మదనపల్లె, ఆదోని కేంద్రాలుగా కొత్త జిల్లాలు రానున్నాయి. మొత్తం 32 జిల్లాల రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. ఇందులో ఒకట్రెండు స్థానాల్లో మార్పులు, చేర్పులు కూడా ఉండొచ్చు. పునర్విభజనలో భాగంగా కొన్ని జిల్లాల కేంద్రాల మార్పు, రెవెన్యూ డివిజన్ల సర్దుబాట్లు ఉండే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు… గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశం జిల్లాలోకి మారనున్నట్లు సమాచారం. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అవకాశం ఉండగా, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం… పాలనా సౌలభ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతమున్న జిల్లాల నుంచి కొత్త జిల్లాలోకి కొన్ని నియోజకవర్గాలు చేరనుండగా, మార్పుల ప్రకారం ఈ క్రింది జిల్లా కేంద్రాల పరిధిలో ఆయా నియోజకవర్గాలు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు
1) పలాస: ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం.2) శ్రీకాకుళం: శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం.3) మన్యం పార్వతీపురం: పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ.4)విజయనగరం: విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి.5) విశాఖపట్నం: భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి.6) అల్లూరి సీతారామరాజు అరకు: అరకు, పాడేరు, మాడుగుల.7) అనకాపల్లి: అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని.8) కాకినాడ: కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం.9) తూర్పు గోదావరి రాజమహేంద్రవరం: రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం.10) బీఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం: అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట.11) పశ్చిమ గోదావరి నరసాపురం: తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం.12) ఏలూరు: ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం.13) కృష్ణా మచిలీపట్నం: కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు. 14) ఎన్టీఆర్ విజయవాడ: విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం.15) అమరావతి: పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ.16) గుంటూరు: గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు.17) బాపట్ల: బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు. 18) పల్నాడు నరసరావుపేట: నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ. 19) మార్కాపురం: మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి. 20) ఒంగోలు: ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండెపి, కందుకూరు. 21) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావాలి, కోవూరు, ఉదయగిరి. 22) గూడూరు: గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట. 23) శ్రీ బాలాజీ తిరుపతి: తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి. 24) చిత్తూరు: చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం. 25) మదనపల్లి: మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి. 26) సత్యసాయి హిందూపురం: హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర. 27) అనంతపురం: అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపర్తి. 28) ఆదోని: ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం. 29) కర్నూలు: కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడుమూరు. 30) నంద్యాల: నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం. 31) వైఎస్సార్ కడప: కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల. 32) అన్నమయ్య రాజంపేట: రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు


