2019 ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య వెనుక సూత్రధారి కడప మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డేనని వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్.కే. సింగ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు నిర్దేశిత గడువులో ముగిసినప్పటికీ, ఇంకా లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. నిందితులు బయట ఉండి సాక్ష్యాలను చెరిపేస్తున్నారని, సాక్షులను తీవ్రంగా బెదిరిస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా, సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై కూడా నిందితులు కేసులు పెట్టారని లూథ్రా వివరించారు. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదిస్తూ, దర్యాప్తులో అన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయని, నిందితులను అనవసరంగా గడువు లేకుండా జైల్లో ఉంచడం సరికాదని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందో లేదో స్పష్టం చేయాలని సీబీఐని ఆదేశించింది. అదే సమయంలో, సునీత, ఆమె భర్త, సీబీఐ అధికారి రాంసింగ్‌పై దాఖలైన కేసులను కొట్టివేస్తామని (క్వాష్) ధర్మాసనం స్పష్టం చేసింది. మొత్తం ఎనిమిది మంది నిందితుల బెయిల్‌ను రద్దు చేసే విషయంపై తగిన నిర్ణయం తీసుకోవాలని సీబీఐకి సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది.
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డే ప్రధాన సూత్రధారి
- Advertisement -


