Homeసీపీఐ 28వ రాష్ట్ర మహాసభలకు సర్వం సిద్ధం

సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలకు సర్వం సిద్ధం

- Advertisement -

. విస్తృత ఏర్పాట్లు
. నేడు భారీ ర్యాలీ, బహిరంగసభతో ప్రారంభం
. హాజరుకానున్న అగ్రనేతలు
. ఆకట్టుకుంటున్న హోర్డింగులు, ఫ్లెక్సీలు, కళారూపాలు, స్వాగత తోరణాలు

విశాలాంధ్ర బ్యూరో – ఒంగోలు : భారత కమ్యూనిస్టుపార్టీ (సీపీఐ) రాష్ట్ర 28వ మహాసభలకు ఒంగోలు నగరం ముస్తాబైంది. ఎర్ర జెండాలు, ఎర్ర తోరణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో ఒంగోలు నగరం ఎర్రబారింది. సీపీఐ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరగనున్న పార్టీ రాష్ట్ర మహాసభలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆహ్వాన సంఘం భారీ ఏర్పాట్లు చేపట్టింది. మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ గత నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి అధ్వర్యంలో కళా కారులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కళా జాతాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేపట్టారు. శనివారం సాయంత్రం 3 గంటలకు ఒంగోలులో స్థానిక నెల్లూరు బస్టాండ్‌ నుండి ఆర్టీసి బస్టాండ్‌ సమీపంలోని కొత్త కూరగాయల మార్కెట్‌ వరకు 25 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలైన నేపథ్యంలో జరుగుతున్న ఈ మహాసభలను ఆహ్వానసంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ వందేళ్లలో పేద, బడుగు, బలహీన, కార్మిక, కర్షక, ఉద్యోగ, శ్రామికవర్గాల కోసం చేసిన పోరాటాలు స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయి. నేటికీ పేద వర్గాల కోసం , సమాజ అభివృద్ధి కోసం అసమానతలు, అంటరానితనానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తోంది. ఈ తరుణంలో పోరాటాలకు పురిటిగడ్డగా ఉన్న ఒంగోలు మహానగరంలో మొట్టమొదటి సారి జరుగుతున్న సీపీఐ రాష్ట్ర మహాసభల జయప్రదానికి జిల్లా పార్టీ నాయకత్వం ప్రచార కార్యక్రమాలతో పాటు విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. ఎక్కడికక్కడ భారీ హోర్డింగులు, లెనిన్‌, భగత్‌సింగ్‌ విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజా పోరాటాలను ప్రతిబింబించే విధంగా ఫోటో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎర్రజెండా చేతపట్టి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరికి తోడు ప్రజా నాట్యమండలి కళాకారులు గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న కళాజాతాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గత రెండు రోజుల నుంచి ప్రజా నాట్యమండలి అధ్వర్యంలో ఒంగోలులోని సీవీఎన్‌ రీడిరగ్‌ రూమ్‌లో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి చంద్రనాయక్‌, పెంచలయ్య, రామకృష్ణ దగ్గరుండి కళా ప్రదర్శలను చేయిస్తుండగా మరో పక్క సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి జీ ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, ఆహ్వానసంఘం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు, ఆహ్వానసంఘం ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆర్‌ వెంకట్రావు ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. శనివారం జరిగే బహిరంగసభకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శి కే నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ తదితరులు హాజరై ప్రసంగించనున్నారు.
సభాస్థలికి ర్యాలీ కొనసాగేదిలా…
రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని వేలాదిమంది సీపీఐ శ్రేణులతో జరిగే భారీ ర్యాలీ మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు బస్టాండ్‌ వద్ద గల మున్సిపల్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ నుండి ప్రారంభమై కలెక్టరేట్‌, చర్చి సెంటర్‌, ట్రంకు రోడ్‌, మస్తాన్‌ దర్గా సెంటర్‌, పాత కూరగాయల మార్కెట్‌, అద్దంకి బస్టాండ్‌, కర్నూల్‌ రోడ్డు మీదుగా, ఆర్టీసీ బస్టాండ్‌, కొత్త కూరగాయల మార్కెట్‌ రోడ్డు గుండా ఊర చెరువులోని నూతనంగా ఏర్పాటు చేసిన సభాస్థలి వరకు సాగుతుంది. బహిరంగ సభ సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుంది. సభాస్థలికి కామ్రేడ్‌ గుజ్జుల యల్లమందారెడ్డి, సరళా దేవి సభా ప్రాంగణంగా నామకరణం చేశారు. అలాగే రాష్ట్ర మహాసభలు సంఘమిత్ర హాస్పిటల్‌ సమీపంలోని ఏర్పాటుచేసిన కామ్రేడ్‌ నల్లూరి అంజయ్య ప్రాంగణంలోని, కామ్రేడ్‌ పూల సుబ్బయ్య హాలులో నిర్వహించనున్నారు.

ర్యాలీలో పాల్గొనే వారికి విజ్ఞప్తి…
ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి హాజరయ్యే పార్టీ శ్రేణులు, కార్మికులు, శ్రమజీవులు, యువత, విద్యార్థులు, మహిళలు, ప్రజల కోసం నెల్లూరు బస్టాండ్‌ సమీపంలోని మున్సిపల్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ వద్ద ఉదయం 11 గంటల నుండి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ర్యాలీ కచ్చితంగా మధ్యాహ్నం 3 గంటల నుండి నెల్లూరు బస్టాండ్‌ నుండి ప్రారంభమవుతుంది. ర్యాలీలో పాల్గొనేవారు మగవారు ఎర్ర టీ షర్టులు, మహిళలు ఎర్ర చీరలను ధరించి హాజరు కావాల్సి ఉంటుంది. డప్పు కళాకారులు వారికి కేటాయించిన దుస్తులలో ప్రదర్శనలో పాల్గొనాలి. జనసేవ దళ్‌ వాలంటీర్లు వారి ఇన్‌స్ట్రక్టర్ల సూచనల మేరకు కవాతు నిర్వహించాలి. వివిధ ప్రాంతాల నుండి వాహనాలలో వచ్చే వారు వారి వాహనాలను దక్షిణ బైపాస్‌ సమీపంలోని మినీ స్టేడియంలో నిలుపుకోవాల్సిందిగా నిర్వాహకులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు