Homeఆంధ్రప్రదేశ్పల్లె వెలుగు లేని పల్లె

పల్లె వెలుగు లేని పల్లె

- Advertisement -

ప్రైవేటు బస్సులు రయ్.. రోయి.. ఆర్టీసీ నైయ్ నోయి  

అన్ని గ్రామాలకు సౌకర్యాలు ఉన్నా  మా గ్రామం పైనే వివక్ష ఎందుకు

స్త్రీశక్తి పథకం మాకు అందని ద్రాక్షేనా

మా ఊరు కు బస్సు,  రోడ్డు  కల్పించండి అంటూ మహిళల ఆవేదన

విశాలాంధ్ర బ్యూరో – తూర్పుగోదావరి :  స్త్రీ శక్తి పథకం పేరిట రాష్ట్రమంతా ప్రభుత్వం మహిళలకు ఉచిత  ప్రయాణం ఆర్టీసీ  బస్సులలో కల్పించింది. ఈ బస్సులలో ఆధార్ కార్డు చూపిస్తూ రాష్ట్రమంతా మహిళలు ప్రయాణం చేయవచ్చు .ఇదంతా బాగానే ఉంది కానీ అసలు మా ఊరుకు బస్సు రాదు మరి మేము ఏం చేయాలి మాకు ఈ పథకం అందని ద్రాక్ష ఏనా అంటూ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరు గ్రామ మహిళలు వాపోతున్నారు. మా ఊరుకు సరైన రోడ్ లేదని ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. అయితే గుంతలు, వానొస్తే   చెరువును తలపిస్తున్నా మరి ప్రైవేటు  స్కూళ్ల బస్సులు ఆ గ్రామానికి వస్తూనే ఉన్నాయి. కాపవరం నుండి తిరుమల స్కూల్ బస్సు ఒకటి, నిడదవోలు నుండి శశి స్కూల్ బస్సు లు రెండు,  గోపవరం పీపుల్ ట్రీ బస్సులు రెండు, మార్కొండపాడు జయంతి స్కూల్ బస్సు ఒకటి, నిడదవోలు ఎస్ ఆర్ కె స్కూల్ బస్సు ఒకటి,  తణుకు  ఎస్ఎఫ్ఎస్ స్కూల్ బస్సు ఒకటి,   సమిశ్రగూడెం విజ్ఞాన్ వికాస్ బస్సులు రెండు,  ముప్పవరం యూనివర్సల్ బస్సు ఒకటి,  మార్కొండపాడు భారతి స్కూల్ బస్సు ఒకటి , ఇలా 12  స్కూల్ బస్సులకు పైగా వస్తున్నాయి. మరి ఆ బస్సులు వస్తుండగా ప్రభుత్వ  బస్సులు ఎందుకు రావడం లేదు అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డులో బస్సులు నడిపితే బస్సులు చెడిపోతాయని ఆలోచనతో ఆర్టీసీ బస్సులను ఎప్పటి నుండో నిలిపివేసింది. మరి ప్రైవేటు యాజమాన్యాలు నడిపే బస్సులకు ఆ దుస్థితి ఏర్పడదా? అవి ఎందుకు తిరుగుతున్నాయి అని ప్రశ్నిస్తున్నారు. అసలు మండలంలో 16 గ్రామాలు ఉండగా బస్సు లేని గ్రామం ఒక్క మద్దూరు గ్రామం మాత్రమే .  మా ఊరుకు రోడ్డు లేకపోవడం వల్లే కదా బస్సు లేదు.. బస్సు రాకపోవడం వల్లే కదా మాకు స్త్రీ శక్తి  పథకం ఆమడ దూరంలో అనగా గోదారి గట్టు అంత దూరంలో ఉంది. ఆ గోదారి గట్టు చేరుకోవాలంటే ఈ గుంతల రోడ్డు గుండా మూడు కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంది. రాజమండ్రి నుంచి నిడదవోలు తాడేపల్లిగూడెం తణుకు బస్సులు పదుల సంఖ్యలో గోదారి గట్టు పైన నుండి వెళ్ళిపోతూ ఉంటాయి గోదారి గట్టుకు చేరుకుంటే కానీ బస్సు  ఎక్కే భాగ్యం లేదు.  కేవలం ప్రభుత్వాలకు మా గ్రామం పైన  వివక్ష ఎందుకో అర్థం కావడం లేదు అంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మా రాతలు మారడం లేదు. ఊరికి రోడ్డు సౌకర్యం లేదు,  బస్సు సౌకర్యం లేదు, మరి ఎందుకు మా గ్రామం కొవ్వూరు మండలంలో ఉంది.  కేవలం మా ఓట్ల కోసమేనా ? మా గ్రామం లో  మాకు సౌకర్యాలు కల్పించవలసిన  అవసరం లేదా ? అని మద్దూరు గ్రామ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ గ్రామంలో రైస్ మిల్లులకు ధాన్యం వస్తుంది, తిరిగి ఐకెపి లకు ధాన్యం వెళుతూనే ఉంది. అలాగే  కోళ్ల ఫారాలకు మేతలు వస్తున్నాయి తిరిగి గుడ్లు, కోళ్లు ఎగుమతి కూడా అవుతున్నాయి. అన్ని రకాలుగా రవాణా వ్యవస్థలు నడుచుచుండగా మరి ప్రభుత్వ బస్సులు ఒక్క రోడ్డు లేని కారణంగానే రాకపోవటం బాధాకరమని,   అందువల్ల ముఖ్యంగా రోడ్డు లేని మా గ్రామానికి రోడ్డు వేసి మా పిల్లలు పడుతున్న ఇబ్బందులను, మేము అనుభవిస్తున్న మనోవేదనలను అర్థం చేసుకొని తద్వారా మా గ్రామానికి బస్సు సౌకర్యం,  రోడ్డు సౌకర్యం కల్పిస్తారని,  ఒకసారి మా గ్రామానికి వచ్చి పరిశీలిస్తారని,  మద్దూరు గ్రామ మహిళలు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు