…. మంత్రి కందుల దుర్గేష్
విశాలాంధ్ర – నిడదవోలు : నిడదవోలు సమగ్రాభివృద్ధే ధ్యేయంగ15 నెలల కాలంలో దాదాపు రూ.300 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు రాష్ట్ర పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో పత్రికా ప్రతినిధుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. నిడదవోలు శాసనసభ సభ్యుడిగా ఏడాది పాలనలో దాదాపు రూ.300 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మరో రూ.180 కోట్ల పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఏడాది కాలంలో నిడదవోలు పట్టణంలో రూ.105.80 కోట్ల నిధులతో ప్రజానీకానికి ఉపయోగపడే అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు . మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి రూ.15.75 కోట్లతో 240 అభివృద్ధి పనులు ప్రారంభించగా రూ.8.12 కోట్లతో ఇప్పటికే 187 పనులు పూర్తిచేశామని స్పష్టం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.4.50 కోట్లు విడుదలయ్యాయని తద్వారా వ్యర్థాల నిర్వహణ, త్రాగునీటి సరఫరా, డ్రైన్స్ శుభ్రత పనులు జరుగుతున్నా యన్నారు. దాంతోపాటు 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని, ఇప్పటికే ఆసుపత్రిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని వివరించారు. రహదారులు అభివృద్ధికి చిహ్నాలు అని విశ్వసించి నియోజకవర్గంలో రూ.52.09 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ అండ్ బీ రోడ్లకు మరమ్మత్తులు, నిర్మాణాలు చేపట్టగా రూ.37.69 కోట్లతో 139.8 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇవి గాక రూ.24.27 కోట్లతో మొత్తం 34.93 కి.మీల పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. అందులో భాగంగా రూ.10.82 కోట్ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా 20.19 కి.మీలు, ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు ప్రాజెక్టు (ఏపీఆర్ఆర్ పీ) ద్వారా రూ.9.28 కోట్లతో 8.12 కి.మీలు, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్ వై) ద్వారా రూ.4.17 కోట్లతో 6.62 కి.మీల రహదారులు పూర్తి చేశామని పేర్కొన్నారు. నిడదవోలు రూరల్, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోని దాదాపు 40 గ్రామాల్లో మంత్రిగా తానే స్వయంగా పర్యటించి ప్రజలకు అవసరమైన 50 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఆర్వోబీకి రూ.95 కోట్లు మంజూరు కాగా అందులో రూ.40 కోట్లతో 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరిగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు.ప్రభుత్వంతో చర్చించి జులై 2024లో ఎర్రకాలువ ముంపుకు గురై 3071.41 హెక్టార్లలో పంట నష్టపోయిన 4631 మంది రైతులకు రూ.5.22 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేయించానని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. దశాబ్దాల కల అయిన ఎర్రకాలువ ముంపుకు దీర్ఘాకాలిక పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) నిధులు అత్యధికంగా మంజూరు చేయించుకున్న తొలి ఎమ్మెల్యే, మంత్రిని తాను అని చెప్పారు. పర్యాటక మంత్రిగా వచ్చిన అవకాశంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టులో నిడదవోలును అంతర్భాగం చేసి 4 కోట్లతో పర్యాటకంగా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అంతేగాక నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కొలువై ఉన్న ప్రఖ్యాత కోటసత్తెమ్మ ఆలయంలో అదనపు యాత్రికుల వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఆలయ రాజగోపురం ఆధునికీకరించనున్నాని తెలిపారు. ఆలయంలో ఆధ్యాత్మికతను మెరుగుపరించేందుకు ఆలయ ఆవరణాన్ని అభివృద్ధి చేసి ఆలయంలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నామన్నారు. అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. ఆలయాన్ని సాంస్కృతిక ప్రదేశంగా తీర్చిదిద్ది దూర ప్రాంత యాత్రికులను సైతం ఆకర్షించి పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా సమిశ్రగూడెం సమీపంలోని గోదావరి కాలువపై శిథిలావస్థకు చేరిన హవలక్ గడ్డర్ వంతెనను ఆధునికీకరించనున్నామన్నారు. నిడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వికాస జేకేసీ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించగా దాదాపు 42 కంపెనీలు హాజరయ్యాయని, ఇందులో 2386 మంది యువత రిజిస్ట్రేషన్ లు చేసుకోగా అర్హులైన 1038 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించామన్నారు. అంతేగాక 632 మంది యువతకు ఎంప్లాయిబిలిటీ స్కిల్ సెంటర్ ద్వారా శిక్షణ కల్పించామని, స్కిల్ హబ్ ద్వారా 339 మందికి శిక్షణ అందిస్తే 229 మంది ఇంటర్వ్యూలకు హాజరై 128 మంది యువతకు ఉద్యోగాలులభించాయన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 344 మంది బాధిత లబ్ధిదారులకు రూ. 2.84 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందించామని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భూపతి ఆదినారాయణ, జనసేన పార్టీ పట్టణ మండల అధ్యక్షులు రంగా రమేష్,పోలిరెడ్డి వెంకటరత్నం, డాక్టర్ తోపరాల కళ్యాణ చక్రవర్తి, జనసేన నాయకులు పాల్గొన్నారు.


