— జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
విశాలాంధ్ర –తాడేపల్లిగూడెం : రాష్ట్రంలోని కర్నూలు, కడప జిల్లాలో పండించిన ఉల్లిపాయలను ప్రజలు వినియోగించుకుని రైతులకు బాసటగా నిలవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు గురువారం తాడేపల్లిగూడెం ఉల్లి హోల్ సేల్ మార్కెట్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఉల్లి కొనుగోళ్ళను పరిశీలించి ట్రేడర్స్ తో, రైతులతో మాట్లాడారు. ఈరోజు ఎక్కడ నుండి ఉల్లి లోడ్లు వచ్చాయి, ఎన్ని మెట్రిక్ టన్నులు వచ్చాయి, ధర ఎంత పలుకుతుంది తదితర వివరాలను స్వయంగా అడిగి తెలుసుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి పంటను ప్రతి ఒక్కరు కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాలన్నారు సోలాపూర్ ఉల్లి కన్నా మన కర్నూలు ఉల్లి ఎంతో రుచికరం అన్నారు జిల్లా ప్రజలు, ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు కర్నూలు ఉల్లినే వినియోగించాలన్నారు ఉల్లి రైతులను ఆదుకునేందుకు తాడేపల్లిగూడెం మార్కెట్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు.కడప నుంచి వచ్చిన రైతు వద్ద రూ.6/- లు చొప్పున కొనుగోలు చేసినట్లు తెలుసుకొని రూ.9/- చొప్పున ధర చెల్లించాలని ట్రేడర్ కు చెప్పడంతో వారు అంగీకరించి తొమ్మిది రూపాయలు చొప్పున చెల్లించడం జరిగింది. ఈ సందర్భంలో రైతు సంతోషాన్ని వ్యక్తం చేసే జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనలతో అన్ని రకాల కూరలు ఉల్లిపాయలతో తయారు చేయించి ఉల్లి మార్కెట్ యార్డ్ నందు రైతులకు, ట్రేడర్స్ కు ఏర్పాటుచేసిన భోజనాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని రైతులతో కలిసి ఉల్లి వంటకాలను స్వయంగా రుచిచూశారు. కర్నూలు ఉల్లి వంటకాలు అద్భుతంగా ఉన్నాయని, సోలాపూర్ ఉల్లి కంటే కర్నూలు రుచిగా ఉంటాయన్నారు. వారి ఇంట్లో కూడా కర్నూలు ఉల్లినే వినియోగిస్తున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ప్రజలు నిత్య వినియోగానికి, వేడుకలకు, విద్యాసంస్థలు హాస్టల్స్ లో కర్నూలు ఉల్లినే వినియోగించాలని కోరారు రిలయన్స్, డీమార్ట్ వంటి మెగా మార్ట్స్ లో కర్నూలు ఉల్లి అమ్మకాలకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు . ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు, జిల్లా మార్కెట్ యార్డ్ ఏడి ఎం.సునీల్ కుమార్, తాహసిల్దార్ కె.సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు, రైతులు, హోల్సేల్ వ్యాపారస్తులు, తదితరులు పాల్గొన్నారు.


