వీఎస్ బోస్
చైనాలోని సముద్ర ప్రాంతమైన తియాన్‌జెన్ 2025 ఆగస్టు 23 నుంచి సెప్టెంబరు 1 వరకు జరిగిన షాంఘై సహకార సంస్థ 25వ వార్షిక సమావేశం సరైన సమయంలో జరిగిందని భావిస్తున్నారు. సమావేశంలో జరిగిన చర్చలు, నిర్ణయాలు ప్రస్తుతానికి సముచితంగా ఉన్నాయి. ఆ నిర్ణయాలు ఎలా అమలు జరుగుతాయో వేచి చూడాలి. ఆ సమావేశంలో భారత్ నుంచి పాల్గొన్న ప్రధాన మంత్రి మోదీ అటు పుతిన్తోను, ఇటు జిన్పింగ్తోను స్నేహ హస్తం అందించటం మన దేశానికి లాభం చేకూర్చే పరిణామం. చైనా, ఇండియా సరిహద్దు సమస్యను సానుకూలంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు అంగీకరించటంతో ఉభయ దేశాల మధ్య శాంతి నెలకొంటుందని మరోసారి ఆశలు చిగురించాయి. జీవిత భాగస్వామిని నిర్ణయించుకునే అవకాశం వ్యక్తులకు ఉంటుంది కానీ సరిహద్దు దేశాలను నిర్ణయించుకునే అవకాశం ఏ దేశానికి ఉండదనేది వాస్తవం. కనుక ఇండియా, చైనా ఒకరినొకరు గౌరవించుకుంటూ తమ ప్రజల అభ్యున్నతికి, రెండు దేశాల అభివృద్ధికి సహకరించుకోవటం తప్ప మరో మార్గం లేదని ఉభయ దేశాలు అర్ధం చేసుకోవాలి. అలా చేయటం మూలంగా సైనిక ఖర్చులు తగ్గుతాయి, నిత్యం జరిగే కవ్వింపు చర్యలు లేకుండా పోవటమే కాకుండా తద్వారా, దేశాల మధ్య వ్యాపారం పెరిగి ప్రజల అవసరాలు తక్కువ ఖర్చుతో తీరే అవకాశం ఏర్పడుతుంది. పొరుగు దేశాలతో స్నేహం, శాంతి భావంతో ఉంటే జరిగే లాభం వివరించలేనంత ఎక్కువగా ఉంటుంది. బ్రిక్స్ దేశాలతో పాటు ఇతర అనేక దేశాలు షాంఘై సహకార సంస్థలో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. బ్రిక్స్ దేశాల ఆర్థిక అవసరాలు తీర్చటానికి ఆ దేశాలు సమైక్యంగా ఒక బ్యాంక్‌ను ఏర్పాటు చేశాయి. అలాగే షాంఘై సహకార సంస్థ కూడా మరొక బ్యాంక్‌ను ఏర్పాటు చేయటానికి నిర్ణయం తీసుకోవటం హర్షించదగిన పరిణామం.
అమెరికా, యూరప్‌లోని పెట్టుబడి దేశాల నాయకత్వంలో ఏర్పడిన ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆర్థిక, సామాజిక ఒత్తిడిలతో వెనకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అన్యాయం చేయటం మూలంగా షాంఘై సహకార బ్యాంక్, బ్రిక్స్ బ్యాంకులు ఇలాంటి దేశాలకు ఆశా కిరణంగా ఉంటాయి. ఈ రెండు బ్యాంక్‌లు ప్రపంచ పీడిత ప్రజల అవసరాలను వారి దేశ స్వావలంభనకు ఎలాంటి భంగం కలగకుండా మార్గదర్శకంగా పనిచేస్తాయని ఆశిద్దాం. ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ పేరుకే ప్రపంచం కానీ ప్రపంచ ప్రజలతో వాటికి ఎలాంటి సంబంధం లేదు. ప్రపంచ బ్యాంక్ సంబంధం అంతా అమెరికా, యూరప్ దేశాల పెట్టుబడిదారుల వ్యాపారాలు, లాభాలు మాత్రమే ప్రధానంగా చూస్తాయి. అమెరికా, యూరప్ పెట్టుబడిదారుల ప్రపంచ బ్యాంక్ ద్వారా ఇతర దేశాల ప్రభుత్వాలపై రాజకీయ, వ్యాపార ఒత్తిడి పెంచి అన్యాయంగా తమకు అనుకూలంగా మార్చుకుంటాయి. దీని కొరకు ప్రపంచ బ్యాంక్ విధివిధానాలను నిర్ణయించి అమలు కోసం కృషి చేస్తుంది. ప్రపంచ ప్రజలను మోసం చేయటానికి సమాచార విప్లవంతో ప్రపంచమంతా ఒక గ్రామంలాగా ఏర్పడిరదని, అన్ని దేశాలు ఒక్కటేనని ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని సూక్తులు పలుకుతూ ప్రచారం చేస్తుంది. అమెరికా దాని మిత్ర దేశాలు తమకు రాజకీయంగా అనుకూలంగా లేని దేశాలపై అతిగా పన్నులు విధించటం ప్రపంచ బ్యాంక్ సూక్తులకు వ్యతిరేకం కాదా? ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం ఇండియాపై విధిస్తున్న 50 శాతం పన్నులు ఏ కోవలోకి వస్తాయో ప్రపంచ బ్యాంక్ దాని అనుబంధ పెట్టుబడిదారులు చెప్పగలరా?
తాము ఏ రకంగా ఉండాలి, ఏ పద్దతిలో నడవాలి, ఎలాంటి సౌకర్యాలు, హక్కులు ప్రజలకు ఇవ్వాలి అనే విషయాలు ఆ దేశంలోని ప్రజలకు, ప్రభుత్వాలకు సంబంధించిన విషయం. కానీ పెట్టుబడిదారులు నిర్వహించే ప్రపంచ బ్యాంక్ తాను ఇచ్చే రుణాల నెపంతో కార్మిక, రైతు, విద్యుత్ చట్టాలు మార్చమని, ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు తీసివేయమని ప్రభుత్వరంగ సంస్థలు మూసివేయమని, ఉద్యోగుల సంఖ్య తగ్గించమని, మానవ వనరులు అవసరమైతే తాత్కాలికంగా కాంట్రాక్ట్, ఇతర పద్దతిలో పూరించుకొమ్మని, పని గంటలు పెంచమని చెప్పే అధికారం ప్రపంచ బ్యాంక్‌కు ఎవరు ఇచ్చారు. అలాంటి కుట్రలకు ఆదేశాలు ఇచ్చేది అమెరికా దాని మిత్ర దేశాల పెట్టుబడిదారులే అన్నది తేటతెల్లం. దీని కొరకు పేద దేశాలు, వెనుక బడిన దేశాలు బలవుతున్న విషయం జగమెరిగిన సత్యం. ప్రపంచ బ్యాంక్ ప్రత్యామ్నాయంగా షాంఘై బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్‌లతో పాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి ప్రాంతీయ బ్యాంకులతో కలిసి బాధిత దేశాలకు మార్గదర్శకం వహించి, ప్రపంచ బ్యాంకులాగా దోపిడీనే ప్రధానం కాకుండా ప్రపంచ అభివృద్ధి ప్రధానంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని దేశాలకు అందుబాటులో ఉండేటట్లు చేస్తే ప్రపంచ ప్రజలు సంతోషిస్తారు, గర్విస్తారు. ప్రాంతీయ బ్యాంకులు ప్రపంచ బ్యాంక్‌కు ప్రత్యామ్నాయంగా నిలబడతాయనీ, ప్రజల ఆకాంక్షను తీరుస్తాయని ఆశిద్దాం.
పెట్టుబడిదారుల వ్యాపార విస్తరణ, లాభాపేక్షలే యుద్ధాలకు ప్రధాన కారణం. పాకిస్థాన్‌కు, ఇండియాకు ప్రతిసారి ఏర్పడుతున్న ఉద్రిక్తతలకు, స్వల్పపాటి యుద్దాలకు అమెరికా రాజకీయ స్వలాభమే కారణమని రెండు దేశాలు అర్ధం చేసుకొని ప్రవర్తించాలి. ఉక్రెయిన్‌కు, రష్యాకు జరుగుతున్న యుద్ధం కానీ, ఇజ్రాయిల్‌కు, పాలస్తీనాపై దాడులు కానీ అక్రమంగా ఇరాన్‌పై జరుగుతున్న దాడులకు కానీ అమెరికాదే పూర్తి పాత్ర. అమెరికా ప్రభుత్వం ఆ దేశంలోని ఆయుధాలు తయారు చేసే పరిశ్రమల చెప్పుచేతల్లో ఉంటుందని అందుకే అమెరికా యుద్ధాలను ప్రోత్సహిస్తుందని అర్ధం చేసుకోవాలి. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం చేసింది కూడా అమెరికానే. అఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ఉగ్రవాదులను ప్రోత్సహించింది అమెరికా. దానిని నిలువరించటంలో విఫలమై ఆ దేశం నుంచి అర్ధాంతరంగా అమెరికా వైదొలిగింది. ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో అనేకం జరిగాయి. అబద్దాలు ప్రచారం చేసి ఇరాక్‌లో యుద్ధం సృష్టించి ఆ దేశాన్ని సర్వనాశనం చేయటంలో ప్రధాన పాత్ర అమెరికాదే. అనేక దేశాల్లో అమెరికా తనకు అనుకూలమైన కీలుబొమ్మ ప్రభుత్వాలు ఏర్పాటు కోసం మోసాలు చేయటం, యుద్ధం చేయటం అమెరికా విధానాల్లో ఒకటి. అదే అన్ని పెట్టుబడిదారి దేశాలు అనుసరించే విధానం. అందుకే అలాంటి దేశాలన్నింటికి అమెరికా నాయకత్వం వహిస్తున్నది. యుద్ధాలు సమసిపోవాలన్నా, దోపిడీలేని ప్రపంచం ఏర్పడాలన్నా అమెరికా దోపిడీ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ రాజకీయాలు మారాలి. ప్రపంచ బ్యాంకుకు దీటుగా ప్రాంతీయ ఆర్థిక బ్యాంకులు పనిచేయాలని ప్రపంచం కోరుకుంటోంది. చైనా, ఇండియా అరమరికలు లేని స్నేహాన్ని పెంచుకోవాలి. పాకిస్థాన్ అమెరికాపై ఉన్న భ్రమలను వదిలి అమెరికా చెప్పుడు మాటలు వినకుండా ఇండియాతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవాలి. ఇండియా పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు మెరుగుపర్చుకోవాలి. 140 కోట్ల జనాభా కల్గిన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. గతంలో అలీన దేశాలకు నాయకత్వం వహించిన గత చరిత్రను పాలకులు గుర్తుంచుకోవాలి. ప్రపంచ బ్యాంక్ విధానాలను అమెరికా దౌర్జన్యాన్ని ఎదిరించి భారతదేశాన్ని ప్రజాపథంలో నడపటానికి పాలకులు కృషి చేయాలి. దోపిడీ అణచివేతలే ఉగ్రవాదానికి మూలాలని అందరు గ్రహించి అణచివేతలు, దోపిడీలు లేని సమాజం ఏర్పాటుకు కృషి చేయాలి. అదే పరిస్థితిని నేటి ప్రపంచ ప్రజలు కోరుకుంటున్నారు.
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
ఫోన్:9391356527


