నేపాల్ ఉద్యమకారులు, సైన్యం, అధ్యక్షుడి మధ్య కుదిరిన ఒప్పందం
మాజీ ప్రధానన్యాయమూర్తికి యువ ప్రతినిధుల మద్దతు
ఖాట్మండు: తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న నేపాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠకు తెరపడిరది. తాత్కాలిక ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కార్కీని జన్ జీ ఉద్యమకారులు ఎంపిక చేయడంతో శుక్రవారం రాత్రి ఆమె ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు జెన్-జీ నిరసనకారులు, అధ్యక్షుడు రామచంద్ర ఫౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్డెల్ మధ్య ఏకాభిప్రాయం తర్వాత కర్కీని తాత్కాలిక ప్రధానిగా ఎంచుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వానికి తొలుత చిన్న మంత్రివర్గం ఉంటుందని, మొదటి సమావేశం శుక్రవారం రాత్రి జరుగుతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఏడు ప్రాంతీయ పార్లమెంట్లతో పాటు ఫెడరల్ పార్లమెంట్‌ను రద్దు చేయాలని మంత్రి వర్గం సిఫారసు చేసే అవకాశం ఉంది.
సుశీలా కార్కీ నేపథ్యం…
సుశీలా కార్కీ(72)కి నేపాల్ చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. తొలుత ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత న్యాయవ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా, సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి మరకలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి.. శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టి.. నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. తాజా ఉద్యమంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు.
51కి పెరిగిన మృతులు
నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మృతుల సంఖ్య 51కి పెరిగింది. వారిలో 30 మంది బుల్లెట్ గాయాల తో మరణించిన వారు ఉన్నారు. మిగతా 21 మంది మంటలు అంటుకుని, ఇతర గాయాలతో మరణించారు. మృతుల్లో పౌరులతోపాటు పోలీసులు కూడా ఉండటం గమనార్హం. నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం మధ్యాహ్నం ఈ వివరాలు వెల్లడిరచింది. కాగా, నేపాల్ రాజధాని ఖాట్మండులో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. దాంతో కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించే కార్యక్రమం మొదలైంది. ఈ క్రమంలో ఆస్పత్రి పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా వందల మంది గాయాలతో చికిత్స పొందుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
భారతీయ మహిళ మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 57 ఏళ్ల మహిళ ఖాట్మండులోని ఒక హోటల్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో మరణించినట్లు తెలుస్తోంది. ఆ హోటల్‌కు నిరసనకారులు నిప్పంటించడంతో ఆమె మరణించారు. రాజేష్ గోలా అనే మహిళ సెప్టెంబర్ 07న తన భర్త రాంవీర్ సింగ్ గోలాతో కలిసి నేపాల్‌కు వెళ్లారు. వీరిద్దరు హయత్ రీజెన్సీలో బస చేశారు. సెప్టెంబర్ 09 నిరసనకారులు ఆమె ఉంటున్న హోటల్‌కు నిప్పటించారు. ఆమె కిటికీ గుండా తప్పించుకోవడానికి ప్రయత్నించింది. మంటల కారణంగా బయటకు వెళ్లే మార్గం మూసుకుపోవడంవతో, ఆమె ఉంటున్న నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకింది. కింద ఉన్న వారు వీరిని రక్షించేందుకు దప్పట్లు, పరుపుపై దూకాలని కోరారు. అయితే, మహిళ భర్త పరుపుపై దూకి స్వల్పగాయాలతో ప్రాణాలు దక్కించుకోగా, ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.


