33 మందికి పైగా మృతి
50 మంది పరిస్థితి విషమం
తమిళనాట విజయ్ ర్యాలీలో తొక్కిసలాట
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
కరూర్ : తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కరూర్‌లో శనివారం విజయ్ నిర్వహించిన ర్యాలీకి భారీగా ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. మొత్తం 33 మందికి పైగా మరణించారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని కరూర్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళగా వెట్రీ కజగం (టీవీకే) మద్దతుదారులు, విజయ్ అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. విజయ్ ఈ ర్యాలీకి దాదాపుగా 6 గంటలు ఆలస్యంగా వచ్చారని తెలుస్తోంది. తొక్కసలాటపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ర్యాలీలో చిన్నారి తప్పిపోయిందనే వార్త రాగానే, ఒక్కసారిగా జనాలు తోసుకోవడం ప్రారంభించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది. 10,000 మందితో ర్యాలీకి విజయ్ అనుమతి తీసుకున్నారు. అయితే, ఊహించని రీతిలో జనాలు తరలివచ్చారు. ఇదే మొత్తం ఘటనకు కారణమైనట్లు అధికారులు చెబుతున్నారు.
మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తొక్కిసలాట ఘటనతో విజయ్ తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా ముగించాల్సి వచ్చింది. ప్రేక్షకులలో చాలా మంది స్పృహ కోల్పోవడంతో అంబులెన్స్‌లలో తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ గందరగోళం సమయంలో వేదిక నుంచి విజయ్ ‘పోలీసులు దయచేసి సహాయం చేయండి’ అని విజ్ఞప్తి చేయడం వినిపించింది. జనంలో ఒక పిల్లవాడు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. విజయ్ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా జనం అదుపు తప్పారు. పార్టీ కార్యకర్తలు, పిల్లలు సహా చాలా మంది అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గందరగోళాన్ని గమనించిన విజయ్ తన ప్రసంగాన్ని ఆపి, తన ప్రచార బస్సు పై నుంచి జనం పైకి నీటి సీసాలు విసిరి, ప్రశాంతంగా ఉండమని విజ్ఞప్తి చేశాడు. కాగా, స్పృహ కోల్పోయిన వారిని చేరుకోవడానికి అంబులెన్స్‌లు రద్దీగా ఉన్న రహదారి గుండా వెళ్లడం కష్టమైంది. బాధిత వ్యక్తులను తరువాత సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన తర్వాత విజయ్ తన ప్రసంగాన్ని షెడ్యూల్ కంటే ముందే ముగించాడు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కరూర్ నుంచి వస్తోన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి, కలెక్టర్‌కు సూచించా. కరూర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించా. వైద్యులు, పోలీసులకు సహకరించాలని కరూర్ పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.


