అనంతపురం జిల్లా
రెవెన్యూ అధికారులకు రైతుల వినతి
విశాలాంధ్ర-రాప్తాడు : గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో అరకొరగా భూ సర్వే చేసినా రైతులకు నేటికీ సర్వే నెంబర్లు కేటాయించలేదని, ఆన్లైన్లో 1-బి, అడంగల్ కూడా రావడంలేదని పలువురు రైతులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. బొమ్మేపర్తి గ్రామంలో శుక్రవారం తహశీల్దార్ పి.విజయకుమారి, రీసర్వే డీటీ కృష్ణ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. ఆర్డీఓ కేశవనాయుడు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రూప్లా నాయక్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో నిర్వహించే ఈసదస్సుల్లో రైతులు, భూ యజమానుల ధ్రువపత్రాలు పరిశీలించి సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పరిష్కరించటానికి తోడ్పడతాయన్నారు. ప్రజల నుండి రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారినికి చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. రెవెన్యూ శాఖతోపాటు సర్వే, రిజిష్ట్రేషన్, ఇతర విభాగాల నుండి వచ్చే అవకాశం ఉన్నందున ఆయా శాఖల సమన్వయంతో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామంలోని భూసమాచారం రికార్డులను అందుబాటులో ఉంచామని రైతులు, ఇతర భూ యజమానులు వారి రికార్డులతో సరిచూసుకొని ఏమైనా తేడాలుంటే అక్కడిక్కడే పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ ఇస్మాయిల్, ఆర్ఐ కరుణాకర్, వీఆర్ఓలు సాయికుమార్, మనోజ్, సర్వేయర్ ఖలందర్, సర్పంచ్ ఆనందరెడ్డి, తెలుగు యువత రాజశేఖర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, ఉజ్జినప్ప, ఎర్రిస్వామి, తదితరులు పాల్గొన్నారు.