Homeఐటీ దాడుల కలకలం

ఐటీ దాడుల కలకలం

- Advertisement -

. ఏపీ, తెలంగాణలో 25 చోట్ల తనిఖీలు
. పప్పుల వ్యాపారంలో భారీ అక్రమాలపైనే సోదాలు
. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, జీఎస్టీ ఫైళ్లు స్వాధీనం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఏకకాలంలో జరిగిన ఐటీ సోదాలు రాజకీయ, వ్యాపార వర్గాల్లో కలకలం రేపాయి. ఏపీ, తెలంగాణలోని 25 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. రూ.300 కోట్ల విలువైన పప్పుల వ్యాపారంలో భారీ అవకతవకలు, అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు తెల్లవారుజామునే సోదాలు ప్రారంభించారు.
ఐటీ దర్యాప్తు విభాగం అధ్వర్యంలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, హైదరాబాద్‌ నగరాల్లో ఒకేసారి సోదాలు జరిగాయి. విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం ప్రాంతాల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో వివిధ ట్రేడిరగ్‌ కంపెనీలు భారీగా నగదు లావాదేవీలు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఈ వ్యాపార నిర్వాహకులు భారీగా నగదు విత్‌డ్రా చేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది.
కొన్ని ట్రేడిరగ్‌ కంపెనీలు పౌరసరఫరాల శాఖ నుంచి అనుమతులు పొంది పప్పు దినుసులు సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. విశాఖలో హిందుస్తాన్‌ ట్రేడర్స్‌, కర్నూలులో వి కేర్‌ గ్రూప్‌, గుంటూరులో మరికొన్ని ప్రముఖ పప్పు ట్రేడిరగ్‌ కంపెనీలు దర్యాప్తు కిందకొచ్చాయి. ఈ సంస్థలు గత ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల శాఖ నుంచి టెండర్లు పొంది… పెద్ద మొత్తంలో పప్పులు సరఫరా చేసినట్లు చూపించి… వందల కోట్ల రూపాయల బిల్లులు పొందినట్లు తెలిసింది. చెల్లింపులు తీసుకున్న తర్వాత సరఫరా పూర్తి చేయకపోవడం, తక్కువ నాణ్యత గల పప్పులు అందించడం, కొన్నిచోట్ల సరఫరానే నిలిపివేయడం వంటి అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. దర్యాప్తులో ఐటీ అధికారులు 2024 ఎన్నికల ముందు పెద్దమొత్తంలో నగదు ఉపసంహరణలు జరిగినట్లు గుర్తించారు. ఆ నగదు ఎక్కడికి వెళ్లింది? ఎవరి ఖాతాలో చేరింది? అనే అంశాలపై పరిశీలన కొనసాగుతోంది.
ఈ లావాదేవీల వెనుక రాజకీయ సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలోనూ ఐటీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఐటీ బృందాలు ఆఫీసులు, గోడౌన్‌లు, నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇన్వాయిస్‌లు, జీఎస్టీ ఫైళ్లను స్వాధీనం చేసుకున్నాయి. ఈ దాడులతో రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఒకవైపు ఐటీ శాఖ దర్యాప్తు సాగుతుండగా… మరోవైపు పౌరసరఫరాల శాఖ అంతర్గత పరిశీలన ప్రారంభమైంది. దీనిపై ఐటీ అధికారులను మీడియా ప్రతినిధులు సంప్రదించగా… దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, కొన్ని కంపెనీలు పన్ను ఎగవేత, బోగస్‌ సరఫరా, హవాలా లావాదేవీల్లో నిమగ్నమైనట్లు ఆధారాలు లభించాయని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు