— రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు
విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో ప్రతిభ కనబరచిన శెట్టి బలిజ సంఘీయ విద్యార్ధులకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల శాతాన్ని పెంచే ఉద్దేశ్యంతో తామీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుమన్నారు. ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం స్థానిక గోదావరి గట్టున ఉన్న కరెంటు ఆఫీసు ఎదురుగా ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణ దాస కళ్యాణ మండపంలో 230 మంది విద్యార్ధులకు 13 లక్షల రూపాయల ఉపకార వేతనాలు అందించనున్నట్లు తెలిపారు. వీటిలో రూ. 10 లక్షలు మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషితో సియస్సార్ కింద గోద్రెజ్ సంస్థ మంజూరు చేయగా, మిగిలిన రూ.3 లక్షలు తన వ్యక్తిగత కార్యక్రమం కింద వెచ్చించినట్లు తెలిపారు. పదవ తరగతిలో 500 నుంచి 549 మార్కులు వచ్చిన వారికి రూ.3500, 550 నుంచి 574 మార్కులు వచ్చిన వారికి రూ.5000, 575 నుంచి 600 మార్కులు సాధించిన విద్యార్ధులకు రూ.10000 అందిస్తామన్నారు. రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జరిగే సభకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అధ్యక్షత వహిస్తారని, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, సభా నిర్వహక అధ్యక్షులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల స్కోచ్ గోల్డ్ అవార్డు గ్రహీత బీసీ సంక్షేమ మరియు చేనేత జౌలి శాఖా మంత్రి ఎస్. సవిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ రెడ్డి అనంతకుమారిలను సత్కరిస్తామన్నారు. ఇదే సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న శెట్టిబలిజ రాష్ట్రస్థాయి డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు చిరు సత్కారం చేస్తామన్నారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ లతో పాటు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు పితాని సత్యానారాయణ, గోరంట్ల బుచ్చియ్య చౌదరి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, బత్తుల బలరామకృష్ణ, ఎపిస్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి ముఖ్యఅతిధులుగా పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో కడియాల వీరభద్రరావు, బుడ్డిగ రాధ, కడలి రామకృష్ణ, శీలం గోవింద్, ముసిని బాబూరావు, చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు.


