

— పరిష్కారానికి నోచుకోని ప్రధాన సమస్యలు.
— ఇదీ కడియం మండలంలో పరిస్థితి.
విశాలాంధ్ర – కడియం : రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో కడియం మండలానికి ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనుకంజలోనే ఉంది. సంవత్సరాలు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా, ఆఖరికి నాయకులు మారుతున్నా కానీ కడియం మండలం పరిస్థితి మాత్రం మారడం లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పలు రాజకీయ సభలలో రైతుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ రైతుల ప్రధాన సమస్యలు తీర్చడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఆవ ముంపుకు గురవడం ఇక్కడ ప్రధాన సమస్యగా ఉంది. మండలంలో వరి ప్రధాన పంటగా, పన్నెండు వందల ఎకరాల ఆవ పొలం ఉంది. ఇక్కడి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు చెబుతూనే ఉన్నారు. గతంలో ఈ ఆవ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైయస్ జగన్మోహన్ రెడ్డి వంటి నేతలు పర్యటించిన సందర్భాలూ ఉన్నాయి. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం నెరవేరడం లేదు. అలాగే రైతు బజార్ వ్యవస్థ ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ కడియం లో రైతు బజార్ లేకపోవడం ఒక లోటు గానే ఉంది. గత ప్రభుత్వంలో రైతు బజార్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని పనులు మొదలు పెట్టారు. కానీ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చి అధికారం మారడంతో రైతు బజార్ నిర్మాణ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మరోచోట రైతు బజార్ నిర్మాణం జరుగుతుందని ప్రస్తుత ప్రజా ప్రతినిధులు చెబుతున్నప్పటికీ, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అలాగే డంపింగ్ యార్డ్ లేకపోవడం ఇక్కడ మరొక ప్రధాన సమస్య. డంపింగ్ యార్డ్ లేకపోవడం వలన చెత్తను తీసుకువచ్చి వేమగిరి జేగురుపాడు గ్రామాల మద్యలో కొన్నిచోట్ల కాలువ గట్టుకు ఇరువైపులా పారబోస్తున్నారు. ఆ తరువాత చెత్తకు నిప్పు పెట్టడమో లేదా కాలువలోకి తోసేసి చేతులు దులిపేసుకోవడమో చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, పచ్చదనం పరిశుభ్రత అంటూ తాత్కాలిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారే తప్ప కడియంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని గుర్తించడం లేదు. అలాగే కడియం గ్రామంలో కాలువ మీద రెండవ వంతెన నిర్మాణం కూడా ప్రధాన సమస్యగా మారింది. దాదాపు 90 సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో కడియంలో నిర్మించిన బొబ్బిలి బ్రిడ్జి శిధిలావస్థకు చేరుకోవడంతో 2004 – 2009 మధ్యకాలంలో దాని ప్రక్కనే మరో బ్రిడ్జి నిర్మాణం జరిగింది. కొత్త బ్రిడ్జి రావడం వల్లనో, లేదా పాలకులు పాత బ్రిడ్జి మరమ్మత్తులపై దృష్టి పెట్టక పోవడం వల్లనో బొబ్బిలి బ్రిడ్జి కృంగిపోవడం, అనంతరం తొలగించడం జరిగింది. గత ప్రభుత్వ కాలంలో కడియం లోనే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి అవకాశం ఉన్న రెండు చోట్లు ప్రతిపాదించినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఈ బ్రిడ్జి నిర్మాణం కడియం గ్రామానికి కొంచెం దూరంగా స్థానిక పేపర్ మిల్ వద్ద నిర్మించడానికి ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కడియం గ్రామంలో రెండవ బ్రిడ్జి అవసరమని, ట్రాఫిక్ సమస్య నివారించడానికి నూతన బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా మండలంలోని సమస్యలలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కూడా ఉంది. 2014 మరియు 2024 సంవత్సరాలలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపనలు ఆర్బాటంగానే చేసినప్పటికీ, నిర్మాణ పనులు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. వీటితో పాటు మండలంలోని విద్యార్థుల కోసం ఇంటర్, డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడం, కడియం – వీరవరం రోడ్డు మరియు కడియం -బుర్రిలంక రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ లైటింగ్, రైల్వే స్టేషన్ లో కనీసం మూడు లేదా నాలుగు రైళ్లు నిలుపుదల, రిజర్వేషన్ కౌంటర్ వంటి కనీస సమస్యలు నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ధవళేశ్వరం నుండి కడియపులంక వరకూ బోటు షికారు ప్రకటనలనే పరిమిత మైంది. కెనాల్ రోడ్డు ఆధునికీకరణా అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని సమస్యల పరిష్కారానికి ఆర్బాటంగా శంకుస్థాపనలు జరుగుతున్నప్పటికీ, పనులు మాత్రం కార్యరూపం దాల్చడంలేదు. కడియం మండలంలో ఇన్ని సమస్యలు ఉన్నా పరిష్కారం కావడం లేదంటే, ఇక్కడి నుండి రాజకీయ నాయకులు ఎవరూ ప్రాతినిధ్యం వహించటం లేదేమో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ సమర్ధులైన నాయకులు ఉన్నారు. వారివల్ల అభివృద్ధి జరుగుతుందని ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాజమహేంద్రవరం ఎంపీగా దగ్గుబాటి పురందేశ్వరి, రాజమహేంద్రవరం రూరల్ ఎంఎల్ఎగా గోరంట్ల బుచ్చయ్యచౌదరి అధికార కూటమి ప్రభుత్వం నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయ సమీకరణాలతో నిడదవోలు నుంచి పోటీ చేసి, గెలుపొందిన కందుల దుర్గేష్, బిజెపిలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి నాయకులు ఇక్కడి ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. సాధారణ కుటుంబంలో జన్మించి ‘టీ టైం’ బ్రాంచ్ లను దేశవ్యాప్తంగా స్థాపించి, టీ టైం బాలు గా సుపరిచితుడైన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, అలాగే కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ లు కడియం గ్రామ నివాసులే. ఇంతమంది స్థానికత కలిగిన నాయకులు అధికారంలో ఉన్నప్పుడే సమస్యల పరిష్కారానికి కృషి చేసి, మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.


