సిరియాలో అనూహ్యమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ కుటుంబాన్ని తీసుకొని రష్యాకు పారిపోయినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న అస్సాద్ పాలనకు ముగింపు పడింది. కాగా సిరియాలో అంతర్యుద్ధం పరిస్థితులను అదునుగా భావించిన అగ్రరాజ్యం అమెరికా ఉగ్రవాద సంస్థ ఐసిస్ స్థావరాలపై దాడులు మొదలు పెట్టింది. అస్సాద్ రష్యాకు పారిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే ఐసిస్ లక్ష్యాలపై ఆదివారం డజన్ల కొద్దీ దాడులు చేసింది. దేశంలో నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితులను అవకాశంగా మలచుకొని తిరిగి బలపడాలని ఐసిస్ చూస్తోందని, తాము అలా జరగనివ్వబోమని, ాస్పష్టమైన ఆలోచన్ణతో ఐసిస్ లక్ష్యాలపై దాడులు జరిపామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్ష భవనం నుంచి ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా ఐసిస్ స్థావరాలపై ఆదివారం దాడులు జరిపామని, తమ యుద్ధ విమానాలు డజన్ల కొద్దీ శిబిరాలను తాకాయని యూఎస్ మిలిటరీ నిర్ధారించింది. బీ-52, ఎఫ్-15, ఏ-10తో పాటు యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విమానాలను ఉపయోగించి సెంట్రల్ సిరియాలోని 75కు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని అధికారిక ప్రకటనలో పేర్కొంది. కాగా సిరియాలో అధ్యక్షుడు అస్సాద్ పాలన పతనమవ్వడం న్యాయమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంగా బాధపడుతున్న సిరియా ప్రజలకు ఇది చారిత్రాత్మక అవకాశమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బషర్ అల్ అస్సాద్, అతడి కుటుంబం రష్యా పారిపోయి అక్కడ ఆశ్రయం పొందినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాగా గత ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న అస్సాద్ కుటుంబ పాలనపై ఇస్లామిస్ట్ హయత్ తహ్రీర్ అల్ షామ్ (హెచ్‌టీఎస్) అనే గ్రూపు మెరుపు దాడికి తెగబడింది. అమెరికా మద్దతున్న ఈ గ్రూపు దళాలు 11 రోజుల్లోనే సిరియాను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి.