. ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు
. 1,500 మందికి పైగా అవకాశం
విశాలాంధ్ర బ్యూరో -అమరావతి: పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్న సిబ్బందికి భారీస్థాయిలో పదోన్నతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్నీ అనుకూలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,500 మందికి పైగా పంచాయతీ కార్యదర్శులు, సీనియర్ అసిస్టెంట్లు పదోన్నతులు అవకాశం ఉంది. అందులో దాదాపు 660 మందికి డిప్యూటీ ఎంపీడీవో హోదా ఇవ్వనున్నారు. ఇప్పటివరకు రెండు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసినవారికే పదోన్నతి అర్హత ఉండగా ఆ కాలాన్ని ఏడాదికి తగ్గిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారు. సీఎం చంద్రబాబు ఆ ప్రతిపాదనను ఆమోదించడంతో మార్గం సుగమమైంది. ప్రభుత్వ నిర్ణయంతో రెండేళ్ల సర్వీస్ రూల్ తొలగించబడిరది. దీనివల్ల పదోన్నతులు నిలిచిపోయిన అనేక మంది ఉద్యోగులు ఇప్పుడు ఉన్నత హోదాలకు వెళ్లే అవకాశం ఉంది. గ్రామ సచివాలయాల పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో డిప్యూటీ ఎంపీడీవోలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కల్పిస్తోంది. ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. తాము చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పదోన్నతులు ఇవ్వడంతో శాఖలో సిబ్బంది కొరత తగ్గి, పనితీరు మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే తరహాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంతవరకు వారికి పదోన్నతులు కల్పించలేదు. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయం యూనియన్ జేఏసీ నేతల బృందం ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవించింది. దానిపై పది మందితో మంత్రుల ఉప సంఘాన్ని నియమించారు. ఆ కమిటీ నివేదిక వచ్చాక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది.


