ఆరుగురు నిందితులు అరెస్ట్- వారిపై రౌడీ షీటర్ నమోదు
భూ వివాదమే కిడ్నాప్‌కు కారణం : ఇంచార్జ్ డీఎస్పీ నరసింగప్ప
ఇన్నోవా కారులో కిడ్నాప్ చేసిన ఆరుగురు అదుపులోకి
కుంటిమద్ది సమీపంలో నిందితులను పట్టుకున్న పోలీసులు
ప్రామిసరీ నోట్లు, సెల్ఫోన్లు, వాహనాలు స్వాధీనం
వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ ను ఎస్సై ఉమాదేవినీ , పోలీసు సిబ్బందిని అభినందించిన డీఎస్పీ నర్సింగప్ప.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈనెల 8వ తేదీ న రైతు ముసుగు నారాయణ కిడ్నాప్ ఘటనను పోలీసులు ఒక గంట లోనే ఛేదించారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఇంచార్జ్ డిఎస్పి నర్సింగప్ప మీడియాతో మాట్లాడుతూ, ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన ముసుగు నారాయణకు, ధర్మవరం పట్టణానికి చెందిన నంద్యాల రవితో 1997 సంవత్సరం నుంచి భూ వివాదం కొనసాగుతోందన్నారు.ఈ వివాదంపై మూడు నెలల క్రితం నారాయణ ఆర్డీఓ కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో శుక్రవారం మూడో వాయిదా కోసం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన నారాయణను రవీందర్ నాయుడు,అతని కుమారుడు అరుణ్‌తో పాటు మరో నలుగురు కలిసి బలవంతంగా ఇన్నోవా కారులో ఎక్కించి కిడ్నాప్ చేశారని తెలిపారు. రాబడిన సమాచారం మేరకు వన్‌టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ వెంటనే అప్రమత్తమై పోలీసు సిబ్బందితో కలిసి ఇన్నోవా వాహనాన్ని వెంబడించి కుంటిమద్ది గ్రామ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.నిందితుల వద్ద నుంచి ఇన్నోవా వాహనం,ద్విచక్ర వాహనం,తో పాటు బాధితుడు ముసుగు నారాయణతో బలవంతంగా రాయించుకున్న ఐదు ప్రామిసరీ నోట్లు,సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అరెస్ట్ అయిన 6 మందిలో కే రవీంద్ర నాయుడు వైయస్సార్ కాలనీ ధర్మవరం, కె అరుణ్ కుమార్ వైయస్సార్ కాలనీ ధర్మవరం, పట్టణంలోని మార్కెట్ వీధికి చెందిన నారా మధుసూదన్ నాయుడు, వైయస్సార్ కాలనీకి చెందిన టి ప్రదీప్ కుమార్, ధర్మవరం మండల పరిధిలోని పోతుకుంట గ్రామములోని పసుపులేటి ఉదయ్, వైయస్సార్ కాలనీకి చెందిన బిల్లే హరి లను (మొత్తం ఆరుగురు నిందితులు) కేసు నమోదు చేసి, రౌడీషీట్లు కూడా తెరిచినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నరసింగప్ప హెచ్చరించారు.
ఈ కేసును అత్యంత చాకచక్యంగా చేధించిన వన్‌టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ ను,ఎస్సై ఉమాదేవినీ, పోలీసు సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


