సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేవలం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణతో సరిపెట్టకూడదని, పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే వరకు విచారణ కొనసాగించాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో ట్రస్టు సీనియర్ పదాధికారులపై కూడా ఎఫ్‌ఐఆర్లు నమోదు చేసి, విచారణ జరపాలన్నారు. సిట్ నివేదిక ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్…ఈ వ్యవహారంలో బయటపడిన అంశాల్లో చిన్న భాగం మాత్రమేనని పేర్కొన్నారు. ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామాలు చేయడం మాత్రమే సరిపోదని, ఈ వ్యవహారంలో వారి పాత్ర, బాధ్యత, ప్రమేయంపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. జవాబుదారీతనాన్ని ప్రదర్శించినట్లు నటిస్తూ కొంతమంది దిగువస్థాయి సిబ్బందిపై మాత్రమే కేసులు నమోదు చేసి, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ)కి చెందిన సీనియర్ నాయకత్వాన్ని బాధ్యత నుంచి తప్పించడం…అసలు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమేనని విమర్శించారు. అయోధ్య జిల్లా కలెక్టర్‌కు సిట్ సమర్పించే నివేదికపై ప్రజలు నమ్మరని తెలిపారు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ స్వయంగా రామమందిర ట్రస్టులో ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగా ఉన్నందున, ఇటువంటి దర్యాప్తు వ్యవస్థ పూర్తిస్థాయి నిజాలను వెలికితీయలేదని స్పష్టం చేశారు. ట్రస్టు సీనియర్ పదాధికారులపై కూడా ఎఫ్‌ఐఆర్లు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భక్తులు ఆలయానికి పెద్దఎత్తున బంగారం, వెండి, నగదు విరాళాలు ఇస్తున్నప్పటికీ వాటికి రసీదులు ఇవ్వడం లేదని…రోజురోజుకు కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు బయటపడిన దానికంటే ఈ కుంభకోణం మరింత విస్తృతంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేయడానికి, వారు సమర్పించిన కానుకలను దోచుకోవడానికి ఎవరికీ అవకాశం ఇవ్వకూడదని రాజా స్పష్టం చేశారు. మొత్తం వ్యవహారంపై స్వతంత్ర న్యాయ సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న వారు ఎంతటివారైనా… ఏ సంస్థకు చెందిన వారైనా చట్టం ముందు నిలబెట్టాలని ఆయన కోరారు. రామమందిరానికి భక్తులు విశ్వాసంతో సమర్పించిన విరాళాలు ఎలా దుర్వినియోగానికి గురయ్యాయో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. విరాళాల సేకరణ, నిర్వహణ, లెక్కల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించినందున ఈ వ్యవహారంపై దేశానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని… అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు హిందువుల విశ్వాసాలతో రాజకీయాలు చేస్తున్నాయని యోగి చేసిన వ్యాఖ్యలను రాజా తీవ్రంగా ఖండించారు. అసలు ప్రశ్న విరాళాల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరగాలనే అంశమని స్పష్టం చేశారు. న్యాయ విచారణకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.


