Homeఆ ముగ్గురే కీలకం

ఆ ముగ్గురే కీలకం

- Advertisement -

ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు, సీఐ స్నేహితుడి కోసం సిట్ గాలింపు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు వేగవంతం

విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, మృతదేహాన్ని తరలించడం, ఆధారాలు చెరిపివేయడానికి జరిగిన కుట్రలో మరో ముగ్గురు కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని, అలాగే సీఐ స్నేహితుడు సురేశ్ కలిసి సాయికృష్ణ మృతదేహాన్ని తరలించడంతో పాటు ఆధారాలను మాయం చేయడానికి ప్రయత్నించినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. సీఐ నాగరాజు అరెస్ట్ అనంతరం అశోక్, నాని అజ్ఞాతంలోకి వెళ్లగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో హెడ్కానిస్టేబుల్ అశోక్ ఇంటికి సిట్ పోలీసులు వెళ్లగా…అతను ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. అశోక్ గతంలో సీఐ నాగరాజుకు అసిస్టెంట్‌గా పనిచేసినట్లు, జంగం నాని సీఐ పేరు చెప్పుకుని పలు వ్యక్తిగత వ్యవహారాలు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. గతంలో నానిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను వీఆర్‌కు పంపగా, ఇటీవలే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్గా పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. గత నెల 29న సాయికృష్ణ మేనమామ నవరంగ్‌ను సెటిల్మెంట్ పేరుతో వడ్డేశ్వరానికి తీసుకెళ్లేందుకు సురేశ్, అశోక్, నాని కలిసి వెళ్లినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ విషయాన్ని నవరంగ్ స్వయంగా సిట్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని, కాల్ డీటెయిల్ రికార్డులను (సీడీఆర్) సిట్ స్వాధీనం చేసుకుని పరిశీలిస్తోంది. మరోవైపు సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు? ఎక్కడ పడేశారు? అన్న వాటిపైనా సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సాయికృష్ణ మృతి చెందిన విషయం ఎప్పుడు తెలిసిందో సిబ్బంది స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజులు ఈ విచారణ కొనసాగనుంది. కొందరు టాస్క్కఫోర్స్‌ సిబ్బందిని కూడా పిలిచి వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. వీరిలో కొందరి నుంచి ఆధారాలు దొరికే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు కొందరు సిబ్బంది పాత్రపై వివరాలు అందజేశారు. వీటిని కూడా పరిశీలిస్తున్నారు.
సిట్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సాయికృష్ణ కేసులో నిందితుడు నాగరాజు నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు చేశాక విచారణకు సమయం లేకపోయిందని, దీనివల్ల పూర్తి వివరాలు రాలేదని పిటిషన్‌లో సిట్ పేర్కొంది. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని నాగరాజు తరఫు న్యాయవాది సమయం కోరడంతో 29వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు కృష్ణలంక స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీ మాయంపై బాధ్యులు రికార్డులు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మీ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయవాది సతీశ్బాబు వాదనలు వినిపించారు. సాయికృష్ణ మృతదేహం ఏమైందో రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనలేదన్నారు. ప్రతి స్టేషన్‌లోని సీసీ కెమెరాల పనితీరుపై పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లాస్థాయి కమిటీకి ఉందని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం సీసీటీవీ ఫుటేజీ కోసం జిల్లా స్థాయి కమిటీకి నోటీసులిచ్చింది. నిందితుడిగా ఉన్న నాగరాజుకూ నోటీసులు ఇచ్చింది. విచారణను ఈనెల 29కి కోర్టు వాయిదా వేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు