Homeవిశ్లేషణన్యూయార్క్‌ నగరమా! మళ్లీ ఊపిరి పీల్చుకో!

న్యూయార్క్‌ నగరమా! మళ్లీ ఊపిరి పీల్చుకో!

- Advertisement -

షాయిస్తా ఖానూమ్‌ పఠాన్‌

ఓ న్యూయార్క్‌ నగరమా! మళ్లీ ఊపిరి పీల్చుకో అంటూ నూతన మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన 34 ఏళ్ల డెమొక్రాట్‌ నేత జొహ్రాన్‌ మమ్దానీ పిలుపునిచ్చారు. ‘ఇన్నేళ్లు ఓటమి భయంతో ఊపిరి బిగబట్టి గడిపావు. ఇప్పుడు విజయం నిన్ను వరించింది. ఆస్వాదించు. కష్టాలు, కన్నీళ్లు తీరబోతున్నాయి. నూతన శకం లిఖించు…’ అంటూ విజయోత్సవ సభలో న్యూయార్క్‌నుద్దేశించి మమ్దానీ ఉద్ఘాటించారు. అమెరికాలోని అతిపెద్ద నగరానికి మేయర్‌ కోసం మంగళవారం జరిగిన ఎన్నికల్లో మమ్దానీ ఘన విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఈసారి 20 లక్షలకుపైగా ఓట్లు పోలవడం కూడా విశేషంగా నిలిచింది. ఈ ఎన్నికలో తన ప్రత్యర్థులు కుర్టిస్‌ స్లివా (రిపబ్లికన్‌ అభ్యర్థి), మాజీ గవర్నర్‌ ఆండ్రూ క్యుమో (స్వతంత్రుడు)పై మమ్దానీ భారీ విజయాన్ని నమోదు చేశారు. తన గెలుపుతో న్యూయార్క్‌కు పునర్‌జన్మ లభించిందని నినాదమిచ్చారు. అభిమానుల కేరింతలు, హర్షధ్వానాల నడుమ విజయోత్సవాన్ని జరుపుకున్నారు. రాజకీయంగా ఎదురైన సవాళ్లు… రోజువారీ సమస్యలు, ఒడిదుడుకులు అధిగమిస్తూ నవ శకానికి నాంది పలుకుదా మని పిలుపునిచ్చారు. పెత్తందారులకు స్వస్తి పలుకుతూ న్యూయార్క్‌ నగరం కొత్త అధ్యాయం లిఖించబోతున్నదని మమ్దానీ ఉద్ఘాటించారు. తన విజయంలో ప్రతి ఒక్క నగరవాసికి భాగస్వామ్యం ఉందని చెప్పారు. యువతరానికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతూ విజయోత్సవ సభను ఉత్తేజపరిచారు. భారత సంతతికి చెందిన దక్షిణాసియా మూలాలుగల అతి పిన్నవయస్సు ముస్లిం మేయర్‌గా మమ్దానీ ఎన్నిక ప్రత్యేకం. ఓ తరం ఆలోచనలలో పరివర్తనకు… సైద్ధాంతిక మార్పునకు నిదర్శనమైంది. పెట్టుబడిదారీ వర్గానికి కంచుకోటగా ఉన్న న్యూయార్క్‌ ఇప్పుడు డెమొక్రటిక్‌ సోషలిస్టు నాయకత్వంలోకి వచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వద్దని వారించినప్పటికీ న్యూయార్క్‌ మమ్దానీకి జైకొట్టింది. ఆయన ప్రచారాన్ని ఆదరించిన న్యూయార్క్‌ ప్రజలు మమ్దానీని మేయర్‌గా ఎన్నుకున్నారు. తమ భవిష్యత్తును మార్చుకునేందుకు తొలి అడుగు వేశారు. ఎన్నికల్లో చారిత్రక గెలుపు అనంతరం తన తదుపరి గమ్యస్థానం సిటీ హాల్‌ అంటూ మేయర్‌గా తన కొత్త ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు ‘ఎక్స్‌’లో ఓ పోస్టు పెట్టారు.
వాస్తవానికి పెట్టుబడిదారీ దేశంలో సోషలిస్టు భావజాలం గల నాయకుడు ఎన్నిక కావడం విశేషమనే చెప్పాలి. అధ్యక్షుడు ట్రంప్‌ ఆధిపత్యంలో డెమొక్రటిక్‌ పార్టీ నాయకుడు ప్రజాదరణ పొందారు. క్రమశిక్షణకు, దార్శనికతకు పోరాటపటిమకు పెట్టింది పేరుగా నిలిచారు. పేదల పక్షపాతం వెరసి క్వీన్స్‌కు చెందిన యువ శాసనసభ్యుడు మమ్దానీ… న్యూయార్క్‌కు 111 వ మేయర్‌గా ఎన్నికయ్యారు. సమకాలీన ప్రపంచం ఆయన ఎన్నికను ఓ విప్లవంగా అభివర్ణించింది. అమెరికాలో కులం, మతం, పార్టీ, ప్రాంతం అనే పట్టింపులు ఉండవు. అభ్యర్థికే విలువ ఇస్తారు. ఆయన/ఆమె ఇచ్చే హామీలు, పథకాల సాధనకున్న పట్టుదల, వాటి అమలులో చిత్తశుద్ధి, ముందు చూపుతో తీసుకునే నిర్ణయాలకే ఓటర్లు ప్రాధాన్యతిస్తారు.
కంపాలా నుంచి సిటీ హాల్‌ వరకు మమ్దానీ ప్రస్థానం…
జొహ్రాన్‌ మమ్దానీ ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. ఆయన తల్లి భారత్‌కు చెందిన ఫిలింమేకర్‌ మీరా నాయర్‌. తండ్రి ఉగాండాకు చెందిన మేధావి మహమూద్‌ మమ్దానీ. మమ్దానీకి ఏడేళ్లు ఉన్నప్పుడు ఆయన కుటుంబం న్యూయార్క్‌కు వలస వచ్చింది. అక్కడే స్థిర పడిరది. 2018లో మమ్దానీకి అమెరికా పౌరసత్వం లభిం చింది. ఆఫ్రికానా స్టడీస్‌లో ఆయన బొడాయిన్‌ కాలేజి నుంచి పట్టా పొందారు. తన స్కూలు తరపున మొదటి క్రికెట్‌ జట్లు ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. రాజకీయాల్లోకి రాక ముందు హౌసింగ్‌ కౌన్సిలర్‌గా పనిచేశారు. తక్కువ ఆదాయంగల ఇంటి యజమానులు గెంటివేయబడకుండా సేవలు అందించారు. ఈ అనుభవమే అసమానత్వంపై ఆయన అభిప్రాయాలను మలుపు తిప్పింది. 2020లో రాజకీయ అరంగేట్రం చేసిన మమ్దానీ… న్యూయార్క్‌ స్టేట్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. క్వీన్స్‌ అస్టోరియా, డిట్‌మార్స్‌ స్టెయిన్‌వే ఇరుగు పొరుగు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించారు.
జనవరిలో ప్రమాణ స్వీకారం:
న్యూయార్క్‌ నూతన మేయర్‌గా 2026, జనవరి 1 న జొహ్రాన్‌ మమ్దానీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత వందేళ్లలో న్యూయార్క్‌ మేయర్‌ పదవికి ఎన్నికైన పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈసారి మేయర్‌ ఎన్నికల్లో భారీగా పోలింగ్‌ జరిగింది. 20 లక్షల మందికిపైగా ఓటేశారు. 1969 తర్వాత ఇంత భారీగా పోలింగ్‌ జరగడం ఇదే మొదటిసారి. మమ్దానీ ప్రచారం మొత్తం ప్రజా సంక్షేమం, అధికార రిపబ్లికన్‌ పార్టీ, అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలతో సాగింది. ట్రంప్‌ తనను కమ్యూనిస్టుగా ముద్ర వేసినప్పటికీ న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నిక కావడం ద్వారా సర్కారు ఏకపక్ష విధానాలపై ప్రజల్లో ఏ మేరకు అసంతృప్తి ఉన్నదో మమ్దానీ నిరూపించారు. మమ్దానీ గెలిస్తే న్యూయార్క్‌ నాశనమవుతుందని, నిధులు ఇవ్వడం కష్టమంటూ ట్రంప్‌ హెచ్చరించారు. స్వయంగా ప్రచారం చేశారు. కానీ న్యూయార్క్‌లో పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక అసమానతలతో ట్రంప్‌ హెచ్చరికలను నగర వాసులు పట్టించుకోలేదు. తమ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చిన జొహ్రాన్‌ మమ్దానీకి మేయర్‌ పదవి కట్టబెట్టారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం, సబ్‌ వే చార్జీలపై తగ్గింపు, రవాణా సదుపాయాల విస్తరణకు వేగంగా చర్యలు తీసుకోవడం, ఇంటి అద్దెలు తగ్గించడం, ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం వంటి కీలక హామీలను మమ్దానీ ఇచ్చారు. ఆహార ధరలను తగ్గించడానికి నగర కార్పొరేషన్‌ అధ్వరంలో కిరాణా దుకాణాలు ప్రారంభించడం, సంపన్నులపై పన్నులు పెంచడం వంటివి తన ప్రణాళికలో ఉన్నాయని వెల్లడిరచారు. దీంతో న్యూయార్క్‌ ప్రజలు ఆయనను నమ్మారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం… బాధ్యతగా పనిచేయడం, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంతో పాటు ట్రంప్‌ను ఎదుర్కొనడం జొహ్రాన్‌ మమ్దానీ ముందున్న సవాళ్లుగా చెప్పవచ్చు. ఆయన వీటిని అధిగమించి న్యూయార్క్‌ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపగలరో లేదో వేచిచూడాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు