ప్రతి ఎకరానికి రూ.75 వేలు నష్టపరిహారం చెల్లించాలి
కె వి వి ప్రసాద్ డిమాండ్
విశాలాంధ్ర`విజయవాడ: నల్ల తామర తెగులు వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన మిర్చి రైతులకు ప్రతి ఎకరానికి రూ.75 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే వి వి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రంగా నష్టపోయిన ,రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో కే వి వి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మల్నీడు యల్లమందారావు, చుండూరు సుబ్బారావు తదితర ప్రతినిధి బృందం జిల్లాలోని రామిరెడ్డిపల్లి, ముచ్చింతాల గ్రామాల పరిధిలో దెబ్బతిన్న మిర్చి పంటలను శుక్రవారం పరిశీలించారు. గత రెండు నెలల నుండి మిర్చి పంటకు నల్లతామర, బొబ్బర, ఎండు తెగుళ్లు సోకి పంటలు దెబ్బతిన్నట్టు ప్రతినిధి బృందానికి రైతులు చెప్పారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతిన్న మిర్చి పంటలకు నివారణ చర్యలు చేపట్టకు పోవడం బాధాకరమన్నారు. ఇప్పటికే ఎకరానికే రూ.1.30 లక్షలు పెట్టుబడి పెట్టారని,దీంతో పాటు మరో రూ.25 వేలు కౌలుచెల్లించి సాగు చేసిన మిర్చి రైతులకు కనీస ఖర్చులు వచ్చే ఆవకాశం లేదన్నారు. రెండు,మూడు క్వింటాళకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెగుళ్ల నివారణ కోసం పురుగు మందులు విపరీతంగా పిచికారీ చేయడం, ఎరువుల వాడటం వల్ల భారం మరింత పెరిగి నష్టపోయారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవసరమైన పురుగుమందులను ఉచితంగా అందించి పంటలు రక్షంచాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటలకు బీమా పరిహారం వర్తింపచేయాలని కోరారు.రాష్ట్రంలో పండిరచిన ఏ పంటకు కూడా మద్దతు ధర దగ్గకపోవడం వల్ల రైతాంగం ఆర్థికంగా నష్టపోతున్నారని,ప్రస్తుతం మిర్చి పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో సాగు భారం పెరిగి రైతులు కృంగిపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ధరల స్థిరరికరణ నిధిని ఉపయోగించి అన్ని పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, లేకపోతే రైతాంగంతో ఆందోళనకు సిద్ధపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కౌలు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ మిర్చి పండిరచే రైతులలో 90 శాతం మంది కౌలు రైతులేనని ప్రతి ఏడాది ఎరువులు, పురుగుమందులు,విత్తనాలు,దుక్కి తదితర వాటి రేట్లు పెరిగి సాగు భారంగా మారిందన్నారు. మిర్చి పంటలకు మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో అలపాటి శ్రీనివాసరావు, అబ్బూరి చౌదరి బాబు, దర్శనాల బాలయ్య, దర్శనాల నాగమల్లేశ్వరరావు, కొండా నాయక్, అబ్బూరి వెంకటేశ్వరరావు, నల్లజర్ల రాజు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.


