నెత్తురోడిన బరులు – కట్టలు తెగిన నోట్లు
. వెయ్యి కోట్లకు పైనే పందాలు బ కోస్తా అంతటా తిరునాళ్ల వాతావరణం
. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో సాగిన అక్రమ వ్యాపారం
. శిబిరాల వద్ద ఏరులై పారిన మద్యం
. కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఊహించిందే జరిగింది. కోడి కాలుదువ్వింది. పందెం బరులు నెత్తురోడాయి. వందల కోట్లు చేతులు మారాయి. ఒకపక్క కోడి పందాలు, మరోపక్క పేకాట, మూడు ముక్కలాట, గుండాట, లోనా బయటా, కాయ్ రాజా కాయ్, పొట్టేలు పందాలు, ఇంకోవైపు వచ్చిన వీక్షకులను ప్రోత్సహించేందుకు రికార్డింగ్ డ్యాన్సులు, ఉత్సాహపరిచేందుకు మందు ఏర్పాట్లు…ఇలా కోస్తాలో ఎటుచూసినా పందెం బరులతో తిరునాళ్ల వాతావరణం నెలకొంది. పగలో, రాత్రో తేడా తెలియనంత విధంగా ఫ్లడ్‌లైట్లు వెలుగులో పోటీలు నిర్వహించారు. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు, ప్రత్యక్షంగా వీక్షించేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ఏడాది పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కోస్తా జిల్లాల్లో ఏ పందెం బరి చూసినా వందల కార్లు, బైక్‌లతో కిటకిటలాడాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మూడు రోజుల పాటు దాదాపు వెయ్యి కోట్లపైనే పందాల్లో చేతులు మారినట్లు చెపుతున్నారు. వాహనాల యజమానుల నుంచి పార్కింగ్ ఫీజు రూపంలోనే నిర్వాహకులు భారీగా గుంజారు. బరులు ఏర్పాటు చేసిన ప్రాంతాలు జాతరను తలపించాయి. కోడి పందాలు తిలకించేందుకు నిర్వాహకులు వేదికలు, గ్యాలరీలు, టెంట్లు ఏర్పాటు చేశారు. పందెం బరుల వద్ద మద్యం ఏరులై పారింది. వేల సంఖ్యలో జనం తరలిరావడంతో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. ఈ అనధికార మద్యం కేంద్రాల్లో రెట్టింపు ధరకు లిక్కర్ విక్రయించారు. కొంతమంది ఏకంగా ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో మద్యం పెట్టుకుని… అక్కడే గ్లాసుల్లో పోసి… మందుబాబులకు విక్రయించారు. శిబిరాల వద్ద మాంసాహారం, తినుబండారాల అమ్మకాలు జోరుగా సాగాయి. ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, అనకాపల్లి, భీమవరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వందల సంఖ్యలో బరులు ఏర్పాటయ్యాయి. సంప్రదాయ ముసుగులో ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే కోడి పందాలు, ఇతర అక్రమ, అసాంఘిక కార్యక్రమాలు కొనసాగడం విశేషం. ప్రభుత్వం నుంచి అందిన మౌఖిక ఆదేశాలతో పోలీసులు ఈ శిబిరాలవైపు కన్నెతి కూడా చూడలేదు. గతంలో కంటే ఈసారి పందెం బరుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గన్నవరం మండలం కేసరపల్లిలో క్యాసినో, లోనా బయట వంటి జూద క్రీడల్లో రూ.కోట్లు చేతులు మారాయి. పెద్ద బరి వద్ద రూ.2 లక్షల నుంచి పందేలు ప్రారంభం కాగా… ఎన్ఆర్ఐలు పెద్దఎత్తున పందేలు ఆడారు. గుడివాడ బైపాస్‌లో నిర్వహించిన బరిలో గుండాట, లోనా బయటా వంటి జూద క్రీడల శిబిరాల్లో కోట్లు చేతులు మారాయి. పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, బౌన్సర్లను పెట్టారు. అడిగినచోటకే కావాల్సిన మద్యం, ఆహారం అందించారు. పందెంలో ఓడిన పుంజులు రూ.వేలల్లో అమ్ముడు పోయాయి. అక్కడే మాంసం కోసి ఇచ్చే ఏర్పాట్లు చేశారు. పెనమలూరు నియోజకవర్గం ఉప్పులూరు, కంకిపాడు, ఈడుపుగల్లు, గొడవర్రు, ఆకునూరు, కాటూరు, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో భారీగా జూద క్రీడలు సాగాయి. ఐదు పందేలు గెలిచిన వారికి ద్విచక్ర వాహనాలు బహుమతిగా ఇచ్చారు. మచిలీపట్నం, అవనిగడ్డ, కూచిపూడి, పామర్రు తదితర ప్రాంతాల్లోనూ లోనా బయటా వంటి జూదాల్లో రూ.కోట్లు చేతులు మారాయి. నిడదవోలు మండలం డి.ముప్పవరంలో మూడు బరుల్లోను, విజ్జేశ్వరం, కోరుమామిడి, తాడిమళ్ల, కాటకోటేశ్వరం, నిడదవోలులోని సుబ్బరాజుపేట-ఎన్టీఆర్ కాలనీని చేర్చి, వెంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా రెండు, బసివిరెడ్డిపేట, నిడదవోలు-సింగవరం మధ్య భారీ ఎత్తున పందేలు నిర్వహించారు. కొవ్వూరు పట్టణ పరిధిలో రెండు, ఆరికిరేవుల, పశివేదల, పంగిడి, మద్దూరు, చాగల్లు మండలంలోని చాగల్లు, చిక్కాల, నందిగంపాడు, మల్లవరం, తాళ్లపూడి మండలంలోని గజ్జరం, అన్నదేవరపేట, వేగేశ్వరపురం, తాళ్లపూడి, పెద్దేవం, రావూరుపాడు, మలకపల్లి, దేవరపల్లి మండలం దేవరపల్లి, యాదవోలు, యర్నగూడెం, చిన్నాయిగూడెం, బంధపురం, త్యాజంపూడి, కృష్ణంపాలెం, గోపాలపురం మండలంలోని అనేక గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. కడియం మండలం వీరవరం, తాళ్లపూడి మండలం మలకపేటలో పందేల విజేతలకు బుల్లెట్ వాహనాలు అందించారు. ఏలూరు గ్రామీణ మండలం జాలిపూడి, చాటపర్రు, మాదేపల్లి రోడ్డు, మల్కాపురం రోడ్డు, శ్రీపర్రు, గుడివాకలంక, ప్రత్తికోళ్లలంక, పైడిచింతపాడు, పోణంగి, చొదిమెళ్ల, శివనగర్ తదితర ప్రాంతాల్లో పందేలు యథేచ్ఛగా సాగాయి. జాలిపూడిలో గ్యాలరీలు, ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. పెదవేగి మండలం దుగ్గిరాల, కవ్వకుంట, కూచింపూడి, లక్ష్మీపురం, జానంపేట, కొండలరావుపాలెం, దిబ్బగూడెం, పెదపాడు మండలం పాతపెదపాడు, కలపర్రు, తాళ్లమూడి, ఏపూరు, కొక్కిరపాడు గ్రామాల్లో పందేలు జోరుగా సాగాయి. నారాయణపురం, బాదంపూడి, గొల్లగూడెం, గణపవరం, నిడమర్రు, భీమడోలు మండలాల్లో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. పెదనిండ్రకొలను, తోకలపల్లి, గణపవరం, వరదరాజపురం, అగ్రహార గోపవరం, కేశవరం, కాశిపాడు, జల్లి కొమ్మర గ్రామాల్లో యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించారు. భీమడోలు, కురెళ్లగూడెం, గుండుగొలను, పూళ్ల, అంబరుపేట గ్రామాల్లో భారీ వేదికలు, బరులు ఏర్పాటు చేశారు. గుండుగొలను, భీమడోలులలో పందేలు గెలుచుకున్న వారికి కార్లు, బుల్లెట్ మోటారు సైకిళ్లను బహుమతిగా ప్రకటించారు.
ఒక్క నిముషంలో కోటి 53 లక్షలు గెల్చుకున్న పందెంరాయుడు
ఓ వ్యక్తి కోడిపందెంలో ఏకంగా 1.53 కోట్ల రూపాయలు గెలిచాడు. రాజమండ్రి రమేష్ అనే వ్యక్తి ఈ రికార్డు సృష్టించాడు. గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేష్ కోళ్ల మధ్య భారీ పందెం జరిగింది. రాజమండ్రి రమేష్ కోడి ప్రభాకర్ కోడిని చిత్తుచిత్తుగా ఓడిరచింది. ఒక్క నిముషంలో ఈ రెండు కోళ్ల మధ్య పోటీ ముగిసింది. అంటే కేవలం నిముషం వ్యవధిలోనే రమేష్ 1.53 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది ఇదే అతిపెద్ద పందెం అని స్థానికులు అంటున్నారు.
ఎటుచూసినా ట్రాఫిక్ జామ్
బరుల వద్ద పార్కింగ్‌కు రైల్వేస్టేషన్, బస్టాండ్ల వద్ద వసూలు చేసిన తరహాలో మూడు గంటల చొప్పున ద్విచక్ర వాహనాలకు రూ.50, కార్లకు రూ.200 వరకు వసూలు చేస్తుండడంతో చాలా వాహనాలు రోడ్లపక్కనే నిలిపేశారు. దీనివల్ల బరులన్నీ దాదాపు ప్రధాన రహదారుల పక్కనే ఉండడంతో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పలేదు. అయితే నిర్వాహకులే ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంతో పాటు పందెం బరుల వద్ద మందుబాబుల ఆగడాలను అడ్డుకునేందుకు కృషి చేశారు.
యూపీఐకి నగదు బదిలీ సదుపాయం
ఫోన్ పే, గూగుల్ పేకు అలవాటుపడి ఎక్కువ మంది నగదు జేబుల్లో పెట్టుకోవడం లేదు. దీనిని గమనించిన పందెం బరుల నిర్వాహకులు ఇటువంటి వారికి ఇబ్బందిలేకుండా, పందెం ఆడేవారికి అనుకూలంగా డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా డబ్బులు డ్రా చేసునేందుకు ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టారు. కొంత కమీషన్ తీసుకొని కావాల్సినంత నగదు ఇచ్చే ఏర్పాట్లు చేశారు.


