ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల పరిణామాలు అనూహ్యంగా వెలువడ్డాయి. ఎప్పటివలే అక్కడ పులి గర్జించలేదు. అనుకోని విధంగా కమలం వికసించింది. దేశంలోని సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేట్ (బీఎంసీ) ఠాక్రే పరివారం చేజారింది. స్థానిక ఎన్నికల్లో శివసేన రాణించలేకపోయింది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలయిక కలిసిరాలేదు. అనుకున్న ఫలితానివ్వలేదు. పవార్ పరివారం పట్టుకోల్పోయింది. కాంగ్రెస్ కూడా ఢీలా పడిరది. చీలిన శివసేన వర్గానికి నాయకత్వం వహించే ఏక్నాథ్ శిందే మద్దతుతో బీజేపీ పుంజుకున్నది. స్థానిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. మొదటిసారి మేయర్ ఏర్పాటు చేయబోతోంది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం… ఛత్రపతి సాంబాజీనగర్ సహా 11 స్థానాల్లో 60కుపైగా స్థానాలను కైవసం చేసుకుంది. ముంబై, థానే, ధూలే, అమరావతి, జల్నాలో ఖాతా తెరించింది. ప్రకాశ్ అంబేద్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అగాధీ (వీబీహెచ్) పార్టీ నాందేడ్, లాతూర్, అకోలాలో చెరో నాలుగు స్థానాలు గెలుచుకున్నది. కాగా, బీఎంసీలో మొత్తం 227 స్థానాలు ఉండగా, మహాయుతి 119 స్థానాల్లో గెలిచింది. శివసేన (యూబీటీ), ఎంఎన్ఎస్, ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్ పార్టీలు 76 చోట్ల విజయం సాధించాయి. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చాలా ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు కానీ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయారు. దీంతో ముంబైపై ఠాక్రే కుటుంబం పట్టు కోల్పోతోందన్న చర్చ జరుగుతోంది. మాతోశ్రీ (ఠాక్రే నివాసం) రాజకీయానికి తెరపడే రోజులు వచ్చాయన్న విమర్శలు వినవస్తున్నాయి. అయితే బీఎంసీ ఎన్నికల్లో ఏక్నాథ్ శిందే మూడవ స్థానంలో నిలవడం ఠాక్రే సోదరులకు కాస్తంత ఉపశమనం కల్పించే విషయం. తన కంటే ఉద్ధవ్ వర్గం ఎక్కువ స్థానాలు గెలుచకోవడం శిందేను కలవరపెట్టే అంశం. పవార్ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్న పూణే, పింప్రీ చించ్వాడలో బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ నిలుస్తోంది. బీజేపీని దూరం పెట్టేందుకు కలహాలను పక్కకు పెట్టి అజిత్ పవార్ (ఎన్సీపీ), శరద్ పవార్ (ఎస్సీపీ`ఎస్పీ) చేతులు కలిపినప్పటికీ ఫలితం దక్కలేదు. కీలకమైన లాతూర్ స్థానంలో బీజేపీపై కాంగ్రెస్ పైచేయి సాధించగలిగింది. 70కుగాను 43 చోట్ల గెలిచింది. బీజేపీని 22 స్థానాలకు పరిమితం చేసింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఈ ఫలితం వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అన్నారు. ఇదిలావుంటే, బీజేపీ ఆవిర్భవించిన రోజు నుంచి బీఎంసీ మేయర్ పదవిని మొదటిసారి దక్కించుకున్నది. తమకు ఇది మహా విజయం అంటూ సీఎం ఫడ్నవీస్ ప్రకటించుకున్నారు.


