సీహెచ్ కోటేశ్వరరావు పిలుపు
విశాలాంధ్ర-విజయవాడ: సమ సమాజ స్థాపనకు విరోచితమైన పోరాటాలు నిర్వహించి… విజయాల ఘన చరిత్ర కలిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో ఈనెల 18న అంటే ఆదివారం జరగబోయే ముగింపు వేడుకలకు ఉప్పెనలా తరలిరావాలని కోరారు. ఈ ఉత్సవాల ప్రచార కార్యక్రమంలో భాగంగా మైలవరంలోని భూ పోరాట కేంద్రాలలో కోటేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న తరుణంలో 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో సీపీఐ ఉద్భవించిందని గుర్తుచేశారు. మార్క్సిజం సిద్ధాంత బాటలో ముందుకెళుతూ బ్రిటిష్ పాలకులను గడగడలాడిరచిందని, వీరోచితంగా పోరాడి, త్యాగాలతో అనేక విజయాలు సాధించిందని అన్నారు. శ్రామిక వర్గానికి అన్ని విధాలా అండగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ మైలవరం నియోజకవర్గ కార్యదర్శి బుడ్డి రమేశ్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు సీహెచ్ దుర్గా కోటేశ్వరరావు, గిరిజన సమాఖ్య నాయకులు బాలు నాయక్‌తో పాటు నాయకులు ఆంగోత్ నాగు, అజ్మీర భీముడు, ఆనందబాబు, అన్నవరపు కృష్ణ, కారుమూరి రత్నకుమారి, బసవని కుమారి, ముహూర్త లక్ష్మి దేవరపల్లి దానమ్మ, వజ్రమ్మ, ఫ్రాన్సిస్ కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


