. ప్రశాంత్ రాజ్ అకాల మరణం తీరని లోటు
. విశాలాంధ్ర జీఎం హరినాథ్ రెడ్డి
. ప్రశాంత్ పేరుతో ట్రస్ట్-ఉత్తమ జర్నలిస్టు అవార్డు: అజయ్
విశాలాంధ్ర-కర్లపాలెం: విశాలాంధ్ర బాపట్ల జిల్లా బ్యూరోగా పనిచేస్తూ రిపోర్టింగ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాగిత ప్రశాంత్ రాజ్ అకాల మరణం తీరని లోటని విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి.హరినాథ్ రెడ్డి అన్నారు. ప్రశాంత్ రాజు ఆదరణ కూడిక (పెద్దకర్మ) వారి స్వగ్రామమైన నర్రావారిపాలెంలో శుక్రవారం జరిగింది. ప్రశాంత్ నిబద్ధతగల జర్నలిస్టు, వార్తను వార్తగా మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఆయుధంగా మలచిన రిపోర్టర్ అని హరినాథ్ రెడ్డి కొనియాడారు. ప్రజల సమస్యలను గుర్తించి బాధ్యతాయుతంగా రిపోర్టింగ్ చేయడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. విశాలాంధ్ర విలువలను తన పనితీరుతో ప్రతిబింబించిన మంచి సహచరుడిని కోల్పోయామంటూ విచారం వ్యక్తంచేశారు. ప్రశాంత్ లేని లోటు పూరించలేనిదన్నారు ప్రశాంత్ రాజ్ మార్గం యువ జర్నలిస్టులకు ప్రేరణ అని హరినాథ్ రెడ్డి అన్నారు. కష్ట సమయంలో ఆయన కుటుంబానికి విశాలాంధ్ర సంస్థ అండగా నిలుస్తుందన్నారు. ప్రశాంత్ రాజు సేవలను స్మరిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండాలని జీఎం ఆకాంక్షించారు, విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కోన అజయ్ బాబు మాట్లాడుతూ ప్రశాంత్ చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబానికే కాదు విశాలాంధ్రకు కూడా తీరని లోటని అన్నారు. తన కలం ద్వారా సమాజంలో ఉన్న రుగ్మతలను ఎత్తిచూపడంతో పాటు అంబేద్కర్ భావాజాలం, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. గొప్ప జర్నలిస్టును కోల్పోయామని, ఆయన మరణం పత్రికా రంగానికి కూడా తీరనిలోటన్నారు. ప్రతి ఏడాది ప్రశాంత్‌రాజ్ వర్ధంతిని పురస్కరించుకొని ప్రశాంత్ పేరుతో ఉత్తమ జర్నలిస్టు అవార్డును ప్రదానం చేయనున్నట్లు కూన అజయ్ ప్రకటించారు. ఇప్పటికే కేపీఆర్ పేరుతో ట్రస్ట్‌ను కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏడాది జర్నలిజంలోని మూడు విభాగాలను తీసుకొని అవార్డులు అందిస్తామన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అజయ్ భరోసానిచ్చారు. అనంతరం ఇంటెలిజెన్స్ డీఎస్పీ మాట్లాడుతూ తక్కువ సమయంలోనే ఉత్తమ జర్నలిస్టుగా ఎదిగిన ప్రశాంత్ రాజ్ మరణం బాధాకరమన్నారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేశారు. ప్రశాంత్ పేరుతో ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. సంస్మరణ సభ అనంతరం ప్రశాంత్ తండ్రి, సతీమణితో పాటు కుటుంబ సభ్యులను హరినాధ్‌రెడ్డి, అజయ్‌బాబుతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి సింగరకొండ, ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యదర్శి అలుగుల సురేశ్ కలిశారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్యాముల్, సహచరులు మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ప్రశాంత్ రాజ్ సేవలను కొనియాడారు. ఆయనకు నివాళులర్పించారు.


