. తెగుళ్లతో తంటాలు
. నట్టేట ముంచుతున్న నల్లి
. దిగుబడులపై ప్రభావం
. ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు
విశాలాంధ్ర – సచివాలయం: ఆరుగాలం కష్టించి పంటలు పండిరచే రైతన్నకు అన్నీ కష్టాలే. ఓసారి అతివృష్టి… మరోసారి అనావృష్టి వెంటాడుతోంది. ప్రత్యేకించి మిర్చి రైతుకు కాలం కలిసి రావడంలేదు. ఏటా దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. చివరకు కర్షకుడికి కన్నీటిని మిగుల్చుతోంది. భారీ వర్షాలు, నల్లి తెగులు, వైరస్, ధరల పతనం… ఇలా రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 2.67 లక్షల ఎకరాల్లో మిరప సాగు చేశారు. 2024తో పోలిస్తే లక్ష ఎకరాలు తగ్గింది. మిరప అధికంగా పల్నాడు జిల్లాలో లక్ష 10 వేల ఎకరాలు, కర్నూలు 43 వేలు, ప్రకాశం 42 వేలు, అనంతపురం 23 వేలు, ఎన్టీఆర్ జిల్లాలో 22 వేల ఎకరాలు సాగు చేశారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ధరలు పుంజుకోవడంతో రైతుల్లో ఆశ మొదలైంది. క్వింటాకు సగటున రూ.15 వేలకు చేరింది. కలిసొస్తే అప్పుల నుంచి బయటపడతామని భావించారు. అక్టోబరులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో మొక్కదశలోనే మిరప దెబ్బతింది. నవంబరులో కురిసిన కుండపోత వర్షాలతో తెగుళ్లు ప్రబలాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మిరప మొక్కలు ఎదగలేదు. కొన్నిచోట్ల కోలుకున్నా ఇప్పటికీ అడుగు ఎత్తులోనే ఉన్నాయి. రెట్టింపు స్థాయిలో ఎరువులు వేసి… పురుగు మందులు చల్లారు. పైరు ఏపుగా ఎదిగే సమయంలో వైరస్ ఆశించింది. నల్లి తీవ్రత కూడా అధికమైంది. నల్లితామర ప్రభావం దిగుబడిపై పండిరది. నల్లి తెగులు రైతులను నలిపేసింది. దీని నివారణకు ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.90 వేలు ఖర్చుచేసి, మందులు పిచికారి చేయాల్సి వచ్చింది. అయినా పురుగు నివారణ అంతంత మాత్రంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లికి తోడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తెగుళ్లు ఆశించడంతో వాటికీ రసాయన మందులు చల్లాల్సివస్తోంది. హైబ్రిడ్ విత్తనాలు, సేద్యం, ఎరువులు, రసాయన మందులు, కూలీల ఖర్చు కలిపితే ఇప్పటికే ఎకరాకు రూ.రెండు లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా పూత, పిందె నేలరాలుతున్నాయని, తెగులు సోకిన కొద్దిరోజులకే పంట పూర్తిగా ఎండిపోతోందని రైతులు అంటున్నారు. ఎకరాకు 10 క్వింటాళ్ల కాపు నిలిచినా పెట్టుబడిలో కొంతైనా వస్తుందనే ఆశతో సాహసం చేస్తున్నారు. పంట ఆశాజనకంగా ఉంటే ఎకరానికి సుమారు 20 క్వింటాలు వరకు దిగుబడి వస్తుందని, అయితే ఈ సంవత్సరం తెగుళ్లు సోకడంతో ఎకరానికి ఐదు క్వింటాలు కూడా దిగుబడి రావడం లేదని, వచ్చిన పంటను మార్కెట్‌కు తరలిస్తుంటే నాణ్యత లేదని వ్యాపారులు ధర పూర్తిగా తగ్గించేస్తున్నారని… ఇప్పుడు మార్కెట్‌కు వెళ్లినా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని ఇతర ఖర్చులతో చూస్తే రూ.రెండు లక్షలు ఖర్చు అయిందని, పావలా ఆదాయం కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2021-22లో నల్లి ఆశించడంతో మిరప రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. 75 శాతం మంది పురుగుమందులు చల్లలేక పంటను వదిలేశారు. ప్రభుత్వం రైతు గోడు పట్టించుకోలేదు. కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది సమస్య మళ్లీ విజృంభించిందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. మార్కెట్లో మిరప ధర పెరుగుతుండగా, రైతులకు మాత్రం దిగుబడులు దక్కేలా లేవని, మళ్లీ ఈ ఏడాదీ నష్టాలే అనే నిరాశ రైతుల్ని వెన్నాడుతోంది. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని పలువురు అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.


