. వివేకా హత్య కేసులో సీబీఐని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరముందా? లేదా? అని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దర్యాప్తు అవసరముంటే ఎవరెవరిని విచారించాలో స్పష్టం చేయాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏయే అంశాలపై తదుపరి విచారణ అవసరమో స్పష్టంగా చెప్పాలని, ఎవరిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని అనుకుంటున్నారో చెబితే దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ కేసులో ముందుగా సునీత తరపున హాజరయిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ట్రయల్ కోర్టుకు వెళ్లామని, అయితే అక్కడ తదుపరి దర్యాప్తు అవసరమని పిటిషన్‌లో తాము పేర్కొన్న అంశాల్లో ఏ ఒక్కటీ ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అంతేకాకుండా పిటిషన్‌లో పేర్కొనని అంశాలను తీసుకుని పరిమితమైన మేరకే పాక్షికంగా దర్యాప్తునకు అనుమతి ఇచ్చారని, అది న్యాయబద్ధం కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకె ళ్లారు. వివేకా కేసును పాక్షికంగా దర్యాప్తునకు అనుమతించడమేంటి అని లూథ్రా ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎంఎం.సుందరేశ్ జోక్యం చేసుకుని వివేకా హత్య కేసులో తదుపరి విచారణ అవసరమని భావిస్తున్నారా? అని సీబీఐని ప్రశ్నిస్తూ, ఏయే అంశాలపై తదుపరి విచారణ అవసరమో స్పష్టంగా చెప్పాలని కోరింది. దీనిపై విచారణాధికారిని అడిగి చెప్పగలమని, ఇందుకోసం రెండు వారాల సమయం కావాలని సీబీఐ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.


