Homeవిశ్లేషణభారత రాజ్యాంగం…వైరుధ్యాలు

భారత రాజ్యాంగం…వైరుధ్యాలు

- Advertisement -

షేక్ కరీముల్లా

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26. ఆ రోజు దేశమంతా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. అయితే ఇది మొక్కుబడి కార్యక్రమం కాకూడదు. రాజ్యాంగ లక్ష్యాలు సాధించగలగాలి. భావిభారత పౌరులకు రాజ్యాంగ స్ఫూర్తిని అందించగలగాలి. కానీ ఆచరణ మాత్రం భిన్నంగా ఉంది. భారతదేశం ఒక సామాజిక సమ్మేళనం. స్వాతంత్య్రనాంతరం దేశ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం. మన రాజ్యాంగ కూర్పునకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగం అనేది ప్రతి దేశంలో అత్యున్నత చట్టం. దీని ద్వారా అన్ని వ్యవస్థలు ఏర్పడి అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజలకు సైతం ప్రాథమిక హక్కులు లభిస్తాయి. అందుకే రాజ్యాంగాన్ని దేశభవిష్యత్ విధాతగా పేర్కొంటారు. రాజ్యాంగం ఈ దేశాన్ని సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా నిర్మించాలని చెప్పింది. అలాగే దేశ ప్రజలకు సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం కల్పిస్తామని ప్రకటించింది. ఆదేశిక సూత్రాలలో అందరికీ విద్య, ఆరోగ్యంతో పాటు మత్తు పదార్థాలు, మద్య నిషేధం వంటి అంశాలు రాజ్యాంగంలో చేర్చారు. సహజ వనరులు, సంపద ప్రజలందరికీ చెందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మొత్తంగా శ్రేయో రాజ్య స్థాపన జరగాలని నొక్కి చెప్పింది. అయితే 76 సంవత్సరాల తరువాత వెనక్కి తిరిగి చూస్తే ఆచరణలో పై సంక్షేమం ఏది ప్రజలకు దక్కలేదు. ఇక్కడ భారత రాజ్యాంగంలోని ఆదర్శాలకు-భౌతిక వాస్తవికతకు మధ్య తీవ్రమైన వైరుధ్యం ఉంది. ఆర్టికల్ 21 వ్యక్తి స్వేచ్ఛను, చట్టరీత్యా తప్ప ఇతర పద్ధతుల్లో ప్రాణం తీసే వీలులేదు. కానీ ఆచరణలో చూస్తే రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతోంది. ఉదాహరణకు స్టాన్ స్వామి, ప్రొఫెసర్ సాయిబాబా, ఉమర్ ఖాలీద్, షర్జిల్ ఇమామ్‌ల విషయంలో చట్టం ముందు అందరూ సమానం కాదని పాలకులు రుజువు చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను, మావోయిస్టు పార్టీ కార్యకర్తలను కాల్చి చంపుతున్నారు. ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రాలలో శాంతిభద్రతలు కాపాడటానికి కేంద్రం పారామిలటరీ సైనిక బలగాలను మోహరింపచేయటానికి అవకాశం ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత రాజ్యంపై ఉంది. కానీ పరిరక్షించడం లేదు. మొదట సొంత ఆస్తిని వ్యక్తిగత హక్కుగా రాజ్యాంగం గుర్తించడం వలన ఆర్థిక దోపిడిని హక్కుగా ప్రకటించారు. దీనిపై విమర్శలు రావడంతో 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి, చట్టబద్ధమైన హక్కుగా ఆర్టికల్ 300ఏ కింద మార్చారు. చట్టబద్ధంగా ఆస్తి హక్కును కాపాడుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరోవైపు రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకికవాదం, ఆర్థిక అసమానతలు లేని సమసమాజ రాజ్యస్థాపన లక్ష్యంగా ప్రకటించుకున్నాం. రాజ్యాంగంలో ఇది ఒక మౌలిక వైరుధ్యం.ఇంకా లోతుల్లోకి వెళ్తే 1963-64లో సజ్జన్‌సింగ్ గోలక్నాథ్ కేసులో రాజ్యాంగంలో మార్పులు చేసే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు చెప్పింది.1973లో కేశవనంద భారతి కేసులో పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు గాని దాని మౌలిక స్వరూపాన్ని మార్చొద్దని తీర్పు చెప్పింది. ఇటీవల తమిళనాడు గవర్నర్ రవి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు నిలుపుదల కేసులో గవర్నర్, రాష్ట్రపతులకు బిల్లులు నిలుపుదల చేసే అధికారం లేదని మూడు నెలల్లోగా నిర్ణయం చెప్పాలని గత ఏప్రిల్ 8న న్యాయమూర్తులు జె.బి.పార్థివాల, ఆర్.మహాదేవన్‌తో కూడిన బెంచ్ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై రాష్ట్రపతి రివ్యూ పిటిషన్ వేయగా, ప్రధానన్యాయమూర్తి గవాయ్‌తో కూడిన బెంచ్ ఇలా గడువు విధించటం రాజ్యాంగ సమ్మతం కాదని తీర్పు చెప్పింది. అంటే ఇది పాలనా వ్యవస్థల మధ్య ఒక రాజీ లాంటిది. ఎన్నో నేరాలు చేసిన డేరా బాబా లాంటివారు పెరొల్ పై అనేకసార్లు బయటకు వస్తూ పోతూ ఉంటారు. అదే ఉమర్ ఖాలీద్, షర్జిల్ ఇమామ్ లాంటి హక్కుల కార్యకర్తలు కనీసం విచారణకు నోచుకోకుండా, బెయిల్ దక్కకుండా జైల్లో మగ్గుతూ ఉంటారు. రాజ్యాంగంలోని ఈ వైరుధ్యాలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయకపోతే, ప్రజలు తిరుగుబాటు చేస్తారని అంబేద్కర్ స్పష్టంగా ప్రకటించాడు. “జనవరి 26 1950న…మనం వైరుధ్యాల్లోకి ప్రవేశిస్తున్నాం. రాజకీయ రంగంలో సమానత్వం ఉన్నప్పటికీ, సామాజిక, ఆర్థిక రంగాలలో అసమానతలు కొనసాగుతున్నాయి. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఒక విలువగా గుర్తించబడింది. కానీ సామాజిక, ఆర్థిక రంగాలలో ఆ విలువ గుర్తించబడలేదు. ఈ వైరుధ్యాన్ని మనం ఎంతకాలం కొనసాగించగలం ? సామాజిక ఆర్థిక జీవితంలో సమానత్వం లేకుండా ఎంత కాలం ఉండగలం ? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఎంత తొందరగా ఈ వైరుధ్యాన్ని రూపుమాపగలిగితే అంత మంచిది అలా కాకపోతే అసమానత్వంతో బాధపడుతున్న ప్రజలు ఏ ప్రజాస్వామ్యాన్ని అయితేఈ రాజ్యాంగ సభ రూపొందించిందో దాన్ని బద్దలు కొడతారు” అని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించాడు. ఏదైనా రాజ్యాంగ పునాదులు కదులుతున్నాయి. రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్నది వాస్తవం. ప్రస్తుత మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేయాలని వీలైతే మనుస్మృతిని రాజ్యాంగంగా మలచాలని పావులు కదుపుతోంది. ఈ సమయంలో రాజ్యాంగాన్ని యధాతధంగా అమలు చేసేలా ప్రజలు చైతన్యం పొంది, పోరాటాలు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. సెల్ 9705450705

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు