. కొలిక్కిరాని కష్ణా, గోదావరి నదీ జలాల సమస్య
. రెండు గంటలు సాగిన కేంద్ర జలశక్తి సమావేశం
. నల్లమలసాగర్ ప్రాజెక్టు అంశం అజెండాలో వద్దన్న తెలంగాణ
. గత ఒప్పందం ప్రకారం నీటివాటా నిర్ధారించాలన్న ఏపీ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల నిర్వహణ, వినియోగం విషయంలో కొనసాగుతున్న వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం శుక్రవారం దిల్లీలో ప్రారంభమైంది. సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ సలహాదారులు, ఇంజినీర్ ఇన్- చీఫ్‌లు, జలవనరుల శాఖ అధికారులు, కేఆరఎంబీ, జీఆరఎంబీ చైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజినీర్లు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల అధికారులు ఎవరి వాదనలు వారు వినిపించారు. దాదాపు రెండు గంటలపాటు భేటీ కొనసాగింది. ఏపీ నుంచి జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, పలువురు అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఆదిత్యనాథ్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్, కేంద్ర, రాష్ట్ర సమన్వయ అధికారి గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. అజెండాలో 12 అంశాలు చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టవద్దని కోరింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50 శాతం వాడుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ అధికారులు లేవనెత్తిన అంశాలపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత కష్ణా జలాల్లో ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకునేలా 2015లో తాత్కాలిక అవగాహన కుదిరిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. దాని ప్రకారం ఏపీకి నీటి వాటా నిర్ధారించాలని అధికారులు కోరారు. అలాగే గోదావరి జలాలకు సంబంధించి వథా జలాలను సీమకు మళ్లించే ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తుందని, దీనివల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని తెలియజేశారు. వారంలోగా అజెండా అంశాలు ఖరారు చేసి లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ఏపీ అధికారులకు సూచించారు. అజెండా అంశాలు ఖరారయ్యాక తదుపరి భేటీ తేదీ ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కష్ణాజలాల్లో తెలంగాణకు దక్కాల్సిన నీటిలో ఒక్క చుక్క కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. దిల్లీలో జరిగిన సమావేశం గురించి బీఆరఎస్ నాయకుడు హరీష్ రావు తెలుసుకుని మాట్లాడాలన్నారు. తెలంగాణ వాటా జలాలను కాపాడుకోవడానికి ఎవరితోనైనా చర్చలకు సిద్ధమని, కానీ చుక్క నీరు కూడా వదులుకునేది లేదన్నారు. తెలంగాణ అధికారులు… నల్లమలసాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టడానికి అంగీకరించేది లేదని స్పష్టం చేశారన్నారు. అంతర్గత రాష్ట్రాల సమస్యలు అజెండాలో పెట్టాలని కేంద్రానికి చెప్పారని తెలిపారు. పోలవరం, నల్లమల సాగర్‌కు అనుమతి లేదని కేంద్రమంత్రి తనకు లేఖ రాశారు. ఇవాళ జరిగిన సమావేశంలో కూడా సీడబ్ల్యూసీ ఇదే చెప్పిందన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని అప్ప్పుల పాలు చేసి కట్టిన ప్రాజెక్టు కూలిందని, అందుకు బీఆరఎస్ నాయకులు సిగ్గుపడాలన్నారు. పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, డిండి ప్రాజెక్టు అలాగే ఉందని, పదే పదే అబద్ధాలు చెప్పి… నిజం చేయాలని అనుకుంటున్నారని బీఆరఎస్ నేతలపై ధ్వజమెత్తారు. గత పదేళ్లలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఎక్కువ నీటి వినియోగం, వరి దిగుబడి వచ్చిందని మంత్రి వ్యాఖ్యానించారు.


