విశాలాంధ్ర – ఉరవకొండ: ఉరవకొండ పట్టణంలో గంజాయి విక్రయానికి సిద్ధమవుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి 2.17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, గుత్తి పట్టణానికి చెందిన చిన్న కందుకూరి అజయ్, వడ్ల ఆదిత్య అనే యువకులు గంజాయి విక్రయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందడంతో ఉరవకొండ పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద సోమవారం పోలీసులు దాడి నిర్వహించారు. తనిఖీల్లో వారి వద్ద ఉన్న 2.17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మహానంది, ఎస్సై జనార్ధన్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ, జల్సాలకు డబ్బులు సరిపోక సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి ఒడిశా రాష్ట్రంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువచ్చి ఎక్కువ ధరకు విక్రయించాలనుకున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.అరెస్టు చేసిన నిందితులను రిమాండ్ నిమిత్తం ఉరవకొండ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.


