. ప్రజా సమస్యలు పట్టని వైనం
. కల్తీ నెయ్యితో కూటమి, వైసీపీ రాజకీయం
. ఎన్నికల హామీల విస్మరణ
. జనసేనలో అసంతప్తి లొల్లి
. బొలిశెట్టి, రజని దూరం!
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్రంలో ఏ సమస్యలూ లేనట్లుగా అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీలు కల్తీ నెయ్యి అంశంతో పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. అటు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయకుండా, ఇటు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను వైసీపీ పోషించకుండా కేవలం తమ రాజకీయం కోసం ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయన్న విమర్శలున్నాయి. కేంద్ర బడ్జెట్ నుంచి అన్ని విధాలా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేని ఈ పార్టీలు కేవలం కల్తీ నెయ్యి బూచీతో కాలయాపన చేయడంపై వామపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. బాధ్యత గల ప్రజాప్రతినిధులు బూతు పురాణంతో పరస్పర ఆరోపణలు సమాజానికి ఏ సంకేతం ఇస్తున్నాయని నిలదీస్తున్నాయి. కల్తీ నెయ్యి వ్యవహారం అధికార కూటమి పార్టీలకు, ప్రతిపక్ష వైసీపీలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే వ్యవహారంలో వైసీపీ పెద్ద ఎత్తున కూటమి ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రయత్నించగా… ఆ సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత అంబటి కార్యాలయం పైన, ఇంటి పైన దాడులు, నిప్ప్పు అంటించిన సంఘటనలు దుమారం రేపాయి. మరుసటి రోజు మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి పైనా పెట్రోల్ బాంబు విసరడం కలకలం సష్టించింది. దాడులకు గురైన వైసీపీ నేతల ఇళ్లను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించి… ఒక వైపు పరామర్శలకు దిగుతున్నారు. ఇప్పటికే గుంటూరులో అంబటి కుటుంబ సభ్యుల పరామర్శకు జగన్ వెళ్లగా… ఆయన వెంట భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు. శుక్రవారం జోగి రమేశ్ ఇంటికి వెళ్లేందుకు జగన్ షెడ్యూలు ఖరారయింది. గుంటూరు పర్యటన సమయంలో జగన్ లడ్డూలో కల్తీ నెయ్యి లేదంటూ చెబుతూనే, అందుకు సంబంధించిన నివేదికలను వెల్లడిస్తున్నారు. పనిలో పనిగా కూటమి నేతలకు హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కూటమిలోని కీలక నేతలు వైసీపీపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు (టీడీపీ), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (జనసేన), బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఒకే వేదికపై మీడియా సమావేశాలను నిర్వహించి… వైసీపీ తీరును, జగన్ వ్యాఖ్యలను ఎండగట్టారు. దేవుడితో పెట్టుకోవద్దంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.
కూటమిలోని జనసేనకు
అసంతప్తి సెగ
కల్తీ నెయ్యి ఘటనపై కూటమి పార్టీలు ఐక్యంగా ఉన్నామని ఒక వైపు చెప్ప్పుకునే ప్రయత్నం చేస్తుండగా… మరోవైపు జనసేనలో అసంతప్తులు బట్టబయలవుతున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కల్యాణ్ వెన్నంటి ఉండి, పార్టీ గొంతుకగా నిలిచిన బొలిశెట్టి సత్యనారాయణ వంటి సీనియర్ నేత తాత్కాలికంగా రాజీనామా బాట పట్టారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు దక్కడం లేదని, నిర్ణయాధికారాల్లో పాత కాపులకు ప్రాధాన్యత తగ్గడంపై అసహనం వ్యక్తమవుతోంది. కేవలం కొద్ది మందికే ప్రాధాన్యత ఇస్తూ, క్షేత్రస్థాయి నేతలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు పవన్ కల్యాణ్ నాయకత్వంపై విమర్శలకు దారితీస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన జనసేన మహిళా నాయకురాలు, హైకోర్టు అడ్వకేట్ రజని పార్టీకి దూరంగా ఉన్నట్లు ప్రకటించారు. వైసీపీలో కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైన దాడి జరిగిన ఘటన తర్వాత వారిద్దరూ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమయింది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటన, అరెస్టు పర్యవసానంగా కాపు సామాజిక నేతలు ఏకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేనలో ఉన్న కాపు నేతలు కూడా తమ సామాజికవర్గ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై లోలోపల మథనపడుతున్నారు. అయితే అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనతో జనసేనలోని కొందరు కాపు నేతలు స్తబ్దుగా ఉండిపోయారు. టీడీపీ నేతల తరహాగా జనసేన నేతలు వైసీపీపై గట్టి విమర్శలు చేసేందుకు వెనకడుగు వేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా జనసేనలో కీలక నేతగా వ్యవహరిస్తున్న బొలిశెట్టి తన పదవులకు తాత్కాలికంగా రాజీనామా చేయడం సంచలనం కలిగింది. గత కొంత కాలంగా కూటమి పొత్తు ధర్మం పాటించడం లేదంటూ మీడియా వేదికగా అనేక సార్లు ఆయన ఆవేదన వెలిబుచ్చారు. అదే సమయంలో అంబటి ఇంటి పై దాడి ఘటన సమయంలోనే ఆయన రాజీనామా చేయడం చర్చకు దారితీస్తోంది. జనసేన పర్యావరణ విభాగానికి, అనేక అనుబంధ సంఘాలకు ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాటన్నిటికి ఆయన తాత్కాలికంగా రాజీనామాలు చేసినట్లు మీడియాకు ప్రకటించారు. పేరుకు ఇది తాత్కాలిక రాజీనామా అయినప్పటికీ… ఆయనలో తీవ్ర అసంతప్తి ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆధిష్టానం కోరితే తిరిగి పార్టీ బాధ్యతలు చేపడతానని బొలిశెట్టి వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన జనసేన నాయకురాలు, హైకోర్టు న్యాయవాది రజని అంబటి రాంబాబు ఇంటిపై దాడులకు పాల్పడుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించిన తీరును తప్ప్పుపట్టారు. గుంటూరులో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి… అక్కడ కర్రలతో టీడీపీ నేతలు కాపలా కాస్తుంటే… పోలీసులు చోద్యం చూస్తున్నారా? అంటూ దానిపై ఆమె స్థానిక పోలీస్స్టేషన్లో సంబంధిత వీడియో పుటేజీలతో ఫిర్యాదు చేశారు. అనేక మీడియా చర్చల్లోనూ అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన హింసాత్మక దాడిని తప్ప్పుపడుతూ వాదించారు. జనసేన నుంచి ఇలా ఇద్దరు నేతలు కూటమికి వ్యతిరేకంగా మాట్లాడటం ఆ పార్టీ జీర్ణించుకోలేక పోతోంది.
లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందా?, లేదా? అనేదీ చట్టపరంగా తేలుతుంది. ఈ లోగా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కషి చేయాల్సి ఉంది. అదే సమయంలో వాటిని ప్రశ్నించాల్సిన బాధ్యత వైసీపీపై ఉంది.


