. సార్వభౌమత్వానికి ముప్ప్పు తలపెట్టొద్దు
. ఒతిళ్లకు తలొగ్గి రాయితీలిచ్చి జీవనోపాధి దెబ్బతీయొద్దు
. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సీపీఐ ఆగ్రహం
న్యూదిల్లీ: అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం దేశ సార్వభౌమత్వానికి, రైతాంగానికి ముప్ప్పు కలిగిస్తుందని సీపీఐ హెచ్చరించింది. పారదర్శకత`సమానత్వం లేకుండా సర్దుకుపోవాలనేలా భారతీయ సాగుదారులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ… అమెరికాకు ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు కల్పించేలా ఈ ఒప్పందమున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గం ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. మార్కెట్ విస్తరణ ప్రగల్భాల వెనుక దేశ వాణిజ్య, ఆర్థిక విధానాన్ని నీరుగార్చే చేదు నిజం దాగివుందని వ్యాఖ్యానించింది. ఏయే షరతులతో ఒప్పందం చేసుకున్నారో ప్రజలకు, పార్లమెంటుకు చెప్పాలని డిమాండ్ చేసింది. విదేశాల ప్రయోజనాల కోసం దేశ రైతాంగాన్ని అగాధంలోకి నెట్టవద్దని, బాహ్య ఒత్తిళ్లకు తలొగ్గి… మినహాయింపులు ఇచ్చి రైతుల జీవనోపాధికి హాని తలపెట్టవద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల కలిగే నష్టాల దష్ట్యా ఆ దేశ ప్రయోజనాలకు తీసుకున్న నిర్ణయాలన్నీ మార్చుకోవాలని కోరింది. భారతీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాల తగ్గింపును గొప్ప ప్రయోజనంగా చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది. ఈ మినహాయింపులు పరిమితం… షరుతలభరితమని సీపీఐ స్పష్టంచేసింది. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు మించి దిగుమతులకు భారత్ కట్టుబడేలా దొడ్డిదారుల్లో వెళితే… పారదర్శకతకు, ప్రజాస్వామిక నిఘాకు, ఆర్థిక సార్వభౌమత్వానికి హాని తప్పదని హెచ్చరించింది. ఈ ఒప్పందం భారతీయ రైతులు, వ్యవసాయ కార్మికులపైనే అధిక ప్రభావం చూపుతుందని పేర్కొంది. అమెరికా వ్యవసాయ వాణిజ్యపరమైన భారీ సబ్సిడీలతో పోటీ మీద భారతదేశ వ్యవసాయ రంగం ఆధారపడదని… సుంకాలు, ఆంక్షలు, ప్రొక్యూర్‌మెంట్ యంత్రాంగాలతో గ్రామీణ జీవనోపాధికి లభించే భద్రతే దీనికి ఆధారపమని సీపీఐ స్పష్టం చేసింది. ఈ భద్రత కోల్పోతే సుంకాల్లో కోతలు, టారిఫ్ కోటాలు లేదా భవిష్యత్ సర్దుబాట్లు లక్షల మంది రైతుల ప్రయోజనాలను కాపాడలేవని హెచ్చరించింది. అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), ఎంఎస్‌పీకి చట్టబద్ధత, సరసరమైన ధరలకు సముచితంగా ఎరువుల సరఫరా, ఇతర అవసరాల కోసం దేశ రైతాంగం డిమాండ్ చేస్తుంటే ఇలాంటి ఒప్పందం చేసుకోవడం ద్వారా వ్యవసాయ సంక్షోభం మరింత తీవ్రమవుతుందని పేర్కొంది. అమెరికా వ్యవసాయోత్పత్తులకు, ఆహార ఉత్పత్తులకు పరిమిత మార్కెట్ కల్పించినాగానీ దేశీయంగా ధరాఘాతం… స్థానిక విపణులు డీలా పడటం, సంక్షోభం మరింత తీవ్రమవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని వెల్లడించింది. వ్యవసాయ రంగానికి, పాడి పరిశ్రమకు సంపూర్ణ మద్దతు అంటూ ఇచ్చిన అనేక హామీలు ఒట్టి మాటలుగా మారిందని… బాహ్య ఒత్తిళ్లకు యంత్రాంగం తలొగ్గిందని సీపీఐ వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందం క్రమంలో భారత్‌లో వ్యవసాయాధారిత వాణిజ్యం, కోఆపరేటివ్‌లు, ఆహార శుద్ధీకరణ పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమవుతాయని పేర్కొంది. ఈ ఒప్పందం భౌగోళికరాజకీయ లక్షణం కూడా ఆందోళన కలిగిస్తోందని, ముడి చమురు దిగుమతులు సైతం ప్రభావితం కాగలవని సీపీఐ వెల్లడించింది. వాషింగ్టన్ వ్యూహాత్మక అజెండాకు అనుకూలంగా ఆర్థికవిదేశాంగ విధానపరమైన నిర్ణయాలు తీసుకునేలా అమెరికా యంత్రాంగం భారత్ చెయ్యి మెలిపెడుతోందని సీపీఐ వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితి భారత్ వ్యూహాత్మక స్వావలంబన, సహకార సంప్రదాయానికి తూట్లు పొడుస్తూ... బలవంతపు ఆధారం (కోయర్సివ్ డిపెండెన్సీ) మూలంగా తీసుకునే స్వతంత్ర నిర్ణయాల పద్ధతికి దారితీస్తుందని హెచ్చరించింది. కార్మికులు, కర్షకులు, సాగుదారుల ప్రయోజనాలకు అనుగుణంగా వాణిజ్య ఒప్పందం ఉండాలేగానీ అధికారపరమైన ఒత్తిడికి అస్త్రంగా కాదని సీపీఐ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం వివరాలన్నీ పార్లమెంటుకు తెలపాలని సీపీఐ డిమాండ్ చేసింది. రైతుల జీవనోపాధికి ముప్ప్పు తలపెట్టే అన్ని రకాల మినహాయింపులు ఉపసంహరించుకోవాలని, దేశ సార్వభౌమత్వంతో రాజీ పడేందుకు బలవంతపెట్టే అనేక రకాల ఆర్థికభౌగోళిక రాయకీయ చర్యలను తిరస్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది.


