Home‘కల్తీ’కోరులను వదిలిపెట్టం

‘కల్తీ’కోరులను వదిలిపెట్టం

- Advertisement -

. లడ్డూ కల్తీపై ఏకసభ్య కమిషన్
. ప్రజల దృష్టి మరల్చేందుకే మాపై దుష్ప్రచారం
. దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు
. తిరుమలకు పూర్వ వైభవం తెస్తాం: సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర – సచివాలయం: ప్రజల మనోభావాలతో ఆడుకున్న నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన కల్తీ వ్యవహారంపై గురువారం ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్డీయే కూటమి నేతల భేటీ జరిగింది. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ … గత పాలనలో లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు, పామాయిల్, లాక్టిక్ యాసిడ్ వంటి రసాయనాలు కలిపిన కల్తీ నెయ్యి వాడటం క్షమించరాని మహాపాపమని పేర్కొన్నారు. ఎన్డీడీబీ నివేదిక ద్వారా ఈ భయంకరమైన నిజాలు వెలుగు చూశాయని తెలిపారు. 2022లోనే సీఎఫ్‌టీఆరఐ కల్తీ జరుగుతోందని హెచ్చరించినా, గత ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టి యథేచ్ఛగా అపచారానికి పాల్పడిందని మండిపడ్డారు. తిరుమల నిబంధనల ప్రకారం అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండగా, అప్పటి సీఎం జగన్ అహంకారంతో సంతకం చేయకుండా హిందూ సంప్రదాయాలను అవమానించారని గుర్తుచేశారు. అబ్దుల్ కలాం వంటి గొప్ప వ్యక్తులే నిబంధనలను పాటించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో కేవలం లడ్డూ ప్రసాదం మాత్రమే కాకుండా, అంతర్వేది రథం దహనం, రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం… సుమారు 219 ఆలయాలపై దాడులు జరిగాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల నమ్మకంపై దాడి చేయడమే లక్ష్యంగా గత పాలకులు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీపై సిట్ నివేదిక పక్కా ఆధారాలతో ఉందని, నిందితులను కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. టీటీడీ కొనుగోళ్ల కమిటీకి, అప్పటి చైర్మన్‌కు తెలిసే ఈ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. గత చైర్మన్ పీఏకు రూ. నాలుగు కోట్లు లంచం ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయని సీఎం వెల్లడించారు. తప్ప్పు చేసిన వ్యక్తులు తప్ప్పును ఒప్ప్పుకోకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎదురుదాడి చేస్తున్నారని, ఇలాంటి రౌడీయిజం సాగదని హెచ్చరించారు. వేంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మ ఇచ్చారని, ఆ స్వామి పవిత్రతను కాపాడటం నా బాధ్యతని అన్నారు. ఇది రాజకీయ అంశం కాదు, కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. జరిగిన తప్ప్పును సరిదిద్ది, తిరుమలకు పూర్వ వైభవం తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై పీఠాధిపతులు, మత పెద్దలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని, తిరుమల పవిత్రతను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యతని చెప్పారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదికలోని అంశాలను, సీబీఐ సూచనలను అధ్యయనం చేసేందుకు ఈ కమిషన్‌ను నియమించామన్నారు. అన్ని నివేదికలను కమిషన్ ముందు ఉంచి వాస్తవాలను వెలికితీస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అపచారాలు జరగకుండా నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రజల దష్టి మరల్చేందుకే మాపై దుష్ప్రచారానికి ఒడిగట్టారని మండిపడ్డారు.
వైసీపీకి సిట్ క్లీన్‌చిట్
ఇవ్వలేదు: పవన్ కల్యాణ్
సిట్ రిపోర్టులో జంతువుల కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా ఉందని ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీకి ఎక్కడా క్లీన్‌చిట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. తప్ప్పు చేసిన వాళ్లు దేవుడి ముందు మోకరిల్లి క్షమాపణ చెప్పే వరకు ఈ పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో దేవాలయాలపై జరిగిన వరుస దాడులను రాజకీయం చేయకూడదనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లు నిగ్రహంగా ఉన్నామని, కానీ భక్తుల మనోభావాలతో ఆడుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఒక నిర్దిష్ట కంపెనీ వివరాలను పవన్ బయటపెట్టారు. ‘టీటీడీకి సదరు కంపెనీ 59.70 లక్షల కిలోల నెయ్యి పంపినట్లు రికార్డుల్లో ఉంది. కానీ, అదే సమయంలో ఆ కంపెనీ 58 లక్షల కిలోల పామాయిల్, దాదాపు రెండు లక్షల కిలోల రసాయనాలను కొనుగోలు చేసినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి. నెయ్యి పేరుతో భక్తులకు కల్తీ పామాయిల్, వనస్పతిని తినిపించి వారి ఆరోగ్యం, మనోభావాలతో ఆడుకున్నారు’ అని ఆయన ధ్వజమెత్తారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఇక్కడి నుంచి పంపిన లక్ష లడ్డూల్లో కూడా ఇదే కల్తీ నెయ్యి వాడారని పవన్ ఆరోపించారు.
‘కల్తీ’ మనస్తత్వమే లడ్డూ అపవిత్రతకు కారణం: పీవీఎన్ మాధవ్
గత ప్రభుత్వం తన కల్తీ మనస్తత్వంతో తిరుమల పవిత్రతను దెబ్బతీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. నెయ్యి కాని నెయ్యితో లడ్డూలు తయారు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు. కనీసం పాల సేకరణ కూడా చేయలేని డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారని, పవిత్రమైన నెయ్యికి బదులు సింథటిక్ నెయ్యిని వాడటం అత్యంత దారుణమని మండిపడ్డారు. స్వామి వారి నిధులను దుర్వినియోగం చేసినందుకు గత పాలకులు భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్యమతస్థుల ప్రాబల్యం పెంచే దిశగా గత ప్రభుత్వం అడుగులు వేసిందని, వరుసగా ఆలయాలు పవిత్ర విగ్రహాలపై దాడులు జరగడం అందులో భాగమేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం గత అవినీతిని ప్రక్షాళన చేస్తోందని మాధవ్ పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని కాపాడుతూ, దేవాలయాల పవిత్రతకు భంగం కలగకుండా హిందూ మనోభావాలను గౌరవిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో సుపరిపాలనే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.
తిరుమలపై వైసీపీ కుట్ర: పయ్యావుల
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై సిట్ విచారణలో తేలిన నగ్న సత్యాలను మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్టులో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో చేప నూనె , పామాయిల్ వంటి ఇతర కొవ్వులు కలిసినట్లు నిర్ధారణ అయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా శ్యామలరావుని ఈఓగా నియమించి, ప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నెయ్యి కొనుగోలుకు కఠినమైన నిబంధనలు ఉండేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కావాలనే నిబంధనలను సరళీకృతం చేసి, నాణ్యత లేని సంస్థలకు తలుపులు తెరిచారన్నారు. “పాలు లేకుండా నెయ్యి చేసే” దారుణ విధానానికి వారు మార్గం సుగమం చేశారని పేర్కొన్నారు. సిట్ విచారణలో టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న, బోలే బాబా అనే వ్యక్తులతో కలిసి ఈ అపచారానికి ఒడిగట్టినట్లు తేలిందని స్పష్టం చేశారు. కల్తీకి బాధ్యులైన అధికారులు, బోర్డు సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొందన్నారు. మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్, ఆనం రామ నారాయణ రెడ్డి, పార్థసారథి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు