నంబూరి చంద్రశేఖర్
నైతికత అనే సన్నని గీతను చెరిపేసినప్ప్పుడు, మనిషి నిర్మించుకునే సామ్రాజ్యాలు కేవలం బాహ్య ప్రపంచానికి కాంతిమంతంగా కనిపిస్తాయి. కానీ, లోపల కుళ్లిపోయిన శవాల వాసన వస్తూనే ఉంటుంది. జెఫ్రీ ఎప్స్టీన్ కథ ఒక నేరగాడి చరిత్ర కాదు, అది మానవ నైతికత పతనానికి పరాకాష్ట. సమాజంలో అత్యున్నత శిఖరాల్లో ఉన్నామని చెప్పుకునే మేధావులు, రాజకీయవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు ఒక వ్యక్తి పంచన చేరి తమ విచక్షణను ఎలా తాకట్టు పెట్టారో చూస్తుంటే, అసలు నాగరికత అంటే ఏమిటి అనే ప్రాథమిక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ చీకటి అగాధంలోకి మనం ఎంత లోతుగా వెళ్తే, అంతటి భయంకరమైన సత్యాలు మనల్ని వెక్కిరిస్తాయి.
జెఫ్రీ ఎప్స్టీన్ : ఈ పేరు ఆధునిక ప్రపంచ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. కేవలం ఒక వ్యక్తి చేసిన నేరాల గురించి మాత్రమే కాకుండా, అధికారం, సంపద ఏ విధంగా వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తాయో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఎప్స్టీన్ మరణించినా, అతను వదిలివెళ్లిన ఆ ‘బ్లాక్ బుక’ ఇప్ప్పుడు ప్రపంచ దేశాలనే కాకుండా, భారతీయ రాజకీయ, కార్పొరేట్ శక్తులను కూడా హెచ్చరిస్తోంది. జీవితం అనేది ఒక పారదర్శకమైన నదిలా ఉండాలి, కానీ ఎప్స్టీన్ విషయంలో అది ఒక విషపూరితమైన సరస్సు. డిగ్రీ లేకపోయినా మేధావిగా చలామణి అవ్వడం, కాలేజీ డ్రాపౌట్ అయినా ఎలైట్ స్కూల్స్‌లో టీచర్‌గా చేరడం… ఇదంతా ఒక పెద్ద మాయాజాలం. మన దగ్గర కూడా ఇలాంటి ‘మేధావులు’ ఎందరో కార్పొరేట్ ముసుగులో తిరుగుతున్నారు. కేవలం తెలివితేటలతో కాకుండా, అబద్ధాలతో నిర్మించుకున్న సామ్రాజ్యాలు ఎప్ప్పుడైనా కూలిపోవాల్సిందే. ఎప్స్టీన్ ఎదుగుదల వెనుక ఉన్న ఆ ‘అదృశ్య హస్తాలు’ ఎవరివి ? సంపన్నులకు ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా మారి, వారి బలహీనతలను తన బలంగా మార్చుకున్న వైనం నేటి కార్పొరేట్ గూఢచారి వ్యవస్థకు అద్దం పడుతోంది.
లోలిత ఎక్స్‌ప్రెస్ ఒక విలాసవంతమైన వికృతం : (జెఫ్రీ ఎప్స్టీన్ యాజమాన్యంలోని ఒక ప్రైవేట్ విమానం, ఇది అతని ఉన్నత స్థాయి స్నేహితులను అతని ప్రైవేట్ ద్వీపానికి తరలించడానికి ఉపయోగిస్తారు.) వందల కోట్ల ఆస్తి, ప్రైవేట్ ద్వీపాలు, సొంత విమానాలు… ఇవి చూడటానికి వైభవంలా అనిపించవచ్చు కానీ, ఆ విమానంలో ప్రయాణించిన వారు చేసిన పాపాలు ఇప్ప్పుడు ప్రపంచం ముందు నిలబడుతున్నాయి. వెయ్యి మందికి పైగా మైనర్ బాలికలను ట్రాఫికింగ్ చేయడం అంటే అది కేవలం ఒక నేరం కాదు, మానవత్వానికే తీరని అవమానం. గిస్లైన్ మాక్స్ వెల్ వంటి సహచరులతో కలిసి ఒక పిరమిడ్ తరహాలో యువతులను వేటాడటం చూస్తుంటే, అధికారం చేతిలో ఉంటే మనిషి ఎంతటి నీచానికైనా దిగజారుతాడని అర్థమవుతుంది. మన దేశంలోని కార్పొరేట్ పార్టీల్లో, రిసార్ట్ పాలిటిక్స్‌లో ఇలాంటి ‘చీకటి విలాసాలు’ ఏ మేరకు ఉన్నాయో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్ వంటి అగ్రరాజ్య దిగ్గజాలే కాకుండా, ఇప్ప్పుడు బయటపడుతున్న ‘ఎప్స్టీన్ ఫైల్స’ లో భారతీయ పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అనిల్ అంబానీ వంటి కార్పొరేట్ వ్యక్తులు, జారెడ్ కుష్నర్ , స్టీవ్ బానన్ వంటి వారితో పరిచయాల కోసం ఎప్స్టీన్ సాయం కోరినట్లు వస్తున్న నివేదికలు సంచలనం సృష్టిస్తున్నాయి. భారతీయ నాయకత్వానికి అమెరికన్ అడ్మినిస్ట్రేషన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగించడంలో ఎప్స్టీన్ ఒక ‘వారధి’గా పనిచేశాడా ? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
వ్యాపార లావాదేవీల ముసుగులో ఇలాంటి నేరగాళ్లతో చేతులు కలపడం వల్ల దేశ ప్రతిష్ట ఎంత దిగజారుతుందో మన నేతలు గుర్తించాలి.భారతీయ సంతతికి చెందిన ప్రముఖ హోటల్ యజమాని విక్రమ్ చత్వాల్ పేరు, ముంబైకి చెందిన ఒక ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ షెల్లీ కపూర్ పేరు కూడా ఎప్స్టీన్ కాంటాక్ట్ బుక్‌లో ఉన్నట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించాయి.2000 వ దశకంలో జరిగిన కొన్ని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సమావేశాల్లో అనిల్ అంబానీ పేరు ఎప్స్టీన్ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, ఎప్స్టీన్ నడిపిన చీకటి వ్యాపారంతో ఆయనకు నేరుగా సంబంధం ఉన్నట్లు ఎక్కడా బలమైన ఆధారాలు కోర్టుకు సమర్పించలేదు. కేవలం వ్యాపార ప్రపంచంలో ఒకరికొకరు తెలిసి ఉండవచ్చు అనే కోణంలోనే ఈ ప్రస్తావనలు ఉన్నాయి. అమెరికాలో స్థిరపడిన మరికొంతమంది భారతీయ సంతతికి చెందిన వైద్యులు, శాస్త్రవేత్తలు, కొందరు ప్రొఫెసర్ల పేర్లు ఎప్స్టీన్ విరాళాల జాబితాలో ఉన్నాయి. ఎప్స్టీన్ తన ప్రతిష్ఠను పెంచుకోవడానికి వివిధ విశ్వవిద్యాలయాలకు, పరిశోధనలకు నిధులు ఇచ్చేవాడు.
ఈ క్రమంలోనే కొందరు భారతీయ మేధావులతో అతనికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక అతని నేరాలకు 2008లో ఎప్స్టీన్కు లభించిన శిక్ష కేవలం 13 నెలలు మాత్రమే. అది కూడా జైలు కంటే బయట ఆఫీసులో గడిపే వెసులుబాటుతో ఇలాంటి ‘లీనియంట్ డీల్స’ వ్యవస్థలోని లొసుగులను వాడుకుని పెద్దలు ఎలా తప్పించుకుంటారో చెప్తాయి. న్యాయం అనేది కేవలం పేదవాడికి శిక్షలు వేయడానికేనా? సంపన్నులకు అది ఒక సర్దుబాటు మాత్రమేనా? అనే ప్రశ్నకు ఇప్ప్పుడు సమాధానం దొరకాలి.ఎప్స్టీన్ కేసులో అలెగ్జాండర్ అకోస్టా వంటి వారు చేసిన సహకారం చూస్తుంటే, అధికారం ఉన్న చోట నీతి నిలబడదు అనడానికి ఇది నిదర్శనం. భారతీయ రాజకీయాల్లో కూడా ఇలాంటి విచారణలు ఎన్నో మధ్యలోనే ఆగిపోయిన చరిత్రలు మనకు తెలుసు. 2019లో ఎప్స్టీన్ జైలు గదిలో ఉరివేసుకుని చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు. కెమెరాలు పని చేయకపోవడం, గార్డులు నిద్రపోవడం…ఇవన్నీ యాదృచ్ఛికమా లేక ఒక పెద్ద గూడుపుఠాణీనా? “ఎప్స్టీన్ తనను తాను చంపుకోలేదు” అనే నినాదం సోషల్ మీడియాలో ఎందుకు అంత వైరల్ అయ్యింది? అతను బతికి ఉంటే ఎందరో ప్రముఖుల జాతకాలు బయటపడేవి. సత్యాన్ని గొంతు నొక్కడానికి అధికారం ఏ స్థాయికైనా వెళ్తుంది. మన దగ్గర కూడా కీలకమైన సాక్షులు అనుమానాస్పదంగా మరణించడం సర్వసాధారణం అయిపోయింది. నేటి కార్పొరేట్ ,రాజకీయ దిగ్గజాలకు ఎప్స్టీన్ ఫైల్స్ ఒక హెచ్చరిక. బాధితుల కన్నీళ్లతో కట్టుకున్న సామ్రాజ్యాలు ఎంతో కాలం నిలబడవు. ఇటీవల విడుదలైన ఈ ఫైల్స్ రేపు భారతదేశంలోని మూలాలను కూడా కదిలించవచ్చు. కాలం అనే మహా ప్రవాహంలో సంపద, హోదా, అధికారం అన్నీ కేవలం నీటి బుడగలు మాత్రమే. ఆఖరికి మిగిలేది మనం వదిలివెళ్లే నైతిక ముద్ర మాత్రమే. ఎప్స్టీన్ చరిత్ర నుంచి చాలా నేర్చుకోవాలి. సత్యం ఎప్ప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది, కానీ అది మాట్లాడటం మొదలుపెడితే ఎంతటి సింహాసనాలైనా మట్టిలో కలవక తప్పదు.


