వినీత్ తివారి
ఇజ్రాయెల్ పలస్తీనియన్ల పరిస్థితి ఎలా ఉంటుందో నేను కళ్లారా చూసిన, విన్న మాటలను ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. వాస్తవాలను అన్వేషించే ఒక బృందంతో కలిసి హింస, మత ఘర్షణలు, నర్మదా బచావో ఆందోళన, గిరిజన సంస్థల ఉద్యమాలు జరిగిన ప్రాంతాలకు వెళ్లాను. పలస్తీనా ప్రయాణం పెద్ద సవాలే. మొదట భయపడ్డాను. అక్కడ మన శరీరాన్ని, మెదడుని స్కాన్ చేసేంత పెద్దపెద్ద సిసి టీవీ కెమెరాలుంటాయి. ఇజ్రాయిల్ తన ఆయుధ శక్తితో న్యాయాన్ని బంధించగల దేశం. సాయుధ సైనికులు ప్రతి మలుపులోనూ కనిపిస్తారు. ఇజ్రాయెల్‌లో 75 సంవత్సరాలకు పైగా జాతి హింసను వ్యాప్తి చేస్తున్న విషయం తెలిసిందే. పది రోజుల పాటు, పలస్తీనాకు మద్దతు ప్రకటించినందుకు నన్ను ఎప్ప్పుడైనా అరెస్ట్ చేయొచ్చన్న భయం వెంటాడుతూనే ఉంది. గాజాపై చేసినట్టే ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్‌పై కూడా దాడి చేస్తుందేమో, నా మీద కానీ నా దగ్గర కానీ బాంబు పడుతుందేమో అన్న భయంతో నిద్ర లేకుండా బతికాను. గాజాలో కొన్ని లక్షల మంది నిరపరాధ ప్రజలు ఆకలితో, గాయాలతో, మరణ భయంతో అల్లాడ్డం నన్ను కలిచివేసింది. ఇజ్రాయెల్ ఏర్పడక ముందు, క్రైస్తవులు, ముస్లింలు, యూదులు పలస్తీనాలో కలిసి ఉండేవారు. వారందరినీ అరబ్బులుగా పిలిచేవారు. క్రమంగా, రాజకీయ కారణాల వల్ల, ఆయా మత అనుయాయుల వలన చీలికలు రావడం మొదలయ్యాయి. ఫలితంగా వందేళ్లల్లో పలస్తీనా జనాభా అలంకారప్రాయంగా మారిపోయింది. 1950 లలో, క్రైస్తవులు మొత్తం పలస్తీనా జనాభాలో 11% ఉన్నారు. నేడు కేవలం 1% కి పడిపోయింది. బెత్లెహెంలో,1950 లో క్రైస్తవులు జనాభాలో 86% ఉన్నారు. నేడు, వారి సంఖ్య 8% కి పడిపోయింది. గాజాలో, క్రైస్తవ జనాభా వెయ్యి కంటే తక్కువే. 2007 లో ఐదు వేల మంది ఉన్నారు. ఒకప్ప్పుడు పలస్తీనాలో మెజారిటీగా ఉన్న అరబ్ ముస్లింలను అణగదొక్కుతూ మైనారిటీలుగా మార్చేశారు. ఇప్పుడు గాజాలో 20లక్షలు, వెస్ట్‌బ్యాంక్‌లో 30లక్షలు ఉన్నారు. అదే సమయంలో యూదుల జనాభా పెరిగింది. 1948 లో, పలస్తీనాలో 6-7 లక్షల మంది యూదులు ఉన్నారు. దీనిని వారు ఇజ్రాయెల్ అని పిలిచేవారు. ప్రస్తుతం, ఇజ్రాయెల్‌లో జనాభా 75 లక్షలుగా తేలింది. మొదటి ప్రపంచం యుద్ధం ముగిశాక కూడా బ్రిటిష్ పాలకులు పలస్తీనా మీద పగ సాధిస్తూనే ఉన్నారు . ఈ వివాదం ఐక్యరాజ్యసమితికి వెళ్లింది.దాంతో యూదులు, పలస్తీనియన్ల మధ్య భూమిని విభజించారు. ఆ విభజనలో యూదుల జనాభా 10% కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్‌ను స్థాపించడానికి పలస్తీనా భూమిలో 55% కంటే ఎక్కువ భూమిని ఇచ్చేశారు. దీన్ని నిరసిస్తూ, పలస్తీనీయులు, ఇతర అరబ్ దేశాలు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో, బ్రిటన్, ఇతర పశ్చిమదేశాల సహాయంతో, ఇజ్రాయెల్ విజయం సాధించి, పలస్తీనాలో 55% కంటే ఎక్కువ భూమిని ఆక్రమించింది. అప్పటి నుంచి, పశ్చిమాసియా దేశాలలో తమ రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇజ్రాయెల్ అమెరికా, యూరప్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. యాసర్ అరాఫత్, యిట్జాక్ రాబిన్ ప్రయత్నాల ద్వారా సాధించిన ఓస్లో ఒప్పందాలు ఉన్నప్పటికీ, యూదులు ఎప్ప్పుడూ అంగీకరించలేదు. వారు హింస ద్వారా పలస్తీనియన్లు తమ ఇళ్లు, పొలాలు, ఆస్తులను విడిచిపెట్టమని బలవంతం చేస్తూనే ఉన్నారు. చివరికి, రాబిన్ చేసి శాంతి ప్రయత్నాలను భరించలేక ఒక యూదుడు రాబిన్‌ను హత్య చేశాడు. అమెరికా మద్దతుతో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవకాశవాద యూదులు, ఇతర మతాల ప్రజలను పలస్తీనా భూభాగంలోకి వచ్చేశారు. ఈ సెటిలర్స్ కారణంగా పలస్తీనియన్లు సొంత భూమి మీద హక్కును కోల్పోయారు. పలస్తీనీయుల నుంచి కేవలం భూమి వారి ఆత్మగౌరవాన్నీ దోచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పలస్తీనా ఆలివ్ తోటలు, సున్నపురాయి వనరులు, భూగర్భ జలవనరులను దూరం చేశారు. ఇజ్రాయెల్‌లోని పలస్తీనియన్ల స్వేచ్ఛను పరిమితం చేసేశారు. బెత్లెహెం నుంచి జెరూసలేంకు కేవలం పది కిలోమీటర్లు ప్రయాణించాలంటే అనేక చెక్‌పోస్టులను దాటి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అడుగడుగునా, భద్రతా కేంద్రాల వద్ద ఇజ్రాయెలీ సైనికుల అవమానకరమైన ప్రవర్తన దారుణంగా ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం పలస్తీనియన్ల కోసం ప్రత్యేక రోడ్లను నిర్మించింది. వారి వాహనాల నంబర్ ప్లేట్లు వేరుగా ఉంటాయి. ఒకే నగరంలో ఉన్నా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికీ పరిమితులు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఎనిమిది మీటర్ల ఎత్తైన గోడలు ఉంటాయి. ప్రతీ ప్రాంతం డ్రోన్ల పర్యవేక్షణలో ఉంటుంది. ఇజ్రాయెలీయుల కోసం కేటాయించిన రహదారులను పలస్తీనీయులు ఉపయోగించడం నిషేధం. ఇజ్రాయెలీయులు పలస్తీనీయులను హత్య చేసినా శిక్షలేÉవీ ఉండవు. సొంతింట్లో అదనంగా ఒక గది నిర్మించుకోవాలన్నా, ఏదైనా మరమ్మతులు చేయించుకోవాలన్నా నేరమే. పొరపాటున ఇజ్రాయెలీ కెమెరాకు చిక్కితే ఆ కుటుంబాన్ని జైల్లో పెడతారు. స్థానిక రైతులు చెప్పిన దాని ప్రకారం ఇజ్రాయెలీ సెట్లర్లు వారి ఆలివ్ పంటలను దోచుకున్నా ఏమీ అనకూడదు. ఈ సెట్లర్ల కోసమే ఇజ్రాయెలీ రక్షణ దళాలు (ఐడిఎఫ్) ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రజలు ఐడిఎఫ్ని వ్యంగ్యంగా “ఇజ్రాయెలీ దాడి దళం”(ఐఓఎఫ్) అని పిలుస్తారు. ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థ పక్షపాతంతో పనిచేస్తుంది. పలస్తీనీయుల దగ్గర అత్యధిక పన్నులు వసూలు చేసి ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఆ పన్నులతో విదేశాల నుంచి వచ్చే యూదులకు సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది. ఈ అమానుష సిద్ధాంతం ఎంత భయంకరమో “వాలీ ఆఫ్ ఫైర” ప్రాంతంలో కనబడింది. ఇజ్రాయెల్ నివాస ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని పలస్తీనా భూభాగంలోకి వదిలే దృశ్యాన్ని చూశాను.
బెడౌయిన్ ప్రజలు : జోర్డాన్ లోయలో బెడౌయిన్గా పిలిచేû అరబ్ ఎడారి గొర్రెల కాపరులు, సంచార గిరిజన తెగల వారు నివసిస్తుంటారు. ప్రపంచంలోనే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఒకటి జోర్డాన్ లోయ. వేల ఏళ్లుగా ఇక్కడ ఉంటున్న బెడౌయిన్ ప్రజలు తమ అనుభవంతో భూగర్భ జల వనరులు దొరికే చోటు వెతుక్కుని జీవిస్తుంటారు. ఇజ్రాయెల్ ఈ నీటి వనరులను స్వాధీనం చేసుకుంది. నీటిని తీసేందుకు పైప్లైన్లు ఏర్పాటుచేసి ఇజ్రాయెలీ సెట్లర్లు, తెల్ అవీవ్ వంటి నగరాలకు సరఫరా చేస్తోంది. ఆ నీటి పంపులు, బావుల చుట్టూ ముళ్ల కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. స్థానిక వ్యక్తులు ఒక్క చుక్క నీరు తీసుకున్నా నేరస్తులే అంటూ స్పష్టం చేసింది. నేను గాజాను సందర్శించలేకపోయినప్పటికీ, వెస్ట్ బ్యాంక్‌లోని ప్రజల దగ్గరకెళ్లి గాజా గురించి మాట్లాడినప్ప్పుడు ఒక విషయం తెలిసింది. గాజాలో ఒక్కసారిగా విధ్వంసం సష్టిస్తే వెస్ట్ బ్యాంక్‌లో విడతలవారీగా అమలు చేస్తోంది.గాజాలో ఇప్పటివరకు లక్షమంది పలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. బాంబు దాడులకు తొంభై శాతం భవనాలు కుప్పకూలాయి. మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఔషధాలు, శానిటరీ ప్యాడ్లు, తాగునీరు, ఆహారం అన్నింటికీ కొరత ఏర్పడింది. గాజాలో ఉండే ప్రజలు వెస్ట్‌బ్యాంక్‌లో ఉన్నవారి బంధువులే. తమ దేశస్తులూ, బంధువులూ ఎదుర్కొంటున్న దుస్థితిని చూసి వారు బాధపడుతున్నారు కానీ ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉండిపోతున్నారు. ఎటు చూసినా ప్రమాదంలో ఉన్నది పలస్తీనీయులే. పలస్తీనా అథారిటీ (పిఏ) బెత్లెహెం, వెస్ట్‌బ్యాంక్ మీద అధికారం చెలాయిస్తుంటే, హమాస్ గాజాను పాలిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హమాస్‌ను తప్ప్పు పట్టేవారు ఎవరూ లేరు. స్థానిక పలస్తీనీయులు ఒకటే మాట చెబుతున్నారు 2023 అక్టోబర్ 7 న హమాస్ ఇజ్రాయెల్‌పై చేసిన దాడి న్యాయ సమ్మతమే అంటున్నారు. జెనిన్ శరణార్థి శిబిరానికి ఒకరోజు సాయంత్రం వెళ్లాను. 2023 జనవరిలో ఒక్క రాత్రిలో వేలాది ఇళ్లను, పాఠశాలలను నాశనం చేశారు. దాంతో ఐదారు మంది కలిసి ఒక్క గదిలోనే నివసిస్తున్నారు. ఇక మగవాళ్ల కోపానికి స్త్రీలు, పిల్లలు బలైపోతున్నారు. ఆర్మేనియా గ్రామంలో, సెట్లర్లు, ఇజ్రాయెలీ సైనికులు పాఠశాలను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన మాస్టర్‌ను భుజం విరిగేలా కొట్టారు. వారి అరబ్బీ భాష అర్ధంకాకపోయినా వారి కోపం, అవమానం నన్ను కలిచివేసింది. ఇజ్రాయెల్ ప్రభుత్వ అమానవీయ వైఖరిని ఇజ్రాయెల్ పౌరులు కూడా సమర్ధించడం లేదు. పలస్తీనా పౌరుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నారు. వారిలో ఆండ్రీ, ఇజ్రాయెల్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలు ఐడా టౌమా-సులేమాన్, ఇజ్రాయెల్ పౌరురాలు ఏంజెలా గోల్డ్‌స్టెయిన్ వంటి రష్యన్ మూలాలకు చెందిన యువ ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. పలస్తీనా కోసం కైరోస్కు చెందిన రిఫత్ కాసిస్, మజ్నాస్ర్ వంటి వ్యక్తులు ఉన్నారు. వారు సంవత్సరాల తరబడి జైళ్లల్లో గడిపారు. బెత్లెహెం విశ్వవిద్యాలయంలో పలస్తీనియన్ విద్యార్థులను కలిశాను. అక్కడ ఘస్సన్ కానఫానీ, మహ్మద్ దార్వీష్ వంటి రచయితల చిత్రపటాలు చూశాను.
స్వేచ్ఛాయుత పలస్తీనాకే మద్దతు : దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష నుంచి విముక్తి పొందినట్లే, పలస్తీనా కూడా విముక్తి పొందాలి. నా ఈ ప్రయాణానికి అర్ధం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్ప్పుడు నేను గతంలో కంటే ఎక్కువ ధైర్యంగా ఉన్నట్లు అనిపిస్తోంది. పలస్తీనా ప్రజలకు నా మద్దతు ఎప్ప్పుడూ ఉంటుంది. కానీ నేను అక్కడికి వెళ్లాక, పలస్తీనా కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి, విదేశాల నుంచి పోరాటాన్ని కొనసాగిస్తున్న ధైర్యవంతులైన వ్యక్తులను కలిశాను. అలాంటి వ్యక్తులను కలవడం యాసర్ అరాఫత్, మహాత్మాగాంధీ, భగత్ సింగ్, చేగువేరా, ఘస్సన్ కనాఫానీని కలవడం లాంటిదే. పలస్తీనాలో జరుగుతున్న విషయాలను, నిజాలను ప్రజలకు తెలియజేసి, న్యాయం కోసం వారి వారు చేస్తున్న పోరాటంలో నేను ఒక భాగస్వామిని ఐతే ఈ ప్రయాణం విజయవంతమవుతుంది.


