డా॥ఓ.నరసింహారావు
వ్యవసాయానికి వెన్నెముక రైతు అయితే రైతుకు వెన్నెముక పశు సంపద. అట్టి పశుసంపద మనందరి సంపద. పరిశ్రమలు అభివద్ధి జరగాలంటే విద్యుత్ ఎంత అవసరమో, గ్రామీణాభివద్ధి జరగాలంటే పశు సంపద అభివద్ధి అంతే అవసరం. ఈ సందర్భంగా రాష్ట్ర పశు గణాంకాలను పరిశీలిస్తే, అఖిల భారత 20వ పశుగణన (2019) ప్రకారం 46 లక్షల గోజాతి పశువులు, 62 లక్షల గేదె జాతి పశువులు, 175 లక్షల గొర్రెలు, 55 లక్షల మేకలు, 90 వేల పందులు, 1088 లక్షల కోళ్ల సంఖ్యతో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉన్నది. ప్రపంచ ఖ్యాతి ఒంగోలు జాతి పశువులు, నెల్లూరు జాతి గొర్రెలు మన రాష్ట్ర సంపదే. అలాగే అసీల్ జాతి కోళ్లకు కూడా మన రాష్ట్రం పుట్టినిల్లు. మన రాష్ట్ర ఆదాయంలో పశుసంవర్థక రంగం ద్వారా సంవత్సరానికి 165 లక్షల కోట్లు సమకూరుతున్నాయి. ఆదాయమే కాదు ఎక్కువ సంఖ్యలో ముఖ్యంగా మహిళలకు జీవనోపాధి కల్గించేది పశుసంవర్థక రంగమే. పశు సంపద ఉత్పాదకత, కోళ్ల యొక్క ఉత్పాదకత ఆయా జాతుల జన్యువుల నాణ్యత, పశు ఆహారం అనగా మేలైన పశుగ్రాసాలు, పశుదాణాల లభ్యత, పశు వైద్యసేవలు, యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. పశు పోషణ, గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పరిశ్రమ ద్వారా జీవనోపాధి, మనుషులకు ఆహారం, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆదాయం లభించి తరతరాలుగా మానవాభివద్ధి జరుగుతుంది. ఈ విధంగా పశుపక్ష్యాదులు, పెంపుడు జంతువులు, అడవి జంతువుల యొక్క వైద్య, ఆరోగ్యాలతో బాటు సంరక్షణ, పశుఉత్పత్తులైన పాలు, గుడ్లు, మాంసఉత్పత్తితో బాటు, ఉత్పాదకతను పెంచి, ప్రజారోగ్యం యొక్క బాధ్యతను నిర్వహించేది పశుసంవర్దక శాఖే. ప్రస్తుతం పశుసంవర్ధక శాఖలో ముగ్గురు డైరెక్టరు స్థాయి అధికారులు, వారికి సహాయంగా ముగ్గురు అడిషనల్ డైరెక్టర్లు, 25 మంది జాయింట్ డైరెక్టర్లు, 110 మంది డిప్యూటి డైరెక్టర్లు, 470 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, 1900 మంది డాక్టర్లు (ఖాళీగా ఉన్నవి 300 మంది), 2800 పశువైద్య సేవా సిబ్బంది, గ్రామ సచివాలయం / రైతు సేవా కేంద్రాల్లో 6000 మంది పశుసంవర్ధక సహాయకులు పని చేస్తున్నారు. వీరితో బాటు గౌరవ వేతనంతో కత్రిమ గర్భదారణ టెక్నీషియన్లు (గోపాల మిత్రలు) 2000 వరకు ఉన్నారు. వీరందరూ, పశుసంవర్ధక శాఖలోని వివిధ విభాగాలైన పశుగణాభివద్ధి సంస్థ, పశువ్యాధి నిర్ధారణ, ప్రయోగశాలలు, పరిశోధన విభాగాలు, గొర్రెలు, మేకల అభివద్ధి సహకార సంస్థ ద్వారా సేవలను అందిస్తున్నారు. ప్రధానంగా పశువైద్య సేవలు, కత్రిమ గర్బధారణ పశు వ్యాధుల నివారణ టీకాలు, డీవార్మింగ్ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత డిపార్టుమెంట్ నిర్వహిస్తుంది. అయితే మారిన పరిస్థితుల్లో పశు సంపద అభివద్ధి కొరకో, గ్రామస్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకొని, లక్ష్య సాధనకు, సిబ్బంది పర్యవేక్షణ, నిరంతర సమీక్షల అవసరము ఎంతైనా ఉన్నది. ఒకవైపు పాడి పరిశ్రమ ద్వారా ఆదాయము సన్నగిల్లుటతో పాటు, యువత నిరాసక్తత, పాలు, పాల ఉత్పత్తులకు, గుడ్లకు, మాంసానికి ప్రాంతాల వారిగా, వాతావరణ మార్పుల కారణంతో మార్కెట్ ఒడిదుడుకులు కన్పిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో చైనా పాల ఉత్పత్తులకు దిగుమతి దేశంగా ఉన్న పరిస్థితి నుంచి, స్వయం సమద్ధి దశకు చేరుకోవడంతో, న్యూజిలాండ్, ఇతర యూరోపియన్ దేశాల పాలు, పాలు ఉత్పత్తులకు గిరాకి మందగించింది. ఈ పరిస్థితుల్లో వారు మన దేశ పాల మార్కెట్లో ప్రవేశించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మన దేశం తీసుకుంటే పాల ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి చిన్నస్థాయిలో ఎక్కువ మంది రైతుల భాగస్వామ్యంతో జరిగే వ్యాపకం. కాబట్టి రాష్ట్ర పశుసంవర్దక కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిర్వహించాలంటే, పశువైద్య సేవలు, అభివద్ధి పథకాల తోడ్పాటు, జంతు సంక్షేమ పథకాలు, మేలైన పశుజాతుల అభివద్ధి కోసం ఇటీవల అందుబాటులో ఉన్న లింగ నిర్ధారిత వీర్యాన్ని ప్రతి రైతు, ప్రతి ఫారమ్ స్థాయికి తీసుకెళ్లి ఒకవైపు ఉత్పాదకతను అభివద్ధి చేస్తూ, మరో పక్క ఆహార భద్రత, ఆహార రక్షణ వైపు దష్టి సారించాలి. వీటన్నిటితో పాటు పాలు, పాల ఉత్పత్తులకు సరైన ధర లభించేందుకు అటు కో ఆపరేటివ్ డైరీలు గాని, ప్రయివేటు డైరీలు గాని పారదర్శకంగా ధరలు చెల్లించేటట్లు చూడాలి. అదేవిధంగా పాల చట్టం (మిల్క్ యాక్ట్), పశుదాణా చట్టం (ఫీడ్ యాక్ట్) పశు సంక్షేమ చట్టాలను పశు సంవర్దక శాఖ సిబ్బంది ద్వారా ఖచ్చితంగా అమలుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువలన క్షేత్రస్థాయిలో ఉన్న పశువైద్య సహాయ సిబ్బందిని తగిన అజమాయిషీతో విధుల నిర్వహణకు ఖాళీలుగా ఉన్న పశు వైద్య పోస్టులను వెంటనే భర్తీ చేసి రైతుకు మెరుగైన సేవలు అందించాలి. పశు వైద్యశాలల భవన నిర్మాణం, మరమ్మత్తులు, సిబ్బంది పూర్తి సామర్థ్యంతో పనిచేసే వాతావరణం, సకాలంలో పశువుల మందుల సరఫరాల పట్ల మరింత శ్రద్ధ పెట్టినట్లయితే సత్ఫలితాల సాధన కష్టమేమి కాదు. అత్యవసర మందులకు ప్రత్యేక చక్రనిధి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచినట్లయితే అత్యవసర కేసుల చికిత్సకు కొంత న్యాయం చేసినట్లవుతుంది. ఏ శాఖకు లేనన్ని భవనాలు, పశుసంవర్ధక శాఖలో రైతుల వితరణతో నిర్మించి, ప్రస్తుత పరిస్థితుల్లో మరమ్మత్తులకు ఎదురుచూస్తున్నాయి. కాబట్టి సిబ్బందిని ప్రణాళికాబద్దంగా సమీక్షించి, పర్యవేక్షణకు వీలుగా ఉన్నతాధికారులకు సదుపాయాలు కల్గించి ముందుకెళ్లినట్లయితే లక్ష్య సాధన మార్గం సుగమమవుతుంది. పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, రిటైర్డ్
సెల్ : 9177783009


