మిచెల్ స్టార్
ప్రపంచంలో ఎన్నో రకాల రోగాలకు మందులు ఉన్నాయి. కానీ నాడీ వ్యవస్థకు సంబందించిన అల్జీమర్స్ , పార్కిన్సన్స్ డిమెన్షియా లాంటి వ్యాధులకు సరైన చికిత్స అనేది ఇప్పటివరకు లేదు. ఈ సందర్భంగా ఈ వ్యాధుల వెనుక గల కారణాలు తెలుసుకోవడానికి శాంటా క్రూజ్ లోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన రోబోటిక్స్ , ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు సంబందించిన పరిశోధకుడు యాష్ రాబిన్స్ ప్రయోగాలు చేస్తున్నారు. లాబ్స్ లో మినీ బ్రెయిన్స్ ని అభివృద్ధి చేశారు. ఈ కృత్రిమ మెదడు మీద చేసే ప్రయోగాలు నాడి సంబంధమైన ఎన్నో రకాల వ్యాధులకు పరిష్కారాలు చూపిస్తాయంటున్నారు. ఇది మనిషి మెదడులా కనిపిస్తుంది కానీ కాదు. దానికి జీవం ఉండదు. సొంత ఆలోచన శక్తి కూడా ఉండదు. ఈ మినీ బ్రెయిన్ ని ఎలుకల్లోని మూల కణాలను తీసుకుని తయారు చేసారు. మనిషికి వచ్చే రోగాలకు సంబందించిన ప్రయోగాలు ఎక్కువగా కోతులు, ఎలుకల మీదనే చేస్తారన్న విషయం మనకు తెలిసిందే. వీటిని “చిన్న కణజాల సమూహం “ అని “మినీ బ్రెయిన్స్ “ అని “సెరిబ్రల్ ఆర్గనాయిడ్ “ అనే పేర్లతో పిలుస్తారు. మనిషి శరీరం అంతా న్యూరాన్స్ తో నిండిపోయి ఉంటుంది. కంప్యూటర్ లో ఎలా డేటా స్టోర్ చేస్తామో మన మెదడు కూడా మొత్తం డేటాని ఈ న్యూరాన్స్ లో నిక్షిప్తం చేసుకుంటుంది . ఈ న్యూరాన్స్ కారణంగా శరీరానికి సొంతంగా ఆలోచించుకునే వ్యవస్థ అలాగే సమస్యను పరిష్కరించుకునే మార్గాలు సహజంగానే ఏర్పడతాయి . అంటే మన శరీరంలో ఉండే సెన్సార్లను న్యూరాన్స్ అని అందులో ఉండే డాటాను మనం మెమొరీ అని పిలుచుకుంటాం. ఆ మెమొరీ లాస్నే అల్జీమర్స్ అని పార్కిన్సన్స్ అని రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. ఐతే వయసు పెరిగే కొద్దీ మనిషి పైకి బానే ఉన్నట్టు కనిపించినా అంతర్లీనంగా గుర్తుపట్టే శక్తిని దశలవారీగా కోల్పోతూ ఉంటారు . ఒకవేళ గుర్తించిన ఆ కాసేపు వరకే. ఆ తర్వాత ఆ డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోతోంది. ప్రపంచంలో అత్యంత కీలకమైన వైద్య చికిత్సల్లో న్యూరాన్ సర్జరీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి . అందుకే అసలు ఈ వ్యాధులకు గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయోగశాలల్లో మినీ బ్రెయిన్స్ మీద పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. ఈ మెదడు టిష్యులకు అంటే ఈ కణాలకు (న్యూరాన్స్ ) కు ట్రైనింగ్ ఇచ్చారు పరిశోధకులు . అది కూడా ఏ ఐ ద్వారా రూపొందించిన ఒక అల్గోరిథం సాయంతో . వాటికి టాస్కులు ఇవ్వడం ద్వారా వర్చువల్ గా అది ఏ స్థాయిలో దాని సామర్ధ్యాన్ని నిరూపిస్తుందో పరీక్షలు చేశారు. అలాగే వాటికి మార్కులు కూడా ఇచ్చారు ఈ పరిశోధకులు. మొదటి దశలో ఆర్గనాయిడ్ కి ఒక యాక్టివిటీ అంటే ఒక ఇంజనీరింగ్ సమస్యను ఇచ్చారు. అది ప్రతిస్పందిస్తుందా లేదా గమనించారు . ఆ తర్వాత దశలో దాని సామర్ధ్యం తగ్గినప్పుడు ఆ కణాలను ఉత్తేజపరిచి నిరంతరం దానికి శిక్షణ ఇచ్చారు. ఈ ప్రయోగశాలల్లో వర్చువల్ ఏ ఐ జిమ్ లో ఈ మినీ బ్రెయిన్ కి కార్ట్ – పోల్ టాస్క్ ని ఇచ్చారు. అంటే ఒక చిన్న చక్రాల బండి మీద ఒక చిన్న పోల్ ని నిలబెట్టి దాన్ని బ్యాలెన్స్ చేయగలదా లేదా అనే ప్రయోగం చేశారు. ఆ పోల్ అటు ఇటు ఒరగకుండా ఈ మెదడు బ్యాలెన్స్ చేయగలుగుతుందా లేదా అనే విషయాన్నీ గమనించారు. ఆ మినీ బ్రెయిన్‌కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇచ్చి ఆ పోల్ ని బాలన్స్ చేసేలా ట్యూన్ చేశారు. దాంతో ఆర్గనాయిడ్ ఇచ్చిన స్పందన ఆధారంగా ఈ కార్ట్ కదిలింది. కొన్ని సందర్భాల్లో దాని పని తీరు సరిగా లేనప్పుడు ఎలక్ట్రికల్ సంకేతాలు ఇచ్చి ఆ బ్రెయిన్ ని ఉత్తేజపరిచి మళ్ళీ టాస్క్ పూర్తి చేసేలా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ఎలక్ట్రిక్ సంకేతాలు అనేవి ఒక కృత్రిమ టీచర్ లా ఆ మినీ బ్రెయిన్ కి ఎలా చెప్తే అలా చేసింది. వీటికి సరైన ఫీడ్ బ్యాక్ ఇవ్వడం వలన ఈ టాస్క్ పూర్తి చేయగలిగింది అన్న విషయాన్నీ పరిశోధకులు గ్రహించారు. మొదట్లో ఆ కణజాల స్పందన ఆధారంగా వారు మార్పులు చేర్పులు చేస్తూ వెళ్లారు. ఈ మినీ బ్రెయిన్ సొంతంగా ఆలోచించదు కానీ సిగ్నల్ కోచింగ్ ద్వారా కార్ట్ – పోల్ టాస్క్ ని పూర్తి చేసింది. అంటే న్యూరాన్స్ కి సరైన గైడెన్స్ ఇస్తే పని తీరు అద్భుతంగా ఉంటుందని తెలుసుకున్నారు. ఐతే ఇంకో ముఖ్య విషయాన్నీ కూడా వాళ్ళు గమనించారు. ఈ టాస్క్ లో కొంతసేపటి వరకు విరామం లేకుండా ఉత్సాహంతో పని చేసిన ఈ మినీ బ్రెయిన్‌కి కాసేపు విశ్రాంతి ఇచ్చాక పరీక్షిస్తే మళ్ళీ సమస్య మొదటికే వచ్చింది. అంటే ఆ క్షణానికో ఆ కొంత సమయం వరకు మెదడు చురుగ్గా పని చేసినా కానీ ఆ తర్వాత దీర్ఘకాల జ్ఞాపకాలు అనేవి గుర్తుండవు అనే విషయాన్నీ స్పష్టంగా తెలుసుకోగలిగారు. కానీ ప్యాట్రన్ రికగ్నిషన్ టాస్క్ లో మాత్రం దాని పనితీరు మందగించింది. ఐతే ఈ కోచింగ్ టెక్నిక్స్ లో ఏ టెక్నీక్ కి ఈ మెదడు సరిగ్గా ప్రతిస్పందిస్తుందో ఎంత సమయం పాటు దాని పని తీరు ఉండగలుగుతుందో దాని మీద అధ్యయనం చేయడమే లక్ష్యంగా పరిశోధకులు చెప్తున్నారు. ఈ పరిశోధన వలన న్యూరాన్స్ మధ్యలో సమాచారం ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది…ఎలా ఉత్తేజం పొందుతాయి అనేది తెలుసుకోవడమే ముఖ్య లక్ష్యం అని అంటున్నారు పరిశోధకులు. ఇది శాస్త్ర పరిశోధనకే కాదు రాబోయే రోజుల్లో ఆరోగ్య పరిశోధనకు కూడా ఉపయోగపడే అంశంగా భావిస్తున్నారు. అలాగే న్యూరోలాజికల్ సమస్యలు మెదడు నేర్చుకునే సామర్థ్యాన్ని ఎలా మార్చేస్తాయి ఎలా దెబ్బతీస్తాయో అధ్యయనం చేయడానికి ఒక శక్తిమంతమైన సాధనంగా ఈ ప్రక్రియ నిలుస్తుంది అంటున్నారు పరిశోధకుడు యాష్. ఈ పరిశోధన వలన నాడీ సంబంధిత వ్యాధులకు సంబంధించి ట్రీట్మెంట్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో చేస్తున్నామన్నారు. అంతేకాని ప్రయోగశాలల్లో జంతు కణజాలంతో తయారు చేసిన మెదడును మనుషులకు అమర్చి రోబోటిక్ కంట్రోలింగ్ చేయడం తమ ఉద్దేశం కాదని చెప్పారు శాంటా క్రూజ్‌కు చెందిన బయోఇన్ఫర్మేటిషియన్ డేవిడ్ హౌస్లర్. ఒకవేళ ఈ మినీ బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ని వాడడం మొదలుపెడితే భవిష్యత్తులో నైతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా వివరించారు.


