
. పనిగంటలు పెంచి శ్రమదోపిడీ
. మున్సిపల్ కార్మికుల క్రమబద్ధీకరణకు పోరాటం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపు
. కార్మికద్రోహి మోదీ: రాధాకృష్ణన్
. రాజమహేంద్రవరంలో మున్సిపల్ కార్మికుల భారీ ర్యాలీ
విశాలాంధ్ర- రాజమహేంద్రవరం: పాలకులు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కష్టజీవులకు అండగా ఎర్రజెండా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య భరోసా ఇచ్చారు. స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్రమహాసభల సందర్భంగా సోమవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అంతకముందు స్థానిక మున్సిపల్ స్టేడియం నుండి మున్సిపల్ కార్మిక మహా ప్రదర్శన జరిగింది. వేలాదిమంది కార్మికులు ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శన తడితోట సెంటర్, బైపాస్ రోడ్డు, దేవీచౌక్, గోకవరం బస్‌స్టాండ్ మీదుగా సుబ్రమణ్య మైదానానికి చేరుకుంది. తమ హక్కుల కోసం దిక్కులు పిక్కటిల్లేలా కార్మికులు నినదించారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు యూనియన్ అధ్యక్షులు ఆసుల రంగనాయకులు అధ్యక్షత వహించారు.
జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ యజమానులకు, పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిగంటలు పెంచుతున్నాయని విమర్శించారు. కార్మికుల శ్రమను దోచుకోవడం దారుణమన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్ ప్రయోజనాలు కాపాడటానికే పనిచేస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గ్యాస్ ధరలు పెంచిన ప్రధాని మోదీ…మహిళలకు పెద్ద కానుక ఇచ్చారని ఎద్దేవా చేశారు. వంటగ్యాస్‌పై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ బండపై 115 రూపాయలు పెంచడం దుర్మార్గమన్నారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండగల్లో గ్యాస్ ధర పెంచి ప్రజలపై మోయలేని భారం వేశారని, 2029 ఎన్నికల్లో మోదీకి దేశ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం తప్పదని ఈశ్వరయ్య అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మోదీ మరిచిపోయారని, వచ్చే ఎన్నికల్లో మోదీకి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. ఏపీలో గ్యాస్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నా… ధరలు పెంచి అదానీ, అంబానీకి లబ్ధి చేకూర్చేందుకు మోదీ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారన్నారు. గ్యాస్ ధరలు పెంచడమంటే సామాన్యులపై భారం మోపడమేనని, పెంచిన గ్యాస్ ధర తక్షణమే తగ్గించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధం నిలుపుదల చేయించడంలో మోదీ విఫలమయ్యారన్నారు. అదానీ ఫైల్స్ ఎక్కడ బయట పడతాయోనన్న భయంతో మోదీ దేశ భవిష్యత్తును ట్రంప్‌కు తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. అన్ని విధాలుగా ప్రజాజీవితాన్ని దెబ్బతీస్తున్న గ్యాస్ ధర పెంపును తక్షణమే ఉపసంహరించుకోకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని ఈశ్వరయ్య హెచ్చరించారు
మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఎం.రాధాకృష్ణన్ మాట్లాడుతూ బడాపారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ వ్యక్తులకు కార్మికుల శ్రమను దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని, దీనివల్ల కార్మికరంగానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగానే మున్సిపల్ కార్మికులు ఆత్మగౌరంతో బతుకుతున్నారని ఆయన చెప్పారు. సమ్మెలు, ఆందోళనల ద్వారానే మున్సిపల్ కార్మికులకు జీతాలు పెరిగాయని, కొన్ని హక్కులు సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల హక్కులను కాలరాస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. .
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని గద్దెనెక్కిన లోకేశ్… మాట మార్చి ఇప్ప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. మున్సిపల్ కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఉద్యోగ భద్రత కరువవుతుందని, సక్రమంగా జీతాలు ఇవ్వరని, పనిభారం పెంచుతూ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తారని ఆయన వివరించారు. ఇప్పటికైనా ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు, ఏఐటీయూసీ నాయకులు ఏసురత్నం, పోరుమామిళ్ల సుబ్బారాయుడు, తులసేంద్ర, నెక్కంటి సుబ్బారావు, కిర్ల కృష్ణారావు, తాటిపాక మధు, రేఖ భాస్కరావు, తోకల ప్రసాద్, కె.రాంబాబు, కోటి దాస్, రాజేష్ గౌడ్, కె.మల్లేశ్వరరావు, సత్యనారాయణ, దొరస్వామి, భజంత్రీ శ్రీనివాస్, కామేష్, రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరావు, డి.దుర్గమ్మ, కాకి శారద తదితరులు పాల్గొన్నారు.


