ఏటా 15 శాతం పెరుగుదల.. పదేళ్లలో మూడు రెట్లు
క్యాపిటల్ వాల్యూ విధానంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రభుత్వం
ఎన్నికల హామీకి తిలోదకాలు
జీవో 198 రద్దుకు పెరుగుతున్న డిమాండ్
విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలోని పట్టణ ప్రజలపై ఆస్తి పన్ను భారం కొండలా పేరుకుపోతోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘క్యాపిటల్ వాల్యూ’ (ఆస్తి విలువ ఆధారిత) పన్ను విధానం ఇప్పుడు సామాన్యుడి పాలిట శాపంగా మారింది. ఎన్నికలకు ముందు ఈ విధానాన్ని వ్యతిరేకించిన కూటమి నాయకులు… అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పాత పద్ధతికే మొగ్గు చూపుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2020లో వచ్చిన జీవో నంబర్ 198, చట్ట సవరణ 44/2020 పట్టణ వాసుల పాలిట శాపంగా మారాయి. గతంలో అద్దె విలువ ఆధారంగా పన్ను ఉండేది, కానీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నెపంతో ఆస్తి విలువ ఆధారంగా పన్నును మార్చారు. దీనివల్ల ఏటా ఆస్తి విలువ పెరిగినప్పుడల్లా పన్ను కూడా దానంతట అదే పెరుగుతోంది. 2020-21లో 100 రూపాయలు ఉన్న పన్ను, కాంపౌండింగ్ పద్ధతిలో పెరుగుతూ 2026-27 నాటికి 231 రూపాయలకు (సుమారు 30 శాతం అదనపు భారం) చేరుతోంది. ఇదే ధోరణి కొనసాగితే 2029-30 నాటికి పన్ను ఏకంగా 352 రూపాయలకు చేరుతుంది. 2021 నుండి 2030 వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం పన్ను పెంపు ఏ స్థాయిలో ఉందో అర్ధమౌతుంది. 2020-21 బేస్ ఇయర్ రూ. 100, 2021-22 15 శాతం పెంపు రూ. 115, 2024-25 22.8 శాతం పెంపు రూ. 175, 2026-27 (రాబోయేది) 30.1 శాతం పెంపు రూ. 231, 2029-30 45.8 శాతం పెంపు రూ. 352 కేవలం పదేళ్ల కాలంలో పన్ను భారం 3.5 రెట్లు పెరగనుంది. అంటే నేడు రూ. 5,000 కట్టే సామాన్యుడు, 2029 నాటికి రూ. 17,500 చెల్లించాల్సి వస్తుంది. ఇంటి ప్లాన్లలో చిన్నపాటి మార్పులు ఉన్నా, నిరుపేదలు నివసించే పట్టాలు లేని ఇళ్లు అయినా.. వాటిని ‘అక్రమ నిర్మాణాలు’గా ముద్ర వేసి ప్రభుత్వం 25 శాతం నుండి 100 శాతం వరకు అదనపు పెనాల్టీ వసూలు చేస్తోంది. 375 చదరపు అడుగుల లోపు ఉన్న ఇళ్లకు రూ. 50 మాత్రమే పన్ను వేయాలని నిబంధన ఉన్నా, ఆక్రమణల పేరుతో వారిపై వంద శాతం పెనాల్టీ వేసి వేలల్లో వసూలు చేస్తున్నారు. ఇది నిరుపేదల పొట్ట కొట్టడమేనని మేధావులు మండిపడుతున్నారు. ఇంటి పన్ను పెరగడం కేవలం యజమానుల సమస్యే కాదు. యజమానులు ఆ భారాన్ని అ?ద్దెదారులపైకి నెట్టేస్తున్నారు. ఫలితంగా పట్టణాల్లో సామాన్య కార్మికులు, ఉద్యోగుల అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వ్యాపార సంస్థలపై పడే పన్ను భారం అంతిమంగా వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసి ద్రవ్యోల్బణానికి కారణమవుతోంది.
రాష్ట్రంలోని 123 నగరాలు, పట్టణాల్లో 2021లో ఆస్తి పన్ను డిమాండ్ రూ. 2,450 కోట్లు ఉండగా, నేడు అది రూ. 3,900 కోట్లకు చేరింది. ప్రభుత్వం తన ఖజానా నింపుకోవడానికి రిజిస్ట్రేషన్ విలువలను పెంచడం, ఆ ప్రభావం నేరుగా ఇంటి పన్నుపై పడటం ఒక విషవలయంలా మారింది. దీనికి తోడు ప్లాన్ల అతిక్రమణల పేరుతో 25 శాతం నుండి 100 శాతం వరకు పెనాల్టీలు వసూలు చేయడం పేద, మధ్యతరగతి వర్గాలను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. 375 చదరపు అడుగుల లోపు ఉన్న చిన్న ఇళ్లకు కేవలం 50 రూపాయల పన్ను మాత్రమే వసూలు చేయాలనే నిబంధన ఉన్నా, క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. పైగా ఇళ్ల పట్టాలు లేని నిరుపేద ఇళ్లను ‘అక్రమ నిర్మాణాలు’గా పరిగణించి 100 శాతం పెనాల్టీ వేయడం దుర్మార్గమని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. “పన్నులు తగ్గిస్తాం.. క్యాపిటల్ వాల్యూ విధానాన్ని సమీక్షిస్తాం” అని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన టిడిపి-జనసేన-బీజేపీ కూటమి, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయకపోవడం గమనార్హం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిమాండ్ నోటీసులు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో, తక్షణమే ప్రభుత్వం స్పందించి పన్ను పెంపును నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు. జీవో 198 చట్ట సవరణ 44/2020లను వెంటనే రద్దు చేయాలి. ఆస్తి విలువ ఆధారిత పద్ధతిని స్వస్తి పలికి, పాత అద్దె విలువ విధానాన్ని పునరుద్ధరించాలి. నిరుపేదల ఇళ్లపై విధిస్తున్న వంద శాతం పెనాల్టీలను ఎత్తివేయాలి. ?2026-27 సంవత్సరానికి పన్ను పెంపు లేకుండా పాత పన్నునే కొనసాగించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే పట్టణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


