ఇస్లామాబాద్‌లో నిర్వహించే యోచన
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్Ž మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 21 వరకు ఉన్నప్పటికీ అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హోర్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లో ఈ సంప్రదింపులు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. అక్కడ చర్చలు జరిపేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. చర్చలకు వచ్చేందుకు ఇరాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో శాంతిస్థాపన దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఆలోపే చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నట్లు తెలిసింది. ఈసారి సంప్రదింపుల్లో ఇరు దేశాల తరఫున ఎవరెవరు పాల్గొంటారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు- ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఆ దేశానికి నౌకల రాకపోకలను హోర్మూజ్ సమీపంలో అడ్డుకుంటోంది. దీనిపై ఆగ్రహంతో ఉన్న ఇరాన్… అమెరికాపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. అమెరికా చర్య తమ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని పేర్కొంది. మరోపక్క హోర్మూజ్ దిగ్బంధనాన్ని సౌదీ కూడా వ్యతిరేకిస్తోంది.


