Home‘కలర్ గ్రానైట’ దోపిడీ

‘కలర్ గ్రానైట’ దోపిడీ

- Advertisement -

. గిరిజన సొసైటీ ముసుగులో కొల్లగొడుతున్న వైనం
. చప్పరపాలెంలో గిరిజనేతరుల కనుసన్నల్లో తవ్వకాలు
. మైనింగ్, రెవెన్యూ అధికారుల మొద్దునిద్ర
. క్వారీ యాజమాన్యంతో కుమ్మక్కు
. ఉన్నతాధికారులకు తప్ప్పుడు నివేదికలు

విశాలాంధ్ర బ్యూరో- రంపచోడవరం: పోలవరం జిల్లా రంపచోడవరం మండలం చుప్పరపాలెం గిరిజన క్వారీ కార్మికుల కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో విలువైన ‘కలర్ గ్రానైట’ దోపిడీ బహిరంగంగానే సాగుతోంది. సొసైటీ కాలపరిమితి ముగిసినా సర్వే నంబర్లు 37/1, 70/2, 72/2లో సుమారు 3.930 హెక్టార్ల విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా, గిరిజనేతర వ్యక్తుల కనుసన్నల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే వరకు లేదా ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసే వరకు పర్సన్ ఇంచార్జిగా సీహెచ్ మరిడయ్యను ప్రభుత్వం నియమించింది. నిబంధనల ప్రకారం క్వారీ కార్యకలాపాలన్నీ సొసైటీ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే సాగాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అబ్బూరి వేణుగోపాల్ అనే గిరిజనేతర వ్యక్తి ఈ క్వారీని ఏకపక్షంగా నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సొసైటీ అధ్యక్షుడి హోదాలో నేసం పోసీరావు చేసిన అనధికారిక ఒప్పందాలను అడ్డుపెట్టుకుని, గిరిజన చట్టాలను తుంగలో తొక్కేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. పర్సన్ ఇంచార్జిగా ఉన్న అధికారికి గిరిజనేతరులతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే అధికారం లేదు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే సదరు అధికారి ఉద్యోగానికే ముప్ప్పు వాటిల్లుతుంది. అయితే, మైనింగ్‌కు అవసరమైన చట్టబద్ధ అనుమతులు లేకపోయినా, పాత ఒప్పందాల ముసుగులో తవ్వకాలు సాగించడం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు అందుతున్నా, పత్రికల్లో వార్తలు వస్తున్నా మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు మొద్దునిద్ర నటిస్తున్నారనే విమర్శలు హల్‌చల్ చేస్తున్నాయి. క్వారీ యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కై, పైస్థాయి అధికారులకు తప్ప్పుడు నివేదికలు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. “అంతా సజావుగానే ఉంది, నిబంధనల ప్రకారమే మైనింగ్ జరుగుతోంది” అంటూ మైనింగ్ శాఖ ఏడీ ఇచ్చే నివేదికలు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో వంటి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. గిరిజనుల ఉపాధి కోసం కేటాయించిన సహజ వనరులను గిరిజనేతరులు కొల్లగొడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం తగదని అంటున్నారు. కలెక్టర్, ఐటీడీఏ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయి విచారణ చేపట్టి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, సొసైటీకి త్వరితగతిన ఎన్నికలు నిర్వహించి, నిజమైన గిరిజన కార్మికులకు న్యాయం చేయాలని ప్రజానీకం కోరుతోంది. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు భూమిని కలిగి ఉండటం లేదా ఒప్పందాలు చేసుకోవడం భూ బదలాయింపు నిరోధక చట్ట (ఎల్‌టీఆర్ 1/70) రీత్యా నేరం. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనుడి నుంచి గిరిజనేతరుడికి లేదా గిరిజనేతరుల మధ్య జరిగే ఎలాంటి భూ బదలాయింపు అయినా చెల్లదు. గిరిజన ప్రాంతాల్లో ‘సమత’ జడ్జిమెంట్ ప్రకారం గిరిజనేతరులకు మైనింగ్ లీజులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి గిరిజన, మైనింగ్, పర్యావరణ చట్టాల ప్రకారం కలెక్టర్ లేదా ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఈ క్వారీ కార్యకలాపాలపై దృష్టి సారించి, పూర్తిస్థాయి విచారణ చేసి, తగు చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల నేతలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు