వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా 238 మిలియన్ డాలర్ల (రూ.2,222 కోట్ల) విలువైన నిఘా డ్రోన్‌ను నష్టపోయింది. ఏప్రిల్ 9న హోర్మూజ్ జలసంధిలో ఈ ఘటన జరిగినట్లు ఇప్పటికే వార్తలు రాగా… తాజాగా అమెరికా నావికాదళం ధ్రువీకరించింది. ఎంక్యూ-4సీ ట్రైటన్ పేరున్న దీనిపై ఎటువంటి దాడి జరగలేదని, సాంకేతిక లోపంతో కూలిపోయినట్లు పేర్కొంది. ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదని వెల్లడించింది. అంతర్జాతీయ గగనతలంలో హోర్మూజ్ జలసంధిపై గస్తీలో ఉండగా ట్రైటన్… అకస్మాత్తుగా ఎమర్జెన్సీ కోడ్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత 50 వేల అడుగుల ఎత్తు నుంచి 10 వేల అడుగుల ఎత్తుకు దిగొచ్చింది. అనంతరం కనిపించకుండా పోయింది. నేవీ సేఫ్టీ కమాండ్ దీనిని క్లాస్ ఏ ప్రమాదంగా వర్గీకరించింది.
రెండు మిలియన్ డాలర్లకుపైగా నష్టాన్ని, విమానం పూర్తిగా ధ్వంసం కావడాన్ని దీనికింద పరిగణిస్తారు. తాజాగా ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించిన అమెరికా… ఏ ప్రాంతంలో జరిగిందో బయటపెట్టలేదు. ఈ ట్రైటన్… అమెరికా నేవీ ఆయుధశక్తిలో అధునాతన మానవరహిత వైమానిక వ్యవస్థల్లో ఒకటి. అధిక ఎత్తులో, సుదూర మిషన్ల కోసం దీనిని తీర్చిదిద్దారు. వ్యూహాత్మక జలమార్గాల్లో మారిటైమ్ ట్రాఫిక్, మిలిటరీ కదలికలు పర్యవేక్షించడంలో ఇది కీలకం. దీనిని కోల్పోవడం అమెరికా నావికాదళానికి గట్టి దెబ్బేనని భావిస్తున్నారు.
హోర్మూజ్‌లో కూలిన అమెరికా నిఘా డ్రోన్
- Advertisement -


