. ఎన్నికల్లో లబ్ధికే నాటకాలు
. రాష్ట్రాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు
. అమరావతిలో మూడో విడత భూ సమీకరణకు వ్యతిరేకం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విశాలాంధ్ర-ఒంగోలు: మూడేళ్ల క్రితం పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా బిల్లును ఎన్డీయే ప్రభుత్వం తిరిగి ఎలా ప్రవేశపెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సూటిగా ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలలో ఓట్లు రాబట్టుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ఈశ్వరయ్య విమర్శించారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును ఆమోదిం పచేసుకునేందుకు బీజేపీ కుట్ర చేసింద న్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అనేక సందేహాలపై గంట సమయమిస్తే మార్పులు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోసపూరితంగానే ఎన్డీయే ప్రభుత్వం మహిళా బిల్లు ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే తమ విజయంగా ప్రచారం చేసుకునేందుకు సన్నద్ధమైందన్నారు. బిల్లు వీగిపోతే ఆ నెపాన్ని ఇండియా ఐక్యసంఘటనపై వేసి, మొసలి కన్నీరు కార్చేందుకు పక్కా పథకం రచించిందని ఈశ్వరయ్య విమర్శించారు. పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు వీగిపోవటంతో ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా దేశంలో మహి ళలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్ప్పుడు బీజేపీ నోరు మెదపలేదన్నారు. మహిళా రెజ్లర్ పట్ల బీజేపీ ఎంపీ అనుచితంగా ప్రవర్తించిన ప్ప్పుడు స్పందించలేదన్నారు. దళిత మహిళపై అత్యాచారం జరిగినప్ప్పుడు మౌనం వహించిందన్నారు. బీజేపీ మనువాద సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మహిళల పట్ల చిన్నచూపు చూస్తూనే ఉన్నదని, అటువంటి బీజేపీ మహిళలంటే తమకు ఎంతో గౌరవం అన్నట్లు శుద్ధపూస పలుకులు పలుకుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా బిల్లు 2034 తర్వాత అమలులోకి వస్తుందని నారీ శక్తి వందన్ పేరుతో బీజేపీ సంబరాలు చేసుకున్న విషయాన్ని బీజేపీ నేతలు మరిచినా… దేశ ప్రజలు మరువలేదని గుర్తు చేశారు. డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దేశంలో విపరీతంగా పెరుగుతున్న జనాభా కారణంగా నాటి ప్రధానులు ఇందిరా గాంధీ, వాజ్‌పేయి 50 సంవత్సరాలు జనగణన నిలిపివేశారని గుర్తుచేశారు. ప్రధానమంత్రుల మాటలు విని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఒకరు లేదా ఇద్దరు నినాదాన్ని అమలులోకి తీసుకొచ్చి జనాభా నియంత్రణకు సహకరించా రన్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు దానిని అమలు చేయకుండా గణనీయంగా జనాభా పెరుగుదలకు దోహదపడ్డారన్నారు. డీలిమిటేషన్ అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల కన్నా ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ నిధుల వాటా ఎక్కువగా పోతుందన్నారు. అందువల్లే ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును అడ్డుకున్నాయన్నారు. బీజేపీ మాటలను మూర్ఖంగా నమ్మి… డీలిమిటేషన్‌కు తెలుగుదేశం, జనసేన, వైసీపీ మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు. దానికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ పక్షాన తమిళనాడులో ప్రచారానికి వెళ్లటం దుర్మార్గమన్నారు.
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఈశ్వరయ్య విమర్శించారు. రేషన్, భూ మాఫియా అధికార పార్టీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. చివరికి వైద్య కళాశాలలకు ఇచ్చిన భూములను కూడా అధికార పార్టీ నాయకులు వదలటం లేదన్నారు. రైతులను, వ్యవసాయాన్ని నిండా ముంచారన్నారు. అమరావతిలో మూడో విడత భూ సేకరణకు సీపీఐ వ్యతిరేకమన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. 30 ఏళ్లుగా దొనకొండ పారిశ్రామిక కారిడార్ అభివద్ధికి ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ఈశ్వరయ్య ఆరోపిం చారు. నిరుద్యోగ యువతకు, రైతులకు, ప్రజలకు చంద్రబాబు అరిచేతిలో స్వర్గం చూపిస్తున్నారన్నారు. సీపీఐ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంతోనే రాష్ట్రాభివద్ధి సాధ్యమన్నారు. ఈ రెండు రంగాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. చంద్రబాబుకు అభివృద్ధి అంటే పోలవరం, అమరావతి తప్ప ఇంకేమీ కనిపించడం లేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న మోసాన్ని బయటపెడుతూ ప్రజానాట్య మండలి కళాకారులు రానున్న కాలంలో ప్రచారాలు నిర్వహిస్తారన్నారు. సమా వేశంలో సీపీఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఆర్.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


